
9వ తరగతి బాలికకు ప్రసవం
శివమొగ్గలో సంఘటన
కర్ణాటక: ప్రాథమిక పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలిక గర్భం దాల్చి మగబిడ్డకు జన్మనిచ్చిన సంఘటన శివమొగ్గ నగరంలో జరిగింది. బాలిక, శిశువు ఆరోగ్యంగా ఉన్నారని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వివరాలు.. బాలిక (15) 9వ తరగతి చదువుతోంది. కడుపు నొప్పిగా ఉందంటూ రెండు రోజుల నుంచి బడికి వెళ్లడం లేదు. శుక్రవారంనాడు ఇంటిలోనే ప్రసవించగా, మగపిల్లాడు పుట్టాడు. కుటుంబ సభ్యులు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా గుట్టుగా ఉంచారు.
7వ నెలలోనే కాన్పయినట్లు తెలిసింది. ఆనోటా ఈనోటా ప్రచారం సాగింది. శిశు సంక్షేమ అధికారులు, పోలీసులు బాలిక ఇంటికి వెళ్లి విచారించారు, బాలిక తల్లిదండ్రులు కూలి పనులు చేస్తారని, వారికి మొత్తం ముగ్గురు పిల్లలని సమాచారం. కాగా, తల్లీ కొడుకును ఆస్పత్రిలో చేరి్పంచారు. బాలిక పైన లైంగిక దాడి చేసిన వారికోసం విచారణ చేపట్టినట్లు జిల్లా ఎస్పీ మిథున్ తెలిపారు. బాలికను కూడా విచారించగా పరస్పర విరుద్ధ సమాచారం చెబుతోందని తెలిసింది. బాలిక కోలుకున్నాక పూర్తి విచారణ సాగిస్తామని పోలీసులు చెప్పారు.