మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’... క్లుప్తంగా ‘ఏఐ’…కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి... ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. టెక్నాలజీ పెరుగుతోంది... కానీ మనుషులు తరిగిపోతున్నారు. లాభాలు కురుస్తున్నాయి... కానీ ఉపాధి మాయమవుతుంది.
విశ్వవిఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ఒక సందర్భంలో చాలా స్పష్టంగా హెచ్చరించారు: "పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే... అది మానవ జాతి అంతానికే నాంది కాగలదు. అది మనుషులను అధిగమించి, తనను తాను రీ-డిజైన్ చేసుకుంటూ వెళ్తుంది. మితమైన జీవ పరిణామం ఉన్న మనుషులు దానితో పోటీ పడలేరని” ఇవాళ హాకింగ్ అన్న మాటలు అక్షరసత్యం అవుతున్నాయి.
యంత్రం మనిషికి సాయం చేయాలి... కానీ మనుషులనే నామరూపాలు లేకుండా తుడిచేస్తుంటే, ప్రపంచ దేశాల పాలకులు ఎందుకు గుడ్డివాళ్లుగా మిగిలిపోయారు? కోట్లాది మంది ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుంటే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? అసలు కొనుగోలు శక్తి లేని సమాజంలో ఏఐ కంపెనీలు లాభాలు ఎలా ఆర్జిస్తాయి? ఈ ప్రాథమిక ఆర్థిక సూత్రం కార్పొరేట్ శక్తులకు, పాలకులకు ఎందుకు అర్థం కావడం లేదు?
ఏఐతో మానవ వనరులకు పెను ముప్పు వాటిల్లుతుందనేది ఇవాళ ఊహ కాదు... కళ్ల ముందు కనిపిస్తున్న పచ్చి నిజం. మరి ఈ నిజం మన కంటికి కనిపిస్తున్నప్పుడు, ప్రపంచ దేశాలను ఏలుతున్న పాలకుల కళ్లకు ఎందుకు కనిపించడం లేదు? అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రధాని వరకు, యూరప్ దేశాల నేతల నుంచి ఆసియా పాలకుల వరకు... అందరూ ఏఐ సదస్సుల్లో పాల్గొంటూ, టెక్నాలజీని పొగుడుతూ కాలం గడుపుతున్నారు తప్ప, దాని వల్ల రాబోయే సామాజిక వినాశనాన్ని ఎందుకు అడ్డుకోవడం లేదు? విఖ్యాత ఫ్రెంచ్ తత్వవేత్త జీన్-జాక్వెస్ రూసో ఒక మాట అన్నారు: "ప్రజలు శాసనాలు చేసే పాలకులను ఎన్నుకుంటారు... కానీ ఆ పాలకులు ప్రజలను కాక, ధనవంతుల ప్రయోజనాలను రక్షించడానికి చట్టాలు చేస్తారు.
" ఇవాళ ప్రపంచ పాలకుల పరిస్థితి సరిగ్గా అలాగే ఉంది. ఏఐ వల్ల సమాజంలో నిరుద్యోగం పెరిగి, నేరాలు ఎక్కువై, అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయని తెలిసి కూడా పాలకులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఎందుకంటే, పాలకులకు ఎన్నికల వెనుక, వారి అధికార పీఠాల వెనుక ఈ భారీ టెక్ కార్పొరేట్ కంపెనీల లాబీయింగ్ ఉంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఓపెన్ ఏఐ వంటి సంస్థల లాభాల కోసం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఉన్న శ్రమజీవుల జీవితాలను బలిపీఠం ఎక్కిస్తున్నారు.
అంతర్జాతీయ నివేదికల ప్రకారం... ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 శాతం ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కానున్నాయి. అంటే సగానికి పైగా మానవ వనరులు పనికిరాకుండా పోతాయి. ఈ మానవ వనరులను తుడిచిపెట్టడానికి ప్రపంచ ప్రసిద్ధి చెందిన టెక్ కంపెనీలు ఎంతెంత మొత్తాన్ని పెట్టుబడులుగా తగలేస్తున్నాయో తెలిస్తే మనం విస్తుపోవాల్సిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, అమెజాన్ వంటి సంస్థలు కేవలం ఏఐ డేటా సెంటర్లు, చిప్‌ల కోసమే ఏడాదికి వందల బిలియన్ డాలర్లను... అంటే భారతీయ కరెన్సీలో లక్షల కోట్ల రూపాయలను నీళ్లప్రాయంగా ఖర్చు చేస్తున్నాయి.
ఒక్క మైక్రోసాఫ్ట్ సంస్థే ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో వంద బిలియన్ డాలర్ల వ్యయంతో 'స్టార్‌గేట్' అనే భారీ ఏఐ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్‌కు తెరలేపింది. గూగుల్, మెటా సంస్థలు తమ సంప్రదాయ వ్యాపారాలను పక్కనబెట్టి, కేవలం ఏఐ మౌలిక సదుపాయాల కోసమే తమ వార్షిక మూలధన వ్యయాన్ని 40 బిలియన్ డాలర్లకు పైగా పెంచేసాయి. మానవాళి ఆకలిని తీర్చడానికి, పేదరికాన్ని నిర్మూలించడానికి పైసా విదల్చని ఈ కార్పొరేట్ శక్తులు... మనుషుల ఉద్యోగాలను ఊడబీకడానికి మాత్రం అక్షరాలా లక్షల కోట్లను తగలేస్తున్నాయి.
మరి ఒక దేశానికి అత్యంత కీలకమైన మానవ వనరులను ఈ విధంగా విచ్ఛిన్నం చేస్తుంటే, సమాజంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయి. ఆకలి కేకలు ఎక్కువైతే తిరుగుబాట్లు వస్తాయి. ఇంతటి భయానక దుష్పరిణామాలు పొంచి ఉన్నా, పాలకులు కేవలం టెక్నాలజీ భ్రమల్లో బతుకుతుండటం ఈ శతాబ్దపు అతిపెద్ద విషాదం.
ఏఐ పేరుతో, ఆటోమేషన్ పేరుతో కంపెనీలు సింపుల్‌గా ఒక ప్రెస్ నోట్ వదులుతున్నాయి... "మేము ఖర్చులు తగ్గించుకుంటున్నాం... ఉద్యోగులను తొలగిస్తున్నాం" అని. కానీ, ఆ లే ఆఫ్ లేఖ వెనుక ఉన్న ఒక కుటుంబం ఏమైపోవాలి? ఆ ఉద్యోగి నమ్ముకున్న తల్లిదండ్రులు, చదువుకుంటున్న పిల్లలు, కట్టాల్సిన ఇళ్ల లోన్లు, కార్ లోన్లు, రేపటి పూట అహారం... వీటన్నిటికీ సమాధానం ఎవరు చెబుతారు? ఈ నేపథ్యంలోనే వాంచన నగరమైన వాటికన్ నుండి పోప్ లూథర్ XIV తన చారిత్రాత్మక పత్రం "మాగ్నిఫికా హ్యుమానిటాస్" ద్వారా ప్రపంచాన్ని తీవ్రంగా హెచ్చరించారు. సాంకేతికత వేగాన్ని, సమర్థతను మాత్రమే కొలమానంగా తీసుకోకూడదని, కార్మికుడి గౌరవాన్ని, సమాజంలో పాల్గొనే హక్కును గౌరవించాలని స్పష్టం చేశారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పేరుతో జరుగుతున్న "నూతన బానిసత్వాన్ని" పోప్ తీవ్రంగా ఖండించారు. కేవలం టెక్నాలజీ ప్రవాహం నిరంతరాయంగా సాగడం కోసం దారుణమైన పరిస్థితుల్లో ఖనిజాలను వెలికితీస్తూ, డేటా లేబిలింగ్ చేస్తూ శ్రమిస్తున్న అట్టడుగు వర్గాల శారీరక శ్రమను, వారి గాయాలను ప్రపంచ కార్పొరేట్ శక్తులు విస్మరిస్తున్నాయని నిలదీశారు.
ప్రముఖ సామాజిక తత్వవేత్త, రచయిత యువల్ నోవా హరారి తన హెచ్చరికలో ఒక భయంకరమైన పదాన్ని వాడారు. ఏఐ వల్ల భవిష్యత్తులో సమాజంలో "యూస్‌లెస్ క్లాస్" అంటే 'అనవసరమైన శ్రమ జీవుల వర్గం' ఒకటి తయారవుతుందని అన్నారు. అంటే మనుషులకు ఉద్యోగాలే లేకపోవడమే కాదు, అసలు వారు ఆర్థిక వ్యవస్థకు 'అనవసరమైన వారిగా' మారిపోయే ప్రమాదం ఉంది. కానీ ఇవాళ కార్పొరేట్ శక్తులకు సమాజం అంటే మనుషులు కాదు... వారి లాభాల బ్యాలెన్స్ షీట్లు మాత్రమే! సొంత లాభం కోసం పొరుగువాని పొట్ట కొట్టడమే ఏఐ కంపెనీల ఏకైక లక్ష్యంగా మారింది. ఒక్కో ఉద్యోగం పోయినప్పుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే రోడ్డున పడటం లేదు, ఆ వ్యక్తిని నమ్ముకున్న ఒక కుటుంబం నిలువునా కూలిపోతోంది. విద్యావంతులైన యువత, రాత్రి పగలు కష్టపడి చదివి నైపుణ్యాలు సంపాదించుకున్న టెక్ నిపుణులు... ఇవాళ ఏఐ టూల్స్ కారణంగా క్షణాల్లో ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఆ కుటుంబాల ఆక్రందనలు, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు పాలకులకు వినిపించడం లేదా? ఏఐ తీసుకొచ్చిన ఈ కృత్రిమ మేధస్సు వల్ల మనుషుల జీవితాల్లో సహజమైన ఆనందం కరువైపోతోంది. నిరాశ, నిస్పృహలతో యువత ప్రాణాలు తీసుకుంటుంటే, ఈ టెక్నాలజీ ప్రగతి సాధించినట్లు ఎలా అనుకుంటాం?
ఇప్పుడు ఒక ప్రాథమిక ఆర్థిక శాస్త్ర ప్రశ్నను మనం పాలకుల ముందు, ఏఐ కంపెనీల ముందు ఉంచాలి. మానవ వనరులే సర్వస్వం అనుకుంటే... ఏఐ కారణంగా ఆ మానవ వనరుల ఉపాధి దెబ్బతిని, వారి ఆదాయాలు పడిపోతే, సమాజంలో కొనుగోలు శక్తి ఏమైపోవాలి? ఆర్థిక శాస్త్ర పితామహుడు ఆడమ్ స్మిత్ తన 'వెల్త్ ఆఫ్ నేషన్స్'లో స్పష్టంగా చెప్పారు. “ఏ సమాజంలోనైనా మెజారిటీ ప్రజలు పేదరికంలో, బాధల్లో ఉంటే ఆ సమాజం ఎప్పటికీ వర్ధిల్లదు. వినియోగదారుడి డిమాండ్ మాత్రమే మార్కెట్‌ను నడిపిస్తుంది అని” పెట్టుబడిదారీ విధానంలో ఒక పెద్ద లోపం ఉంది... దాన్ని ఈ ఏఐ కంపెనీలు పూర్తిగా మర్చిపోయాయి. మనుషులకు ఉద్యోగాలు లేకపోతే వారికి జీతాలు రావు. జీతాలు రాకపోతే వారి ఆదాయం సున్నా అవుతుంది. ఆదాయం లేనప్పుడు మనుషులు కేవలం తినడానికి తిండి మాత్రమే కొనుక్కుంటారు తప్ప... కార్లు, బైకులు, బట్టలు, ఫోన్లు, విలాసవంతమైన వస్తువులు ఏవీ కొనలేరు. అంటే అన్ని రంగాలు తిరోగమనంలో పడతాయి. రియల్ ఎస్టేట్ కూలిపోతుంది, ఆటోమొబైల్ రంగం దెబ్బతింటుంది, మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ పడిపోతుంది.
మరి సమాజంలో వినియోగమే లేనప్పుడు, మార్కెట్ మొత్తం తిరోగమనంలో పడినప్పుడు... ఈ ఏఐ కంపెనీలకి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? వందల బిలియన్ డాలర్లు తగలేసి వారు తయారు చేసిన సాఫ్ట్‌వేర్లను, టూల్స్‌ను కొనే నాథుడు ఎవరు ఉంటారు? మనుషుల పొట్ట కొట్టి, వారి ఆదాయాన్ని లాగేసుకుని... కార్పొరేట్ సంస్థలు ఎవరికి తమ ఉత్పత్తులను అమ్ముకుంటాయి? రోబోలు రోబోలకి అమ్ముకుంటాయా? సాఫ్ట్‌వేర్లు సాఫ్ట్‌వేర్లతో వ్యాపారం చేస్తాయా?
ఎంతటి మూర్ఖత్వం! మానవ వనరుల వినాశనం అంటే అది చివరకు ఏఐ కంపెనీల వినాశనానికే దారితీస్తుందనే కనీస లాజిక్‌ను ఇటు కంపెనీలు, అటు పాలకులు ఎలా మర్చిపోయారు?
సరే... అంతా ఏఐ అనుకుందాం. పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికీ ఏఐ టూల్స్ వాడదాం. కానీ ఉచితంగా ఏదీ రాదు కదా! ప్రతి ఏఐ సాఫ్ట్‌వేర్‌కు, ప్రతి యాప్‌కు సబ్‌స్క్రిప్షన్ ఫీజు కట్టాలి, డబ్బు చెల్లించాలి. మరి సాధారణ ప్రజల దగ్గర వ్యాపారాలు లేనప్పుడు, ఉద్యోగాలు లేనప్పుడు... వినియోగదారులు ఆ ఏఐ కంపెనీలకి డబ్బు ఎలా చెల్లిస్తారు? ప్రముఖ ఆర్థికవేత్త జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థిక మాంద్యం సమయంలో ఒక అద్భుతమైన సూత్రాన్ని ప్రతిపాదించారు.
ప్రభుత్వాలు ప్రజల చేతుల్లో డబ్బు పెట్టాలి, అప్పుడే మార్కెట్లో డిమాండ్ పెరుగుతుంది, ఆర్థిక వ్యవస్థ బతుకుతుంది. కానీ ఇవాళ ఏఐ చేస్తున్నది దీనికి రివర్స్. ప్రజల చేతుల్లో ఉన్న డబ్బును లాగేసుకుంటోంది. చిన్న చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి రంగాలు ఏఐ చేతుల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఒక చిన్న డిజైనర్, ఒక చిన్న అకౌంటెంట్, ఒక చిన్న లీగల్ అడ్వైజర్... వీరంతా ఇవాళ ఉపాధి కోల్పోతున్నారు. మరి సమాజంలో చలామణీ అయ్యే డబ్బు మొత్తం నలుగురైదుగురు టెక్ బిలియనీర్ల అకౌంట్లలోకి వెళ్ళిపోతే... మార్కెట్లో లిక్విడిటీ ఏమైపోవాలి? వ్యాపారాలు లేని సమాజంలో వినియోగదారుడు ఏఐ సేవలను వాడుకోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాడు? ఇది కేవలం ఆర్థిక సంక్షోభం కాదు... సమాజాన్ని ఆత్మహత్యల వైపు నడిపించే ఒక దుర్మార్గపు వ్యూహం.
ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు.
“పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.
ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు. మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్‌స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి... కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.
అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు.
"అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.
టెక్నాలజీ అనేది మనిషి జీవితాన్ని సుఖమయం చేయడానికి రావాలి కానీ... మనిషి జీవితాన్నే శూన్యం చేయడానికి కాదు. పోప్ లూథర్ తన సందేశం ముగింపులో అన్నట్లు, మనుషులు ఎంత బలహీనులైనా, పరిమితులు ఉన్నవారైనా... మనిషి స్థానాన్ని, వారి సామర్థ్యాన్ని, ముఖ్యంగా ప్రేమానురాగాలను ఏ యంత్రమూ భర్తీ చేయలేదు, భర్తీ చేయకూడదు. నైపుణ్యం ఉన్న మానవ వనరులే ఏ దేశానికైనా అసలైన బలం.
ఆ బలాన్ని బలహీనతగా మార్చే ఏ సాంకేతికత అయినా సమాజానికి ప్రమాదకరమే. ఇప్పటికైనా ప్రపంచ పాలకులు, మన దేశ పాలకులు కళ్ళు తెరవాలి. ఏఐ పేరుతో జరుగుతున్న ఈ మానవ వనరుల వినాశనాన్ని, కార్పొరేట్ అత్యాశను అడ్డుకోవడానికి కఠినమైన నియంత్రణ చట్టాలు తీసుకురావాలి. లేకపోతే... రేపు పొద్దున రోబోలు రాజ్యమేలుతుంటాయి, మనుషులు ఆకలితో అలమటిస్తుంటారు. ఆ రోజున పాలకులారా... చరిత్ర మిమ్మల్ని క్షమించదు!
ఇప్పటికే ఏఐ పేరుతో ప్రపంచవ్యాప్తంగా వేలాది మందిని, భారతదేశంలో కూడా లక్షలాది మంది టెక్ నిపుణులను కంపెనీలు లే ఆఫ్స్ పేరుతో నికృష్టంగా రోడ్డున పడేశారు. ఏ తప్పు చేయని టెక్ నిపుణులు ఇవాళ నిరాశలో మునిగిపోయారు. మరి ఈ విద్యావంతులు, బుద్ధిజీవులు, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత... ఉద్యోగాలు లేక, వేరే వ్యాపకాలకు దిగితే సమాజానికి ఎంత పెద్ద నష్టం జరుగుతుందో పాలకులు ఎందుకు గ్రహించడం లేదు? మహాత్మా గాంధీ ఒక అద్భుతమైన మాట చెప్పారు.
“పని లేని మేధస్సు... సాతాను కర్మాగారం. నైతికత లేని విజ్ఞానం సమాజానికి తీవ్రమైన హాని చేస్తుందని” ఒక మేధావికి, ఒక సాంకేతిక నిపుణుడికి సరైన పని కల్పించకపోతే... ఆ మేధస్సు వినాశనానికి దారితీసే అవకాశం ఉంది. సైబర్ నేరాలు, ఆర్ధిక మోసాలు, సమాజంలో అశాంతి పెరగడానికి ఈ నిరుద్యోగమే కారణం కాదా? చదువుకున్న యువత సమాజంపై కక్ష పెంచుకునేలా పాలకులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? వారు వేరే అసాంఘిక వ్యాపకాలకు దిగితే, సమాజంలో శాంతిభద్రతలు క్షీణిస్తే... ఆ నష్టాన్ని ప్రభుత్వాలు భరించగలవా? లే ఆఫ్స్ అనేవి కేవలం కంపెనీల అంతర్గత విషయం కాదు... అవి సమాజ పునాదులను కదిలించే సామాజిక విపత్తులు. దీనిని పాలకులు గుర్తించకపోవడం వారి మేధో దివాలాకోరుతనానికి నిదర్శనం.
ఇక అన్నిటికంటే భయంకరమైన అంశం... భవిష్యత్తు తరాల పరిస్థితి ఏంటి? ప్రతి చిన్న విషయానికి, హోంవర్క్ దగ్గర నుంచి రీసెర్చ్ వరకు అన్నిటికీ ఏఐ టూల్స్ వాడేస్తుంటే... భవిష్యత్తు తరాలు పూర్తిగా తమ సొంత ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను కోల్పోయి, టెక్నాలజీకి బానిసలయ్యే ప్రమాదం ఉంది కదా! ఆ విషయం ఈ పాలకులకు ఎందుకు పట్టడం లేదు? సిలికాన్ వ్యాలీ సృష్టించిన ఈ సాంకేతిక ఏకరూపత వెనుక బైబిల్ లోని "టవర్ ఆఫ్ బాబెల్" నాటి అహంకారం దాగి ఉందని పోప్ లూథర్ హెచ్చరించారు.
మానవాళి ఒకే సాంకేతిక భాషతో దైవత్వాన్ని సవాలు చేయాలని చూస్తే అది తీవ్రమైన విచ్ఛిన్నానికే దారితీస్తుంది. పైగా, బాల్య దశలో సాంకేతిక పరిజ్ఞానానికి మితిమీరి గురికావడం వల్ల నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం, మానసిక బంధాలు తెగిపోవడం వంటి భయంకరమైన మానసిక రుగ్మతలు ఉత్పన్నమవుతున్నాయని వైద్య పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఒకచోట హెచ్చరించారు. సాంకేతికత మన మానవ సంబంధాలను, మానవ మేధస్సును దాటి వెళ్ళిపోయిన రోజు... ప్రపంచం కేవలం మూర్ఖుల తరంతో నిండిపోతుందని. ఇవాళ ఐన్‌స్టీన్ అన్న ఆ మూర్ఖుల తరం కళ్లముందే తయారవుతోంది. మనుషులు ఆలోచించడం మానేస్తున్నారు. మెదడుకు పని పెట్టడం లేదు. కంపెనీలు కేవలం ప్రస్తుత లాభాలను చూసుకుని మురిసిపోతున్నాయి.
కానీ రేపు పొద్దున, భవిష్యత్ తరాల నుంచి సరికొత్త మానవ మేధస్సు, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలు రాకపోతే... టెక్నాలజీ అక్కడితో ఆగిపోదా? ఏఐ అనేది మనిషి సృష్టించిన డేటా ఆధారంగానే పనిచేస్తుంది. మరి మనుషులే కొత్తగా ఆలోచించడం మానేస్తే... ఏఐకి కొత్త డేటా ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నాలజీ అక్కడితో స్తంభించిపోదా? మానవ మేధస్సు లేని రోజున ఏ సాంకేతికత అయినా ఒక జడపదార్థం మాత్రమే అవుతుంది.
అసలు సమాజ శ్రేయస్సును కాంక్షించని ఈ ఏఐ కార్పొరేట్ కంపెనీల కూటమికి ప్రభుత్వాలు ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నాయి? దేశంలో పేదరికం ఉంది, తాగునీటి కొరత ఉంది, వైద్య సదుపాయాలు లేవు... వీటన్నిటినీ వదిలేసి, ఏఐ రీసెర్చ్ సెంటర్ల కోసం, గ్లోబల్ టెక్ సదస్సుల కోసం వందల కోట్ల ప్రజా ధనాన్ని ప్రభుత్వాలు ఎందుకు తగలేస్తున్నాయి? ప్రముఖ ఆర్థికవేత్త నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు.
"అభివృద్ధి అంటే కేవలం సాంకేతికత లేదా మార్కెట్ విస్తరణ కాదు... మానవ సామర్థ్యాలను, వారి జీవన ప్రమాణాలను పెంపొందించడమే అసలైన అభివృద్ధి అని” కానీ ఇవాళ ప్రభుత్వాలు అమర్త్యసేన్ మాటలను తుంగలో తొక్కాయి. సామాన్య ప్రజల శ్రేయస్సును కాదని, కేవలం కొద్దిమంది టెక్ దిగ్గజాల ప్రయోజనాల కోసమే పాలసీలు మారుస్తున్నాయి. నైపుణ్యం ఉన్న టెక్ నిపుణుల అభిప్రాయాలను, వారి ఆందోళనలను కనీసం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వాల ఈ కార్పొరేట్ అనుకూల విధానాలు మారకపోతే... చరిత్ర పాలకులను క్షమించదు.
- కంచర్ల యాదగిరి రెడ్డి, మేనేజింగ్ ఎడిటర్, సాక్షి టీవీ


