ట్రబుల్‌ షూటర్‌  | Student leader to CM chair, DK Shivakumar Journey | Sakshi
Sakshi News home page

ట్రబుల్‌ షూటర్‌ 

May 31 2026 4:46 AM | Updated on May 31 2026 4:46 AM

Student leader to CM chair, DK Shivakumar Journey

బెంగళూరు: కన్నడనాట రాజకీయ చదరంగంలో కాంగ్రెస్‌ తరఫున ఎత్తులకు పైఎత్తులు వేస్తూ పార్టీని పలుమార్లు విజయతీరాలకు చేర్చిన రాజకీయ దురంధరుడు డీకే శివకుమార్‌ ఎట్టకేలకు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించబోతున్నారు. రామనగర జిల్లాలోని దొడ్డ అలహళ్లి గ్రామంలో దుమ్ముకొట్టుకుపోయిన వీధుల్లో స్నేహితులతో కలిసి స్వేచ్ఛగా తిరుగుతూ బాల్యాన్ని ఆస్వాదించిన దొడ్డలహళ్లి కెంపెగౌడ శివకుమార్‌ తన నాలుగు దశాబ్దాల రాజకీయప్రస్థానాన్ని కొనసాగిస్తూ సీఎం స్థాయికి ఎదగడం ఆద్యంతం ఆసక్తిదాయకం. 

కనకపుర బండె(గ్రానైట్‌ శిల)గా పేరొందిన డీకే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ సమస్యల సుడిగుండంలో పడిన ప్రతిసారీ పార్టీని కాపాడి ట్రబుల్‌షూటర్‌గా పేరు సంపాదించారు. కనకపుర తాలూకా దొడ్డ అలహళ్లిలో కెంపెగౌడ, గౌరమ్మ దంపతులకు 1962 మే 15న డీకే జన్మించారు. 1980వ దశకంలో కాంగ్రెస్‌ విద్యార్థినేతగా తన రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు. 1985లో తొలిసారిగా సతనూర్‌ అసెంబ్లీ స్థానం నుంచి పోటీచేసి ఓడినా నియోజకవర్గ సమస్యలపై పోరాడి 1989లో అదే స్థానం నుంచి ఘనవిజయం సాధించారు.

 అప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏళ్లే. అప్పట్నుంచి వరసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డ్‌ సృష్టించారు. కనకపుర నియోజకవర్గం ఈయనకు కంచుకోట. 64 ఏళ్ల డీకే కాంగ్రెస్‌లో వొక్కలిగ సామాజికవర్గం నుంచి తిరుగులేని శక్తిగా ఎదిగారు. 2002లో మహారాష్ట్రలో నాటి ముఖ్యమంత్రి విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌ సర్కార్‌ విశ్వాసపరీక్షను ఎదుర్కొన్నప్పుడు విలాస్‌రావ్‌కు డీకే సాయపడ్డారు. పార్టీ ఎమ్మెల్యేలను వెంటనే బెంగళూరు రిసార్ట్‌కు రప్పించి క్రాస్‌ఓటింగ్‌ను నివారించారు. 2018లో జేడీయూతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో కీలక భూమిక పోషించారు. 

తొమ్మిదేళ్ల క్రితం రాజ్యసభ ఎన్నికల వేళ గుజరాత్‌లో 42 మంది పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్‌ ఓటింగ్‌ వలలో చిక్కుకోకుండా చూసుకునే బాధ్యతను పార్టీ అధిష్టానం డీకేకు అప్పగించింది. పార్టీ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి బీజేపీ కుట్రను భగ్నంచేసి డీకే ట్రబుల్‌ షూటర్‌ అని మరోసారి నిరూపించుకుని అధిష్టానం దృష్టిలో పడ్డారు. తర్వాత అక్రమాస్తుల కేసులతో బీజేపీ ప్రభుత్వాలు ఇబ్బందులు పెట్టినా, జైల్లో పడేసినా డీకే ప్రభ ఏమాత్రం తగ్గకపోగా ఆయనకు రాష్ట్రంలో ఆదరణ మరింత పెరిగింది. 

ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ వరస దాడులు, దర్యాప్తుల పర్వం సైతం డీకే ఫాలోయింగ్‌ను అమాంతం పెంచేసింది. 2019 సెపె్టంబర్‌ మూడోతేదీన డీకేను అరెస్ట్‌చేసి 50 రోజులపాటు తీహార్‌ కేంద్ర కారాగారంలో విచారణఖైదీగా ఉంచారు. జైలు శిక్ష భయంతో కమలదళంలో చేరబోతున్నారన్న పుకార్లను పటాపంచలుచేస్తూ ఆయన కాంగ్రెస్‌ పార్టీపై తన అచంచల భక్తిని చాటారు. దీంతో కాంగ్రెస్‌ అధిష్టానం మనసును డీకే గెల్చుకున్నారు. తర్వాత 2020లో పార్టీ ఆయనకు రాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించింది. అప్పట్లో రాష్ట్రంలో పార్టీ అత్యంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటోంది. 2

018 కర్ణాటక శాసనసభ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఘోర వైఫల్యంతో ఆయన నాయకత్వ సమర్థతపై నీలినీడలు కమ్ముకున్నాయి. అయినాసరే పట్టువదలకుండా ప్రయత్నించి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంచేశారు. 2023లో పార్టీని విజయతీరాలకు చేర్చి తన రాజకీయ చాతుర్యాన్ని మరోసారి చాటారు. మరుసటి ఏడాది సైతం రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతంచేయడంతో విజయం సాధించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో పార్టీ ఒకే ఒక్క స్థానంలో గెలవగా 2024 ఎన్నికల్లో 9 చోట్ల విజయకేతనం ఎగరేసేలా చేశారు.

 సీఎం కుర్చీకి తాను అర్హుడినే అని అధిష్టానం వద్ద బలంగా తన వాదనను విన్పించారు. అయితే సిద్ధరామయ్య నుంచి సీనియార్టీ రూపంలో ప్రతిఘటన ఎదురుకావడంతో మధ్యేమార్గంగా డీకేకు అధిష్టానం డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టింది. ఉపముఖ్యమంత్రిగా ఉంటూనే పార్టీ రాష్ట్ర చీఫ్‌గా కొనసాగుతూ పార్టీపై తన పట్టు నిలుపుకున్నారు. ఎట్టకేలకు తాను కలలుగన్న కీలక సీఎం పదవిని కైవసంచేసుకున్నారు. 1993లో ఉషను డీకే పెళ్లాడారు. వీళ్లకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె కెఫే కాఫీడే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ కుమారుడిని వివాహం చేసుకున్నారు. దేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయవేత్తలో డీకే కూడా ఒకరు.  

Advertisement
 
Advertisement
Advertisement