
శ్రీనగర్: భారత్,పాకిస్థాన్ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. మరోవైపు.. దాయాదా పాకిస్తాన్.. భారత్ సరిహద్దుల్లో పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా దాడులకు తెగబడింది. తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు.
వివరాల ప్రకారం.. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది పాకిస్తాన్. ఈ దాడుల్లో శనివారం ఉదయం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజ్‌కుమార్ జిల్లా డెవలప్‌మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Deeply saddened to hear about the tragic loss of Dr. Raj Kumar Thapa, KAS who was posted as ADDC Rajouri in the Pakistani terror attack. Our heartfelt condolences go out to the bereaved family, friends, and loved ones of the victim.
Om Shanti! pic.twitter.com/mmZoS1rJWY— IAS Fraternity 🇮🇳 (@IASfraternity) May 10, 2025

ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్‌కుమార్ మృతిపై సీఎం ఒమర్ ట్విట్టర్ వేదికగా..‘రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాక్ జరిపిన దాడుల్లో రాజ్‌కుమార్ మృతి చెందారు. నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్‌ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్‌లైన్ సమావేశంలో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరీలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం’ అని వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా..
శుక్రవారం రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో, విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్’ పాటించారు. శ్రీనగర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు.