కమల్‌నాథ్‌ పిటిషన్‌పై విచారణ.. ఈసీకి చుక్కెదురు

Supreme Court On Kamal Nath Case - Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌ నాథ్ 'స్టార్ క్యాంపెయినర్' హోదాను రద్దు చేస్తూ ఎలక్షన్‌ కమిషన్‌  తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు 'స్టే' విధించింది. ‘స్టార్ క్యాంపెయినర్ జాబితా నుంచి అభ్యర్థిని తొలగించడానికి మీకు ఎవరు అధికారం ఇచ్చారు.. నాయకుల హోదాపై ఈసీకి నిర్ణయాధికారం ఎక్కడిది’ అని కోర్టు ప్రశ్నించింది. ఈసీకి ఆ నిర్ణయాధికారం లేనందున... కమల్‌ నాథ్ స్టార్ క్యాంపెయినర్ హోదాను రద్దు చేయడంపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బొబ్డే నేత్రుత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం కమల్ ‌నాథ్‌ పిటిషన్‌పై సోమవారం(నవంబర్ 2) విచారణ చేపట్టింది. (చదవండి: ‘స్టార్‌’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్)

మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత ఇమర్తి దేవిని 'ఐటెం' అని కమల్‌ నాథ్ విమర్శించడం తీవ్ర దుమారం రేకెత్తించింది. దీనిపై బీజేపీ నేతలు ఎలక్షన్‌ కమిషన్కి ఫిర్యాదు చేయడంతో... కమిషన్ కమల్ ‌నాథ్ వివరణ కోరింది. అయితే ఆయన వివరణపై అసంతృప్తి వ్యక్తంచేసిన ఈసీ.. ఆయన స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కమల్‌ నాథ్‌ శనివారం సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 'ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్‌ను నియమించుకోవడం రాజకీయ పార్టీలకు ఉన్న హక్కు. ఇందులో ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకోకూడదు. ఒకరకంగా ఇది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించడం లాంటిదే' అని కమల్‌ నాథ్ సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top