ఇండియా ప‌వ‌ర్‌ఫుల్ వెప‌న్స్‌.. శ‌త్రువులకు సింహ‌స్వ‌ప్నం! | specialties about SAMAR, AD Gun, Pechora in india | Sakshi
Sakshi News home page

మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న ఆయుధాలివే!

May 10 2025 2:15 AM | Updated on May 10 2025 4:45 PM

specialties about SAMAR, AD Gun, Pechora in india

పాక్‌ క్షిపణులు, డ్రోన్లను మధ్యలోనే అడ్డుకుని కూల్చేసేందుకు గురువారం కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలను రంగంలోకి దించినట్టు సైన్యం ప్రకటించింది. అత్యాధునిక ఎస్‌–400 ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ మన గగనతలాన్ని కంటికి రెప్పలా కాపాడుతుండటం తెలిసిందే. ఎస్‌–400, ఆకాశ్‌ ఎన్‌జీ, ఎంఆర్‌ఎస్‌ఏఎంలకు తోడుగా కాస్, పెచోరా, సమర్, ఏడీ గన్స్‌ తదితరాలు మన వాయుతలాన్ని పూర్తిగా శత్రు దుర్భేద్యంగా మార్చేశాయి.  


ఇది సోవియట్‌ కాలంనాటి మీడియం రేంజ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ (ఎస్‌ఏఎం) క్షిపణి. అధికారిక నామం ఎస్‌–125 నెవా. దశాబ్దాలుగా సేవలందిస్తోంది. 1970ల నుంచీ మన ఎయిర్‌ డిఫెన్స్‌ నెట్‌వర్క్‌లో అత్యంత విశ్వసనీయమైన, కీలకమైన అస్త్రంగా ఉంటూ వస్తోంది. మానవరహిత వైమానిక వాహనాల (యూఈవీ) పాలిట ఇది సింహస్వప్నమేనని చెప్పాలి. తక్కువ, మధ్యశ్రేణి ఎత్తుల్లోని లక్ష్యాలను ఛేదించడంలో దీనికి తిరుగులేదు. వాటిని గాల్లోనే అడ్డుకుని తునాతునకలు చేసేస్తుంది. గురువారం పాక్‌ డ్రోన్లను ఎక్కడికక్కడ నేలకూల్చడంలో కీలక పాత్ర పోషించింది. 

→ పెచోరాలో రాడార్‌ ఆధారిత మిసైల్‌ లాంచర్, ఫైర్‌ కంట్రోల్‌ యూనిట్‌ ఉంటాయి. 
→ ఐదు హై ఇంటర్‌సెప్టివ్‌ యాంటెన్నాలతో కూడిన 4ఆర్‌90 యత్నాగన్‌ రాడార్‌ దీని ప్రత్యేకత 
→ ఇది సాధారణంగా వీ–600 క్షిపణులను ప్రయోగిస్తుంటుంది. 
→ రక్షణ వ్యవస్థ కన్నుగప్పేందుకు టార్గెట్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని ఇట్టే పట్టేస్తుంది. 
→ ఆ వెంటనే క్షిపణులు ప్రయోగించి వాటిని గాల్లో మధ్యలోనే అడ్డుకుని నేలకూలుస్తుంది. 
→ ఎలక్ట్రానిక్‌ జామింగ్‌ యత్నాలను కూడా ఇది సమర్థంగా అడ్డుకుంటూ పని పూర్తి చేసేస్తుంది. 
→ గుర్తింపు సామర్థ్యం: లక్ష్యాలను 100 కి.మీ. దూరంలోనే గుర్తిస్తుంది. 
→ కచ్చితత్వం: 92 శాతం పై చిలుకే! అందుకే దీన్ని హై కిల్‌ కేపబిలిటీ (హెచ్‌కేకే) వ్యవస్థగా పిలుస్తారు. 
→  ప్రత్యేకత: ఏకకాలంలో రెండు లక్ష్యాలపై గురి పెట్టగలదు. 
→ వేగం: పెచోరా నుంచి ప్రయోగించే క్షిపణులు సెకనుకు 900 మీటర్ల వేగంతో దూసుకెళ్తాయి. కన్నుమూసి తెరిచేలోపు టార్గెట్‌ను నేలకూలుస్తాయి.




కౌంటర్‌ అన్‌మ్యాన్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్స్‌ (సీఏయూఎస్‌). ఇది ప్రధానంగా యాంటీ డ్రోన్‌ వ్యవస్థ. డ్రోన్లను ముందుగానే పసిగట్టి నేలకూలుస్తుంది. ఇంద్రజాల్, భార్గవాస్త్ర అని దీని ముద్దుపేర్లు. 

→ ప్రత్యేకతలు: ఇతర ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలతో సమన్వయం చేసుకుంటూ శత్రు వు పని పడుతుంది. గురువారం జమ్మూ కశ్మీర్, పఠాన్‌కోట్‌పైకి దూసుకొచ్చిన డ్రోన్లను సమీకృత కాజ్‌ గ్రిడ్‌ ద్వారా ఎక్కడివక్కడ గుర్తించి నేలకూల్చారు. 
→ లేయర్డ్‌ అప్రోచ్, అంటే మల్టీ సెన్సర్‌ డిటెక్షన్, సాఫ్ట్‌/హార్డ్‌ కిల్‌ సామర్థ్యం దీని సొంతం. 
→ రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, ఈఓ/ఐఆర్‌ (ఎలక్ట్రో–ఆప్టికల్‌/ఇన్‌ఫ్రారెడ్‌) కెమెరా వంటి పలు మార్గాల్లో ఎంత తక్కువ ఎత్తులో వచ్చే డ్రోన్లనైనా ఇట్టే పసిగడుతుంది. 
→ ఆ వెంటనే అవసరాన్ని బట్టి సాఫ్ట్‌ కిల్‌ (డ్రోన్ల కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌ జామింగ్‌), హార్డ్‌ కిల్‌ (నేలకూల్చడం) చేస్తుంది.



సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌ ఫర్‌ అష్యూర్డ్‌ రిటాలియేషన్‌ (సమర్‌). వైమానిక దళం అమ్ములపొదిలోని తిరుగులేని అస్త్రం. మన ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలో కీలక అంగం. రక్షణ రంగంలో మన స్వావలంబనకు నిలువెత్తు నిదర్శనం.  

→ వైమానిక దళానికి చెందిన మెయింటెనెన్స్‌ కమాండ్‌ దీన్ని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఇందులో ప్రైవేట్‌ రంగ కంపెనీలు కూడా భాగస్వామ్యమయ్యాయి. 
→ స్వల్పశ్రేణి లక్ష్యాల పాలిట మృత్యుపాశం. ఒకసారి దీని కంటబడ్డాక తప్పించుకోవడం అసాధ్యమే. 
→ డ్రోన్లతో పాటు దీని పరిధిలోకి వచ్చే హెలికాప్టర్లు, ఫైటర్‌జెట్లు నేలకూలినట్టే లెక్క. 
→ సమర్‌–1 వ్యవస్థ ఆర్‌–73ఈ, సమర్‌–2 ఆర్‌–27 మిసైళ్లను ఉపయోగిస్తాయి. 
→ ఆర్‌–73ఈ మిసైళ్ల రేంజ్‌ 8 కి.మీ. ఆర్‌–27లది 30 కి.మీ. 
→ ముప్పును బట్టి ఒకే ప్లాట్‌ఫాం నుంచి ఏకకాలంలో రెండు క్షిపణులను ప్రయోగించవచ్చు.



→ ఎల్‌–70: ఇవి 40 ఎంఎం విమాన విధ్వంసక గన్స్‌. తొలుత స్వీడిష్‌ కంపెనీ బోఫోర్స్‌ తయారు చేసిచ్చేది. ఇప్పుడు భారత్‌లోనే తయారవుతున్నాయి. 
→ రాడార్లు, ఎలక్ట్రో–ఆప్టికల్‌ సెన్సర్లు, ఆటో ట్రాకింగ్‌ సిస్టమ్స్‌ వంటివాటి ద్వారా ఎల్‌–70లను పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. 
→ ఇవి నిమిషానికి 240 నుంచి 330 రౌండ్లు పేల్చగలవు. రేంజి 4 కి.మీ. 
→ ఇతర రాడార్ల కన్నుగప్పి వాయుతలం లోనికి వచ్చే డ్రోన్లు కూడా వీటినుంచి తప్పించుకోలేవు. 
→ షిల్కా: జెడ్‌ఎస్‌యూ–24–4 గన్స్‌. షిల్కా అనేది వీటి రష్యన్‌ నిక్‌నేమ్‌. 
→ ఇవి 22 ఎంఎం గన్నర్లు. సెల్ఫ్‌ ప్రొపెల్డ్‌ వ్యవస్థలు. 
→ నిమిషానికి ఏకంగా 4 వేల రౌండ్లు కాల్చగలవు.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement