కోట్ల విలువైన.. కొమ్ము గుర్రాలు | Startups worth Rs 8700 crore are unicorns | Sakshi
Sakshi News home page

కోట్ల విలువైన.. కొమ్ము గుర్రాలు

Aug 10 2025 5:31 AM | Updated on Aug 10 2025 5:31 AM

Startups worth Rs 8700 crore are unicorns

రూ.8,700 కోట్ల విలువున్న స్టార్టప్‌లే యూనికార్న్‌లు

దేశంలో ప్రస్తుతం ఇలాంటి కంపెనీల సంఖ్య 121

వినూత్న ఆలోచనలు, వ్యాపార వ్యూహాలతో ఈ స్థాయికి

ఉపాధి, సరికొత్త అవకాశాలు సృష్టిస్తున్న స్ఫూర్తిదాతలు

పేటీఎం, ఫోన్‌పే, జొమాటో, ఓలా, స్విగ్గీ.. ఇలాంటి ఎన్నో కంపెనీలు మనకు సుపరిచితమైనవే. వివిధ రూపాల్లో మన నిత్య జీవితంలోనూ భాగమైపోయాయి. ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయిగా అనొచ్చు. కానీ.. అవి వీటిలా ఒక ప్రత్యేక హోదా పొందలేదు. అదే యూనికార్న్‌. ఒక బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువున్న స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా పిలుస్తారు. ఇవేకాదు.. ఇందులో ఇంకా డెకాకార్న్, హెక్టాకార్న్‌ వంటివీ ఉన్నాయి. యూనికార్న్‌ స్థాయికి చేరడానికి సిద్ధంగా ఉన్న ‘జింక’లూ, ‘చిరుత’లూ కూడా ఉన్నాయి.

‘స్టార్టప్‌’.. మనం తరచూ వింటున్న రు. ఒక వినూత్న ఆలోచన, ధైర్యే సాహసే లక్ష్మీ అన్న స్ఫూర్తితో ఎంతోమంది ఇలాంటివి ఏర్పాటుచేశారు. అలా మార్కెట్లోకి అడుగుపెట్టిన కంపెనీల్లో.. వినూత్న ఆలోచనలు, సాంకేతికత వినియోగం వంటి వాటితో నిలదొక్కుకున్నవి కొన్నే. అలా సుమారు రూ.8,700 కోట్ల మార్కెట్‌ విలువ కలిగిన కంపెనీగా ఎదిగిన స్టార్టప్‌ను యూనికార్న్‌ అని పిలుస్తారు. ఈ పదాన్ని 2013లో వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ ఐలీన్‌ లీ మొట్టమొదట ఉపయోగించారు.

121 యూనికార్న్‌లు
ప్రముఖ మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ సంస్థ ట్రాక్సన్‌ అంచనా ప్రకారం.. మనదేశంలో ప్రస్తుతం 121 యూనికార్న్‌ కంపెనీలు ఉన్నాయి. 2025 జనవరి–ఆగస్టు మధ్య కొత్తగా 4 స్టార్టప్‌లు యూనికార్న్‌లుగా అవతరించాయి. గతేడాది ఈ జాబితాలోకి 6 కంపెనీలు వచ్చి చేరడం విశేషం. ప్రపంచంలో అత్యధిక యూనికార్న్‌లు ఉన్న దేశం అమెరికా. అక్కడ 1,048 ఉన్నాయి. ఆ తరవాతి స్థానంలో చైనా (245) ఉంది. భారత్‌ మూడో స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక యూనికార్న్‌లు ఉన్న నగరం బెంగళూరు. అక్కడ 52 ఉంటే గురుగ్రామ్‌లో 19, ముంబైలో 19 ఉన్నాయి. 

కొన్ని ప్రధాన యూనికార్న్‌ కంపెనీలు
ఆన్‌లైన్‌లో ఆహారం స్విగ్గీ, జొమాటో, లీషియస్‌
ఎడ్‌టెక్‌ అన్‌అకాడమీ, బైజూస్, వేదాంతు, ఫిజిక్స్‌వాలా, లీడ్‌ స్కూల్‌
ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ జెరోధా, గ్రో, అప్‌స్టాక్స్‌

ఆన్‌లైన్‌ పేమెంట్, ఇతర సేవలు ఫోన్‌పే, పేటీఎం
ఆన్‌లైన్‌ ఫార్మసీ టాటా 1 ఎంజీ, ఫార్మ్‌ఈజీ
బైక్, ట్యాక్సీ, ఆటో, క్యాబ్‌ రైడ్స్‌ ర్యాపిడో, ఓలా

క్విక్‌ కామర్స్‌ బ్లింకిట్, జెప్టో
ఆన్‌లైన్‌ గేమింగ్‌ మొబైల్‌ ప్రీమియర్‌ లీగ్, డ్రీమ్‌ 11, గేమ్స్‌ 24 బై 7

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ జెరోధా, గ్రో, అప్‌స్టాక్స్‌

ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే రేజర్‌ పే, బిల్‌డెస్క్‌
సౌందర్య ఉత్పత్తులు, కాస్మెటిక్స్‌: నైకా, పర్పుల్‌
ఆన్‌లైన్‌ షాపింగ్‌ స్నాప్‌డీల్, ఫ్లిప్‌కార్ట్‌

యూనికార్న్‌
1 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీ.

డెకాకార్న్‌
ఇది యూనికార్న్‌ కంటే ఒక మెట్టు ఎక్కువ. 10 బిలియన్‌ డాలర్ల విలువైన సంస్థ. 

హెక్టాకార్న్‌
100 బిలియన్‌ డాలర్ల విలువైన కంపెనీ.

మినికార్న్‌
1 మిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ విలువ ఉండే కంపెనీ. ఇలాంటివి భవిష్యత్తులో యూనికార్న్‌లు అవతరించే అవకాశం ఉంటుంది.

సూనికార్న్‌
సమీప భవిష్యత్తులో యూనికార్న్‌గా ఎదిగేందుకు అవకాశం ఉన్న కంపెనీని ఈ పేరుతో పిలుస్తారు.

గజెల్‌ 
ఇది ఒక రకమైన జింక జాతి. ఇవి గరిష్ఠంగా గంటకు 100 కి.మీ. వేగంతో పరుగెత్తగలవు. వచ్చే మూడేళ్లలో యూనికార్న్‌ హోదా పొందే అవకాశం ఉన్న కంపెనీలను గజెల్‌ అంటారు.

చిరుత 
వచ్చే ఐదేళ్లలో యూనికార్న్‌ హోదా పొందే అవకాశం ఉన్న కంపెనీలను చీతా అని పిలుస్తారు. ఆస్క్‌ ప్రైవేట్‌ వెల్త్‌ హురున్‌ ఇండియా ఫ్యూచర్‌ యూనికార్న్‌ ఇండెక్స్‌ – 2024 ప్రకారం మనదేశంలో 46 గజెల్స్, 106 చిరుతలు ఉన్నాయి.

స్టార్టప్‌ ఇండియా
కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించిన స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం, ప్రోత్సాహకర కార్యక్రమాలు ఈ పదేళ్లలో స్టార్టప్‌లు రికార్డు స్థాయిలో పెరగడానికి దోహదపడ్డాయి. మనదేశంలో యూనికార్న్‌ హోదా పొందిన మొట్టమొదటి స్టార్టప్‌ కంపెనీ ఇన్‌మొబి. ఈ మొబైల్‌ అడ్వర్టయింజింగ్‌ కంపెనీ 2011లో యూనికార్న్‌ హోదా పొందింది. దేశంలో జూన్‌ 30 నాటికి డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ, ఇంటర్నల్‌ ట్రేడ్‌  (డీపీఐఐటీ) లెక్కల ప్రకారం ఉన్న స్టార్టప్‌లు 1,80,683.  

యూనికార్న్‌.. వీటి రూటే వేరు
యూనికార్న్‌ కంపెనీలేవీ రాత్రికిరాత్రే కోట్ల రూపాయల ఆదాయాలు గడించలేదు. దాని వెనుక ఎన్నో సృజనాత్మక ఆలోచనలు ఉన్నాయి. యూనికార్న్‌లలో దాదాపు అన్ని కంపెనీలూ.. ఆయా రంగాల్లో మొట్టమొదటివి. ఈ కంపెనీలన్నీ దాదాపుగా టెక్నాలజీని సద్వినియోగం చేసుకున్నవే. వినియోగదారులకు వస్తువులు, సేవల సౌలభ్యాన్ని పెంచినవే. ఇవి ఏం చేస్తున్నాయంటే...

 ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నాయి
అత్యాధునిక సాంకేతికతలు వినియోగిస్తున్నాయి
సరికొత్త బిజినెస్‌ మోడళ్లను ప్రజలకు పరిచయం చేస్తున్నాయి
వినూత్న వ్యాపార అవకాశాలను సృష్టిస్తున్నాయి
ఎంతోమంది యువతకు స్టార్టప్‌లు ఏర్పాటుచేయాలన్న స్ఫూర్తిని ఇస్తున్నాయి.

మరికొన్ని ప్రముఖ యూనికార్న్‌లు
బిగ్‌ బాస్కెట్, కల్ట్‌ ఫిట్, బోట్, ఫస్ట్‌ క్రై, లెన్స్‌కార్ట్, డెల్హివరీ, పోర్టర్, పాలసీ బజార్, క్రెడ్, అర్బన్‌ కంపెనీ, ప్రిస్టీన్‌ కేర్, ఏథర్, భారత్‌పే, జెటా, మనీవ్యూ, ఏకో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement