
సుప్రీంకోర్టుకు కేంద్ర సాధికార కమిటీ నివేదిక
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను వన్యప్రాణుల రక్షణ చట్టం–1972 నిబంధనల మేరకు రిజర్వు ఫారెస్టుగా ప్రకటించేలా కేంద్ర సాధికార కమిటీ (సీఈసీ) సిఫార్సు చేసింది. భూమి నిర్వహణను కూడా అటవీ శాఖకు అప్పగించాలని అభిప్రాయపడింది. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై సుప్రీంకోర్టు సిద్ధాంత దాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ గురువారం సుప్రీంకోర్టుకు మరో నివేదికను అందజేసింది. ‘400 ఎకరాలపై ఫారెస్టు సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనాన్ని పరిశీలించగా.. 56 శాతం అటవీ ప్రాంతమేనని తేలింది.
ఇందులో కూడా 7.08 శాతం దట్టమైన అడవి (70 లేదా అంతకంటే ఎక్కువ శాతం చెట్లు), 31.89 శాతం మధ్యస్థ అడవి (70శాతం కంటే తక్కువ 40 శాతం కంటే ఎక్కువ చెట్లు), 17.17 శాతం బహిరంగ అడవి (10–40 శాతం చెట్లు) ఉన్నాయి. ఇదంతా చెట్ల నరికివేతకు ముందు. ఈ గణాంకాలు తెలంగాణ సర్కార్ చెప్పిన దానికంటే చాలా ఎక్కువ. 1.44 శాతం దట్టమైన అడవి, 7.99 శాతం మధ్యస్థ అడవి, 9.5 శాతం బహిరంగ అడవి.. అని సర్కార్ పేర్కొంది. చెట్ల నరికివేత తర్వాత.. ఈ గణాంకాలు 0.002 శాతం దట్టమైన, 0.61శాతం మధ్యస్థ, 7.92 శాతం బహిరంగ అడవిగా ఉన్నాయని పేర్కొంది.
ఆకుపచ్చ జీవవైవిధ్యానికి ప్రాముఖ్యత
‘2,300 ఎకరాల భూమిలో గొప్ప జీవవైవిధ్యం దాగిఉంది. ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తుంది. ఈ భూమిని కన్జర్వేషన్ రిజర్వ్‌గా లేదా డీమ్డ్ ఫారెస్ట్‌గా ప్రకటించి, అత్యున్నత స్థాయి రక్షణ కల్పించడంపై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక పార్కు కోసం పాక్షికంగా తొలగించిన చెట్లను నాటి పునరుద్ధరణ పనులు చేపట్టాలి. ఎలాగూ వర్షాకాలం వస్తోంది కనుక స్థానికంగా ఎదిగే చెట్లు, పొద జాతులను దట్టంగా నాటాలి. నేలతోపాటు తేమ పరిరక్షణ కార్యకలాపాలను చేపట్టాలి. రాష్ట్రంలోని అటవీ భూముల పరిశీలన కోసం క్షేత్రస్థాయి అటవీ అధికారులు, పర్యావరణ శాస్త్రవేత్తలు, ఐటీ, రిమోట్ సెన్సింగ్ నిపుణులు, సర్వే ఏజెన్సీలతో కమిటీని పునర్నియమించాలి.
అటవీ ప్రధాన సంరక్షణాధికారి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, భూ యాజమాన్య విభాగాల సీనియర్ అధికారులు, న్యాయ నిపుణులు, పర్యావరణ శాస్త్రవేత్తలతో కూడిన ఉన్నతస్థాయి సమన్వయ కమిటీని వేసి ప్రభుత్వ, సంస్థాగత భూములను గుర్తించాలి. తడి భూములు (సంరక్షణ–నిర్వహణ) నియమాలు–2017 ప్రకారం.. ఈ ప్రాంతంలోని అన్ని నీటి వనరులను తడి భూములుగా రక్షించేందుకు, హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్‌లెట్ల మూసివేతకు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లేదా మరో ప్రముఖ సంస్థ ద్వారా కంచ భూముల సమగ్ర పర్యావరణ అంచనా వేయించాలి’ అని నివేదికలో సీఈసీ సిఫార్సు చేసింది.