ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: అదృశ్యమైన మహాదేవ్ బెట్టింగ్ యాప్ సహ వ్యవస్థాపకుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దుబాయ్ నుండి పారిపోయిన ఆ నిందితుడు, కోర్టులు, దర్యాప్తు సంస్థలతో ఆటలాడుకునే అవకాశం కల్పించవద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం, నిందితుడు రవి ఉప్పల్ దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకోవడంపై తీవ్రంగా స్పందించింది. భారత్ దర్యాప్తు సంస్థల నిఘా నుంచి తప్పించుకున్న ఉప్పల్, దుబాయ్‌లో ఉండేవాడు.
అనంతరం అక్కడి నుండి గుర్తు తెలియని ప్రాంతానికి పారిపోయినట్లు సమాచారం. దీంతో యుఏఈ అధికారులు అతడి అప్పగింత ప్రక్రియను మూసివేయడానికి చర్యలు ప్రారంభించాల్సి వచ్చింది. ‘అతన్ని ఎలా పట్టుకోవాలో ముందు తెలుసుకోండి’.. అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.
రాయ్‌పూర్ ట్రయల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న మనీలాండరింగ్ కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ ఛత్తీస్‌గఢ్ హైకోర్టు మార్చి 22న ఇచ్చిన ఉత్తర్వును సవాలు చేస్తూ.. ఉప్పల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఉప్పల్ తరపు న్యాయవాది సమయం కోరడంతో, ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 14కి వాయిదా వేసింది. దర్యాప్తు సంస్థల కథనం ప్రకారం, ఉప్పల్ తన భాగస్వామి సౌరభ్ చంద్రకర్‌తో కలిసి 2018లో మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ను ఏర్పాటు చేశాడు. ఇది ఆన్‌లైన్ గేమ్‌లపై చట్టవిరుద్ధంగా పందాలకు అనేక యాప్‌లను అనుమతించింది. ఈ స్కాం విలువ రూ.6,000 కోట్లు అని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి.


