సాక్షి, ఢిల్లీ: కర్ణాటక రాజకీయాలు హస్తినలో వాడీవేడిగా సాగుతున్నాయి. సీఎం మార్పుపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో.. ఇవాళ ఇందిరాభవన్‌లో అధిష్టానం పెద్దలతో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లు భేటీ అయ్యారు. సమావేశంలో వాళ్లు కలిసి ఉన్న ఫొటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. అనంతరం బయటకు వచ్చిన వాళ్లిద్దరూ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు.
కాగా, గత డిసెంబరు నుంచి(రెండున్నరేళ్లు అధికారం పూర్తి కావడం) సీఎం కుర్చీ కోసం ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య ఎడతెగని పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాలుగైదు సార్లు ఇరువురూ ఢిల్లీకి వెళ్లి మంతనాలు సాగించారు. అయితే.. మే 20తో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి మూడేళ్లు పూర్తి కానుంది.
పవర్ షేరింగ్ ఒప్పందంలో భాగంగా తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డీకే శివకుమార్ డిమాండ్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే, తననే కొనసాగించాలని సిద్ధరామయ్య కోరుతున్నట్లు సమాచారం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మరో సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ వీళ్లిద్దరి నుంచి అభిప్రాయసేకరణ చేశారు.
సిద్ధరామయ్యకి మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నేపథ్యంలో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. మూడేళ్లలో తన ప్రభుత్వ పనితీరు, ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపు తదితరు అంశాలను సిద్దరామయ్య ప్రస్తావిస్తున్నారు. మరోవైపు.. ఆయన్ని మారిస్తే ఓబీసీ వర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఆందోళనలో అధిష్టానం ఉంది. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే తనకే సీఎం పదవి ఇవ్వాలని డీకే గట్టిగా డిమాండ్ చేస్తున్నట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పలు సమీకరణాలను అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
పార్టీ అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగడం ఏమాత్రం మంచిది కాదని సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ అంటున్నారు. కర్ణాటక కాంగ్రెస్‌లో కొనసాగుతున్న అధికారం పోరుపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నాయకత్వ మార్పు కోసం అధిష్టానంపై ఒత్తిళ్లు చేయడం ఏమాత్రం మంచిది కాదు. పార్టీ 2028లో మళ్లీ అధికారంలోకి రావాలంటే స్థిరత్వం.. బలమైన టీమ్ అవసరం. అంతర్గత అనిశ్చితి ఎక్కువకాలం కొనసాగితే బీజేపీకి లాభం కలుగుతుంది అని హెచ్చరించారాయన. అదే సమయంలో అధిష్టానం నుంచి త్వరలోనే ఓ ప్రకటన వెలువడొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒకవేళ మార్పు గనుక ఉంటే.. ఇప్పుడే చేస్తారా?.. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్పు ఉంటుందా? ఒకవేళ లేకుంటే అసెంబ్లీ ఎన్నికల వరకు సిద్ధరామయ్యనే కొనసాగిస్తారా?.. డీకేను ఎలా సంతృప్తి పరుస్తారు? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.


