మతాచారాలపైనా న్యాయ సమీక్ష | Supreme Court asks whether religious belief or rationality could be matter of judicial review | Sakshi
Sakshi News home page

మతాచారాలపైనా న్యాయ సమీక్ష

Apr 18 2026 4:52 AM | Updated on Apr 18 2026 4:52 AM

Supreme Court asks whether religious belief or rationality could be matter of judicial review

సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వ్యాఖ్య 

ఆలయాల్లో మహిళలపై వివక్షపై కొనసాగిన విచారణ

న్యూఢిల్లీ: మతాచారాలపై కూడా న్యాయ స్థానాలు సమీక్ష చేపట్టవచ్చని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఇలాంటి సందర్భాల్లో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత నమ్మకాలకు అతీతంగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొంది. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు అంతరాత్మ సాక్షిగా,  విస్తృత రాజ్యాంగ చట్రాన్ని మాత్రమే మార్గదర్శకంగా పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. 

కేరళలోని ప్రఖ్యాత శబరిమల ఆలయంతోపాటు వివిధ ప్రార్థనా స్థలాల్లో మహిళలపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలో ఏర్పాటైన 9 మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధావన్, ప్రస్తుత అంశం కేవలం హిందూ ఆచారాలకు లేదా శబరిమలకు సంబంధించింది కాదన్నారు. 

అన్ని మతాలు, విశ్వాసాలు, మనస్సాక్షికి సంబంధించిన అంశాలను నియంత్రించే రాజ్యాంగ చట్రానికి సంబంధించిందని ధావన్‌ అన్నారు. సమాజంలో విభేదాలు ఉన్నప్పుడు వాటి మధ్య సామరస్యం సాధించడమే న్యాయస్థానం లక్ష్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఏ వ్యక్తి అయినా ఒక మతాన్ని ప్రశ్నించవచ్చు కానీ, అది గౌరవప్రదమైనది, నిజాయతీతో కూడినదై ఉండాలన్నారు. 

మతాచారాలను సమీక్షకు గురిచేయడం చాలా అయోమయానికి తావిచ్చే అంశమని ధావన్‌ అభిప్రాయపడ్డారు. శబరిమల ఆచార సంరక్షణ సమితి తరఫున సీనియర్‌ లాయర్‌ వి.గిరి వాదనలు వినిపిస్తూ..శబరిమల ఆలయంలోకి 10–50 ఏళ్ల మహిళలను మినహాయించాలన్న ఉమ్మడి వివేకం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోందన్నారు. ప్రతి ఆలయానికి కొన్ని విశిష్ట ఆచారాలుంటాయని ఆరాధనలో అవి కూడా భాగంగా కొనసాగుతుంటాయని గిరి తెలిపారు. ఇటువంటి వాటన్నిటినీ ఒకే గాటనకట్టి ఆర్టికల్‌ 25(1) హక్కును ఇవి ఉల్లంఘిస్తున్నాయా, బలపరుస్తున్నాయనా అని చూడటం సరికాదని తెలిపారు.

 ‘ఆర్టికల్‌ 25(1) ప్రకారం, నేను అనుసరించే మతాన్ని, అంటే విగ్రహారాధనతో సహా హిందూ మతాన్ని ఆచరించడమే నా ప్రాథమిక హక్కు అని’ పేర్కొన్నారు. అంతకుమునుపు, ఆత్మన్‌ ట్రస్ట్‌ తరఫున లాయర్‌ ఎంఆర్‌ వెంకటేశన్‌..‘రుతుస్రావం సమయంలో మహిళలు స్వచ్ఛందంగా దేవాలయాల్లోకి, పూజా మందిరాల్లోకి ప్రవేశించరు. అది క్రమశిక్షణ, విశ్వాసంతో పెనవేసుకుపోయిన ఆచారం. ఇందులో వివక్షకు తావులేదు. దీనికి శాస్త్రీయ వివరణ ఇవ్వలేను. శాస్త్రం ముగిసినప్పుడు నమ్మకం మొదలవుతుంది’అని తెలిపారు. కాగా, ఈ అంశంపై ఐదు రోజులపాటు జరిగిన విచారణ వచ్చే వారం కూడా కొనసాగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement