మూడు నెలలుగా తండ్రి శవంతో జీవనం.. కారణం తెలిసి కంగుతిన్న పోలీసులు

Son Living With Father Corpse Three Months In Kolkata - Sakshi

కోల్‌కతా: చనిపోయిన వారి మృతదేహాలను ఇంట్లోనే పెట్టుకుని.. వాటితో కలిసి జీవించే దృశ్యాలను ఎక్కువంగా సినిమాలో చూసుంటాం. కానీ ఇటువంటి ఘటనే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి మరణించిన తన తండ్రి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి మూడు నెలలుగా దానితో కలిసి జీవిస్తున్నాడు. చివరికి పోలీసుల రంగప్రవేశంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోల్‌కతాలోని కేపీరాయ్ లేన్‌లో సంగ్రామ్ డే (70) బాబా అటామిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌లో మాజీ ఉద్యోగి. 

గత కొన్ని నెలలుగా స్థానిక ప్రజలు సంగ్రామాన్ని చూడలేదు. అతని కొడుకు కౌశిక్ డే కూడా చుట్టు పక్కల వారితో పెద్దగా మాట్లాడడు కాబట్టి వారికి మొదట్లో అనుమానం రాలేదు. అయితే ఇటీవల కౌశిక్‌ ప్రవర్తన కాస్త వింతగ ఉండడం, అతని తండ్రి కనపడకపోవడంతో స్థానికులు గార్ఫా పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు ఇంటికి వెళ్లగా కౌశిక్ తలుపులు కూడా బలవంతంగా తెరిచాడు. ఇంటిలోకి వెళ్లి చూడగా, కుళ్లిపోయిన స్థితిలో మంచంపై పడి ఉన్న సంగ్రామ్ మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్‌ అయ్యారు.

అతని భార్య అరుణా డే పక్షవాతం కారణంగా మంచాన పడింది. మూడు నెలల క్రితం తన తండ్రి చనిపోయాడని, అయితే సంగ్రామ్ మళ్లీ మేల్కొంటాడని భావించానని కౌశిక్ పోలీసులకు చెప్పాడు. కౌశిక్‌ సమాధానాలు విన్న పోలీసులు అతను మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోందిని చెప్పారు. పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.

చదవండి: ‘మా పొట్ట కొట్టకండి సారూ.. గంజాయి పండించుకుంటాం’

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top