విడిగా ఉంచడం విభజనకు దారితీయొచ్చేమో  | Supreme Court allows entry of women of all ages into Sabarimala Temple | Sakshi
Sakshi News home page

విడిగా ఉంచడం విభజనకు దారితీయొచ్చేమో 

Apr 10 2026 5:56 AM | Updated on Apr 10 2026 5:56 AM

Supreme Court allows entry of women of all ages into Sabarimala Temple

ఇది హిందుత్వంపై ప్రతికూల ప్రభావం చూపొచ్చు 

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని నిరాకరించడంపై సుప్రీంకోర్టు అభిప్రాయం

న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి 10–50 ఏళ్ల వయసు మహిళలకు ప్రవేశం నిరాకరించే విధానం కారణంగా సమాజంలో విభజన తలెత్తవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆలయ ప్రవేశం నుంచి మహిళలను దూరంపెట్టడం హిందుత్వంపై ప్రతికూల ప్రభావం పడే ఆస్కారముందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. 

రుతుక్రమ వయసు మహిళలనూ ఆలయంలోకి అనుమతించాలంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పును సమీక్షించాలంటూ 50కిపైగా దాఖలైన పిటిషన్లకు సంబంధించిన వాదోపవాదనలను వరసగా మూడోరోజూ సుప్రీంకోర్టు ఆలకించింది. జస్టిస్‌ బీవీ నాగరత్న, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ అహ్‌సనుద్దీన్‌ అమానుల్లాహ్, జస్టిస్‌ అరవింద్‌ కుమార్, జస్టిస్‌ అగస్టీన్‌ జార్జ్‌ మాసిహ్, జస్టిస్‌ ప్రసన్న బి.వరాలే, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్, జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చిల రాజ్యాంగ ధర్మాసనం ఎదుట గురువారం నాయర్‌ సర్వీస్‌ సొసైటీ, అయ్యప్ప సేవా సమాజం, క్షేత్ర సంరక్షణ సమితుల తరఫున సీనియర్‌ న్యాయవాది సీవీ వైద్యనాథన్‌ వాదనలు విన్పించారు.

 ‘‘ప్రత్యేకంగా ఒక మతశాఖకు సంబంధించి ఆలయంలోకి ఎవరిని అనుమతించాలి? ఎవరు పూజించాలి? ఎవరు దర్శనం చేసుకోవాలి? అనేది ఆ మతశాఖ ఇష్టం’’అని అన్నారు. ఈ వాదనతో జస్టిస్‌ నాగరత్న విభేదించారు. ‘‘వెంకటరమణ దేవరు ఆలయంలోకి గౌడ సారస్వత్‌ బ్రాహ్మణులను మినహా ఎవరినీ రానివ్వబోమని అంటున్నారు. ఒక నిమిషం శబరిమల ఆలయ వివాదం విషయం పక్కనబెడదాం. కేవలం మా వర్గీయులను మాత్రమే ఆలయంలోకి అనుమతిస్తాం, వేరే వాళ్లకు ప్రవేశం లేదు అని అనడం హిందుత్వంలో మంచిదికాదు.

 అంతిమంగా మతంపై ప్రతికూల ప్రభావం పడకుండా చూసుకోవాలి’’అని అన్నారు. జడ్జి నాగరత్న వ్యాఖ్యలతో ధర్మాసనంలోని మరో జడ్జి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ ఏకీభవించారు. భక్తులను ఇలా దూరం పెడితే సమాజంలో విభజనలు తలెత్తుతాయని ఆయన వ్యాఖ్యానించారు. అయినాసరే వైద్యనాథన్‌ తన వాదనలకు కట్టుబడ్డారు. ‘‘తమ వర్గీయులకే ఆలయంలో ప్రాధాన్యత దక్కాలనే ఆలయ యాజమాన్యాలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎలాంటి నిధులను ఆశించబోవు. ప్రైవేట్‌ దాతల నుంచిగానీ ప్రజల నుంచిగానీ విరాళాలు స్వీకరించబోవు. ఆలయాలు వాళ్లపై ఆధారపడవు’’అని అన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement