రేప్‌ బాధితులపై టూ ఫింగర్‌ టెస్ట్‌ పరీక్షలు.. సుప్రీం ధర్మాగ్రహం

Supreme Court Orders Centre States Stop Two Finger Test On Victim - Sakshi

న్యూఢిల్లీ: బాధితురాళ్లపై లైంగిక దాడి/అత్యాచార నిర్ధారణ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘టూ ఫింగర్‌ టెస్ట్‌’ విధానాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. తక్షణమే ఈ విధానం నిలిచిపోయేలా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది.

అత్యాచార నిర్ధారణ పరీక్షగా పేరొందిన టూ ఫింగర్‌ టెస్ట్‌ విధానాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విధానానికి  ఎలాంటి శాస్త్రీయత లేదని, పైగా మహిళలను మళ్లీ గాయపర్చడంతో పాటు.. వాళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక నుంచి బాధితురాలి మీద ‘టూ ఫింగర్‌ టెస్ట్‌’ గనుక నిర్వహిస్తే.. దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, అలాంటి పరీక్షలను నిర్వహించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. 

"కేవలం లైంగికంగా చురుకుగా ఉన్నందువల్లే ఆమె అత్యాచారానికి గురైందని నిర్ధారించడం హేయనీయమని.. అది నమ్మశక్యం కాదని.. అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీల పాఠ్యాంశాలను సమీక్షించాలని, స్టడీ మెటీరియల్స్‌ నుంచి ‘టూ ఫింగర్‌ టెస్ట్‌’ విధానాన్ని తొలగించాలని ఆదేశించింది.

మరోవైపు.. ఆరోగ్య శాఖను ఈ విధానానికి ముగింపు పలికే విధంగా హెల్త్‌ వర్కర్స్‌కు ప్రత్యామ్నాయ పద్ధతుల మీద వర్క్‌షాపులతో అవగాహన కల్పించాలని కోరింది.  ఇదిలా ఉంటే 2013లోనూ సుప్రీం కోర్టు టూ ఫింగర్‌ టెస్ట్‌ను తప్పుబట్టింది. ఇది మహిళల గౌరవం, గోప్యతలను దెబ్బ తీస్తుందని పేర్కొంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top