
రాష్ట్రపతితో రగడపై సీజేఐ ధర్మాసనం
న్యాయం కోసం ఏ ఆదేశాలైనా ఇస్తాం
అవసరమైతే చట్టాలనూ పక్కన పెడతాం
రాష్ట్రపతి లేఖ ఫక్తు ‘రాజకీయ’ వివాదమే
అయినా సమాధానమిచ్చి తీరతాం: సీజేఐ
న్యాయసమీక్ష ‘మౌలిక నిర్మాణం’లో భాగం
ఆర్టీకల్ 142 కట్టబెట్టిన అసాధారణ అధికారం
రాష్ట్రపతి, గవర్నర్లకు గడువుపై జస్టిస్ గవాయ్
బిల్లులను రాష్ట్రపతి, గవర్నర్లు తొక్కిపట్టజాలరు
తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాల సీనియర్ న్యాయవాదులు సిబల్, సింఘ్వీ
కేంద్రం తరఫున ఎస్‌జీ మెహతా తీవ్ర అభ్యంతరం
న్యూఢిల్లీ: రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి, సుప్రీంకోర్టుల్లో ఎవరు సుప్రీం అన్న అత్యంత కీలకమైన అంశంపై ఆ రెండు వ్యవస్థల నడుమ కొన్ని నెలలుగా నివురుగప్పిన నిప్పులా సాగుతున్న పెను వివాదం ముదురుపాకాన పడింది. ఈ విషయమై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ సారథ్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఏ కేసులోనైనా సరే, సంపూర్ణ న్యాయం చేకూర్చేందుకు అవసరమైన అన్ని రకాల ఆదేశాలూ ఇచ్చి తీరతామని కుండబద్దలు కొట్టింది.
‘‘అందుకోసం అవసరమతే ప్రస్తుత చట్టాల్లోని లోపాలను బేఖాతరు చేయాల్సి వచి్చనా ఏ మాత్రమూ వెనకాడబోం. ఎందుకంటే ఆర్టీకల్ 142 కింద సుప్రీంకోర్టుకు స్వయానా రాజ్యాంగమే కట్టబెట్టిన అసాధారణమైన విచక్షణాధికారమది’’ అని కుండబద్దలు కొట్టింది. అంతేగాక, అత్యున్నత న్యాయస్థానానికి దఖలు పడ్డ న్యాయ సమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమని చరిత్రాత్మకమైన మినర్వా మిల్స్ కేసును ఉటంకిస్తూ గుర్తు చేసింది. తద్వారా, సుప్రీంకోర్టు అధికార పరిధికి అంతిమంగా రాష్ట్రపతి కూడా లోబడాల్సిందేనని చెప్పకనే చెప్పింది.
అసెంబ్లీలు ఆమోదించే బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు గవర్నర్లతో పాటు ఏకంగా రాష్ట్రపతికి కూడా 3 నెలల గడువు విధిస్తూ సీజేఐ ధర్మాసనం ఇటీవల వెలువరించిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించడం తెలిసిందే. దానిపై కీలక రాజ్యాంగపరమైన సందేహాలు లేవనెత్తుతూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టుకే లేఖ రాయడం మరింత సంచలనంగా మారింది. దానిపై సీజేఐ ధర్మాసనం ఎదుట మంగళవారం ఆరో రోజు కూడా విచారణ కొనసాగింది. రాజ్యాంగపరమైనవంటూ ఈ విషయమై రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలు వాస్తవానికి రాజకీయపరమైనవవేనని ఈ సందర్భంగా ధర్మాసనం తేల్చేసింది.
అయినా సరే, రాష్ట్రపతి లేవనెత్తిన ‘రాజ్యాంగపరమైన’ ప్రశ్నలకు సమాధానం నిరాకరించజాలమని పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆమోదించే విషయంలో రాష్ట్రపతికి, గవర్నర్లకు గడువు విధిస్తూ ఆదేశాలిచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందో లేదో తేల్చాలంటూ ఆర్టీకల్ 143(1) కింద దఖలు పడ్డ విచక్షణాధికారాలను వాడుకుంటూ ద్రౌపదీ ముర్ము గత మే నెలలో సీజేఐకి లేఖ రాసింది.
వారికి ఆ అధికారాల్లేవ్!
గవర్నర్లు బిల్లులకు ఆమోదం తెలపకుండా తొక్కిపెట్టడం ప్రజాభీష్టాన్ని కాదనడమేనని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూ చరిత్రలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందన్నారు. ‘‘ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు అవరోధంగా మారేందుకు రాజ్యాంగంలోని ఏ సూత్రమూ అనుమతించదు. అసలు విచక్షణ అనే భావనే ఆర్టీకల్ 200కు ఫక్తు విరుద్ధం.
గవర్నర్ నిర్వర్తించేది రాజ్యాంగ విధి, అంతే తప్ప స్వేచ్ఛాయుత ఎంపిక కాదు‘ అని వాదించారు. రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలు రాజ్యాంగ సమీక్షకు అతీతమని కేంద్రం భావిస్తోందంటూ తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి మండిపడ్డారు. అలా బిల్లులను ఆపేసేందుకు రాష్ట్రపతికి, గవర్నర్లకు ఎలాంటి స్వతంత్ర అధికారాలూ లేవని వాదించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో తలెత్తిన న్యాయ వివాదాలను సింఘ్వీ తన వాదనకు మద్దతుగా ప్రస్తావించారు. దాన్ని కేంద్రం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తీవ్రంగా తప్పుబట్టారు.
‘‘అలాంటి కేసులనే వాదనలకు ఆధారంగా చూపదలిస్తే మేం (కేంద్రం) కూడా లిఖితపూర్వకంగా సమాధానం సమరి్పంచాల్సి వస్తుంది. స్వతంత్రం వచి్చన నాటినుంచీ కొన్ని రాష్ట్రాల్లో రాజ్యాంగాన్ని అడ్డంగా తుంగలో తొక్కుతూ వచ్చారు. ఆ మురికమయమైన గతాన్ని తవి్వపోయాలనే మీరు భావిస్తుంటే అందుకు సంబంధించిన పూర్తి రికార్డులను మేం కోర్టు ముందుంచుతాం’’ అని సింఘ్వీ, సిబల్‌లను ఉద్దేశించి స్పష్టం చేశారు. సీజేఐ కల్పించుకుని వాతావరణాన్ని చల్లబరిచే ప్రయత్నం చేశారు. ‘‘ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ, కర్నాటక కావచ్చు, మేం కేవలం రాజ్యాంగంలోని నిబంధనలకు నిర్వచిస్తామంతే. అంతకంటే మరేమీ లేదు’’ అంటూ వాదనలను రాజ్యాంగపరమైన అంశాలపైకి మళ్లించారు. విచారణ బుధవారం కూడా కొనసాగనుంది.
మినర్వా కేసు.. మైలురాయి!
న్యాయసమీక్ష రాజ్యాంగ మౌలిక నిర్మాణంలో భాగమంటూ ధర్మాసనం ఉటంకించిన మినర్వా మిల్స్ కేసును భారత న్యాయచరిత్రలోనే అతి కీలక మైలురాయిగా పేర్కొంటారు. ఏ విషయంపై అయినా నిర్ణయాలు తీసుకునే విషయంలో రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతమే సర్వోన్నతమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన చరిత్రాత్మక తీర్పుకు మినర్వా కేసే నిమిత్తంగా నిలిచింది.