కర్ణాటక రాజకీయం.. సీఎం కుర్చీ శాపమేనా? | Special Story On Karnataka CM Chair Political Crisis | Sakshi
Sakshi News home page

కర్ణాటక రాజకీయం.. సీఎం కుర్చీ శాపమేనా?

May 29 2026 8:08 AM | Updated on May 29 2026 9:02 AM

Special Story On Karnataka CM Chair Political Crisis

నిశ్చలత.. సుస్థిరత అనేది కన్నడ రాజకీయాలు, ప్రభుత్వాలలో ఎండమావిగానే మిగిలిపోయింది. ఉన్నత పదవికి సోపానమే ధ్యేయంగా, జీవిత లక్ష్యంగా నేతలకు మారడంతో పదవీ రాజకీయాలు పతాకస్థాయికి చేరాయి. ఓ పార్టీలో నుంచి అవలీలగా మరో పార్టీలోకి చేరడం, అంతే వేగంగా ఇంకో పక్షంలోకి దూకడం సాధారణ విషయాలయ్యాయి. ఎన్నికల సమయంలో అయితే ఈ విన్యాసాలకు అంతం ఉండదు. తాజాగా జరిగిన పరిణామాలు కొత్తవేమీ కాదనేది తేటతెల్లమే. గతంలోనూ దశాబ్దాలుగా కుర్చీ రాజకీయాలకు ప్రజలు సుపరిచితం. అందుకే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఐదేళ్ల పాటు సీటులో కూర్చోలేకపోయారు. రాష్ట్ర నేతల వ్యూహాలు, హైకమాండ్‌ల నిర్ణయాలు ముఖ్యమంత్రి పోస్టును మూణ్నాళ్ల ముచ్చట చేశాయి.  

కన్నడనాట ముఖ్యమంత్రి పీఠం అనేది ప్రతి ఒక్క ముఖ్య నేతకు ఓ కల.. ఈ కలను నెరవేర్చుకునేందుకు అనేక ఎత్తుకుపైఎత్తులు వేయాల్సి ఉంటుంది. సీఎం పీఠం దక్కాకా కూడా ఐదేళ్ల పాటు ఈ పదవిలో కూర్చొంటామనే గ్యారెంటీ లేదు. కర్ణాటక రాజకీయ ముఖచిత్రం గమనించే ఎవరికైనా ఈ విషయం సుస్పష్టంగా అర్థం అవుతుంది. చరిత్రలో ఒకరిద్దరు మినహాయించి ఏ ముఖ్యమంత్రి కూడా గట్టిగా ఐదేళ్ల పాటు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకోలేదు.  ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి వైకుంఠపాళిని తలపిస్తూ ముఖ్యమంత్రుల మార్పులు కర్ణాటకలో నిత్యకృత్యంగా మారిపోయాయి.  

సిద్దు– డీకే వార్‌  
ప్రస్తుతం సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య జరుగుతున్న అధికార మారి్పడి వివాదం కొలిక్కి వచ్చింది. అయితే ఇలా ముఖ్యమంత్రి సీటు కోసం జరుగుతున్న పొలిటికల్‌ వార్‌ కర్ణాటకకు కొత్తేమీ కాదు.. గతంలో కూడా పలుమార్లు సీఎం పదవి కోసం చాలా మంది నేతలు  యుద్ధాలు చేశారు. ఇందులో కొందరు పైచేయి సాధిస్తే మరికొందరు చతికిలపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ అనే ఇద్దరు మేటి నాయకులు పోటీపడ్డారు. చాలా రోజుల చర్చల తర్వాత ఆ పార్టీ అధిష్టానం సిద్ధరామయ్యను సీఎంగా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత కథ తెలిసిందే.         

ఎస్‌ఎం కృష్ణ హయాం నుంచీ 
గతంలోకెళ్తే ఎస్‌ఎం కృష్ణ పదవీకాలంలోనూ ఆ తర్వాత  కుమారస్వామి–యడియూరప్ప సంకీర్ణ ప్రభుత్వంలోనూ సీఎం పదవి కోసం పోరాటాలు జరిగిన చరిత్ర ఉంది. 1980–1990 మధ్య కాలంలో కూడా ఇదే విధంగా సీఎం పదవి కోసం పలువురు పోటీపడ్డారు. జనతా పార్టీలో నెలకొన్న మనస్పర్థల కారణంగా తరచూ ముఖ్యమంత్రుల మార్పు జరిగింది. ఆరోపణలు, ప్రత్యర్థి వర్గం ఒత్తిళ్ల మేరకు అప్పట్లో రామకృష్ణ హెగ్డే అధికారం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1990 దశాబ్దంలో కూడా జనాతదళ్‌తో గొడవలు తీవ్రతరం అవ్వడంతో పార్టీ విభజన జరిగిపోయింది. ఈ కారణంగా ఎస్‌ఎం కృష్ణ నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది.  

2018–2019లో సంకీర్ణ ప్రభుత్వం తర్వాత కూడా హఠాత్తుగా సీఎం మార్పు జరిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకున్నప్పటికీ మెజారిటీ నంబర్‌ 113కు దగ్గరగా వచ్చి ఆగింది. అయితే ఎన్నికల అనంతరం జేడీఎస్, కాంగ్రెస్‌ పార్టీలు పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్‌ పార్టీ కంటే ఎక్కువ స్థానాలు కాంగ్రెస్‌ పార్టీ గెలుచుకున్నప్పటికీ సీఎం స్థానాన్ని హెచ్‌డీ కుమారస్వామికి అప్పగించింది. ఏడాదికే ఆపరేషన్‌ కమలతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 2019లో బీఎస్‌ యడియూరప్ప నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత బీజేపీ హైకమాండ్‌ యడియూరప్పతో రాజీనామా చేయించి  2021లో బసవరాజు బొమ్మైకి సీఎం కుర్చీని కట్టబెట్టింది.

యడియూరప్పకూ ఎదురుదెబ్బలు  
2011లో బీజేపీ గెలిచి పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి అయిన బీఎస్‌ యడియూరప్పపై భారీ అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తరువాత బీజేపీలో వర్గ పోరు వల్ల ఏ సీఎం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. నాలుగేళ్లలో ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఆపై సదానంద గౌడ కొన్నాళ్లు, జగదీశ్‌ శెట్టర్‌ కొంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.  

రాష్ట్రంలో సీఎం పదవి కోసం జరిగిన ప్రధాన డ్రామాలు..

  • 2006 కుమారస్వామి సర్కార్‌ పతనం:
    కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు వీగిపోవడంతో బీజేపీతో కలసి జేడీఎస్‌ పార్టీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు

  • 2007 అధికార మార్పిడి వివాదం:
    బీజేపీ–జేడీఎస్‌ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు. 
    తరువాత అధికార మార్పిడి ఒప్పందంలో తలెత్తిన వివాదం, కుప్పకూలిన ప్రభుత్వం

  • 2018 స్పష్టమైన మెజారిటీ లేని ఫలితం
    బీజేపీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా గెలిచినప్పటికీ సంఖ్యాబలం లోపించింది. కాంగ్రెస్, జేడీఎస్‌ ఒక్కటై సర్కారును ఏర్పాటు చేశాయి 
     

  • 2019 ఆపరేషన్‌ కమల:  
    బీజేపీలోకి ఫిరాయించిన కాంగ్రెస్‌–జేడీఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు. సామూహిక రాజీనామాలు, కూలిన సంకీర్ణ ప్రభుత్వం, మళ్లీ అధికారంలోకి బీజేపీ.

  • 2023 కాంగ్రెస్‌ పార్టీ గెలుపు: సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య పోటీ.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement