
న్యూఢిల్లీ: ఒక జంటది హనీమూన్. కొందరిది పెళ్లి రోజు. ఇంకొందరికి ఎన్నో ఏళ్ల కల. పహల్గాం మారణకాండ 26 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఒక్కొక్క పర్యాటకున్నీ పేరు, వ్యక్తిగత వివరాలు అడిగి మరీ ముష్కరులు బలి తీసుకున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. దాదాపుగా అందరినీ ఆధార్ కార్డులు చూపించాలని, ఖురాన్ పంక్తులు అప్పజెప్పాలని అడిగి మరీ కాల్చేశారు.
మృతుల్లో ఇద్దరు మినహా అంతా హిందువులే. వారిలో మహారాష్ట్రకు చెందిన వారు ఆరుగురు, గుజరాత్, కర్నాటక నుంచి ముగ్గురేసి, పశి్చమబెంగాల్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, పంజాబ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు ఒక నేపాలీ పర్యాటకునితో పాటు స్థానికుడు కూడా దాడిలో మరణించారు.
హార్స్ రైడింగ్‌కని బయటికొచ్చి...
ఉగ్ర కాల్పులకు బలైన వారిలో యూపీలోని కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది అనే 31 ఏళ్ల వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ఆయనకు గత ఫిబ్రవరిలోనే పెళ్లైంది. భార్య, తల్లిదండ్రులు, సోదరి, ఆమె అత్తామామలు, బావమరిది తదితరులతో కలిసి సరదాగా గడిపేందుకు బైసారన్ వెళ్లాడు. మంగళవారం కుటుంబీకులంతా హోటల్‌కే పరిమితం కాగా భార్యతో కలిసి శుభం హార్స్ రైడింగ్‌కు వెళ్లాడు. ఉగ్రవాదులు అతన్ని కూడా పేరడిగారు. కల్మా చదవమన్నారు. రాదనడంతో నేరుగా తలపై కాల్చి భార్య కళ్లముందే పొట్టన పెట్టుకున్నారు.
CM Omar Abdullah, joined by thousands, offered funeral prayers for Syed Adil Hussain—killed in the Pahalgam militant attack that left 26 tourists dead—at his native village on Wednesday.
Photos KM / @UmarGanie1 pic.twitter.com/nXCD0vbsnh— The Kashmir Monitor (@Kashmir_Monitor) April 23, 2025
👉కేరళలోని ఎడప్పల్లికి చెందిన రామచంద్రన్ (65) కూడా కాల్పులకు బలయ్యాడు. పర్యాటకప్రియుడైన ఆయన భార్య, ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన కూతురు, ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లాడు. వాళ్ల కళ్లముందే ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. ఆయన్ను కూడా ఖురాన్ పంక్తులు చదవాలని అడిగి, తాను ముస్లింను కాదని చెప్పగానే చంపేశారు.
👉ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దినేశ్ మిరానియా అనే వ్యాపారవేత్త పెళ్లి రోజును సరదాగా జరుపుకునేందుకు కుటుంబీకులతో కలిసి పహల్గాం వచ్చారు. భార్యాపిల్లల కళ్లముందే ఉగ్ర తూటాలకు బలయ్యారు.
👉కశ్మీర్ వెళ్లాలన్నది ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి (41) కల. నెలల తరబడి డబ్బు కూడబెట్టి మరీ బైసారన్ వెళ్లాడు. భార్య, 9 ఏళ్ల కొడుకు కళ్లముందే నిస్సహాయంగా మృత్యువాత పడ్డాడు.
పోరాడిన పోనీవాలా..
ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా (30) అనే స్థానిక పోనీవాలా వీరోచితంగా ప్రయత్నించాడు. ఉగ్ర వాదుల నుంచి తుపాకులను లాక్కునే ప్రయత్నంలో వారి కాల్పులకు బలయ్యాడు. ఆదిల్ గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించాడంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతించారు. బుధవారం అతని అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.