
లాంగ్ వీకెండ్ చూసుకుని చెట్లు ధ్వంసం చేసేందుకు ప్లాన్ చేశారా?
పర్యావరణ అనుమతులు తీసుకున్నారా?
మీరు అక్కడ పారిశ్రామిక పార్క్ నిర్మిస్తారా లేక ఇంకేదైనా చేస్తారా అనేది అప్రస్తుతం
కంచ గచ్చిబౌలి కేసులో ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: ‘లాంగ్ వీకెండ్.. అదీ కోర్టుకు సెలవులున్నవి చూసుకుని ప్రీప్లాన్‌తోనే అక్కడ చెట్లన్నీ ధ్వంసం చేశారా? ఉద్దేశపూర్వకంగా విధ్వంసం చేసే ఆలోచన లేకపోతే పనిదినాలైన సోమవారం నుంచి ఆ పనులు చేసుకోవచ్చు కదా? మీరు చేసింది చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లు ఉంది’ అంటూ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిస్టర్ సింఘ్వీ మీరు బుల్డోజర్ల ఫొటోలు చూశారా? డజన్ బుల్డోజర్లను అంత తక్కువ టైంలో మోహరించగలరా? ధ్వంసం చేసిన ప్రాంతంలో పునరుద్ధరణ చర్యలు చేపడతారా? లేక జైలుకు వెళతారా’ అంటూ ప్రశ్నలు సంధించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంచ గచ్చిబౌలి కేసు విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అభిషేక్ మనుసింఘ్వీ, మేనక గురుస్వామి; బీ ద ఛేంజ్ వెల్ఫేర్ సొసైటీ తరపున సీనియర్ న్యాయవాది దామా శేషాద్రి నాయుడు, పి.మోహిత్‌రావు; మరొకరి తరఫున న్యాయవాది ఎస్.నిరంజన్ రెడ్డి, వరుణ్ ఠాకూర్ వాదనలు వినిపించారు.
ఎలాంటి కార్యక్రమాలు జరపట్లేదు
‘ప్రస్తుతం ఆ ప్రాంతంలో పనులన్నీ ఆపేశాం. ఆ భూముల్లో మేము ఎలాంటి కార్యక్రమాలు జరపట్లేదు’ అని ప్రభుత్వం తరపున హాజరైన సింఘ్వీ సుప్రీంకోర్టుకు తెలిపారు. అటవీ పునరుద్ధరణ చర్యల్లో భాగంగా మొక్కలు నాటుతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించి ఫొటోలతో కూడిన సమగ్ర నివేదికను కోర్టుకు అందజేస్తామన్నారు. చెట్లు నరికిన ప్రాంతంలోనే మొక్కలు నాటుతున్నారా అని ధర్మాసనం ప్రశ్నించగా, అక్కడ నాటడం లేదని, మరోచోట నాటుతున్న విషయాన్ని పిటిషనర్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
104 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమిలో దాదాపు 60శాతం చెట్లు నరికివేశారని అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది కె.పరమేశ్వర్ చెప్పారు. అక్కడ చదును చేసిన ఫొటోలను సర్వే ఆఫ్ ఇండియా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ)కి ఇచ్చిందన్నారు. సీఈసీ అవన్నీ ధర్మాసనానికి ఇచి్చందని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం రిప్‌లై ఇస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని చెప్పారు. అక్కడ చెట్ల నరికివేతకు అనుమతులు తీసుకున్నారా అని సింఘ్వీని ప్రశ్నించగా.. సెల్ఫ్ సర్టీఫికెట్ తీసుకున్నామని బదులిచ్చారు. 50 హెక్టార్లకు పైగా ఉంటేనే ఈసీ క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
రాత్రికి రాత్రే ఎందుకు చేశారు?
డజన్ల కొద్దీ బుల్డోజర్‌లను రాత్రికి రాత్రే అక్కడికి తరలించి వేలాది చెట్లు నరికివేయాల్సిన అవసరం ఏం వచి్చందని ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పారిశ్రామిక పార్క్ నిర్మిస్తామని చెబుతూ ప్రభుత్వం అటవీ ప్రాంతాన్ని ధ్వంసం చేసిందని ఎస్.నిరంజన్ రెడ్డి ధర్మాసనానికి చెప్పారు. ‘మీరు అక్కడ పారిశ్రామిక పార్క్ నిర్మిస్తారా? లేక మరే ఇతర నిర్మాణం చేస్తారా? అనేది మాకు అప్రస్తుతం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ అనుమతులు తీసుకున్నారా లేదా అని మరోసారి ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ‘వేలాది చెట్లను నరికివేసిన వీడియోలు చూసి మేం చలించాం.
బుల్డోజర్‌ల శబ్దాలకు జంతువులు ప్రాణభయంతో పరుగులు తీశాయి. ఆ ప్రాంతంలో పర్యావరణాన్ని పునరుద్ధరించే ఆలోచన ఉందా? లేక అక్కడే నిర్మించే తాత్కాలిక జైలుకు మీ చీఫ్ సెక్రటరీ, సంబంధిత అధికారులు జైలుకు వెళతారా? అనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించుకోవాలి’ అని చీఫ్ జస్టిస్ గవాయి హెచ్చరించారు. కంచ గచ్చిబౌలిలో అటవీ పునరుద్ధరణకు రాబోయే వర్షాకాలమే సరైన సమయమని నిరంజన్ రెడ్డి వాదించారు. హైదరాబాద్‌లో రుతుపవనాల సీజన్ జూన్ మొదటి వారం నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. అటవీ పునరుద్ధరణకు ప్రభుత్వం దగ్గర ఎటువంటి ప్రణాళిక లేదని, కావాలనే, జూలైలో వాయిదాకు కోరుతున్నారన్నారు. విచారణను జూలై 23కు వాయిదా వేసిన ధర్మాసనం.. వంద ఎకరాల పునరుద్ధరణపై ప్రణాళికను సమరి్పంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
మూడు స్కూళ్లను కూల్చివేశారు..
చెట్ల నరికివేతపై పోరాడిన 200 మంది యూనివర్సిటీ విద్యార్థులపై మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, కొందరిని జైలుకు పంపారని విజిల్ బ్లోయర్స్ తరపున వరుణ్ ఠాకూర్ వాదనలు వినిపించారు. అయితే ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్నాయని, పలువురు విద్యార్థులు జైల్లో ఉన్నారని చెప్పారు. అలాగే ఈ ప్రాంతంలో మూడు స్కూళ్లను కూల్చివేశారని ఆరోపించారు. విద్యార్థులపై కేసుల్ని కొట్టివేయాలని కోరారు. అయితే స్కూళ్లను బుల్డోజ్ చేశారన్న వాదనపై జస్టిస్ గవాయి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణను మొదటిసారి వింటున్నామని సింఘ్వీ అన్నారు. ఈ అప్లికేషన్ (ఐఏ)ను ఈ కేసుతో కలిపి విచారించడం కుదరదని సీజేఐ స్పష్టం చేశారు. కావాలంటే వేరే పిటిషన్ దాఖలు చేసుకోవాలని ఆదేశిస్తూ... ఐఏను విత్‌డ్రా చేసుకునేందుకు స్వేచ్ఛనిచ్చారు.