చెన్నై: తమిళనాడు రాజకీయాలంటేనే ఎంతో ఉత్కంఠగొలుపుతాయి. అలాంటి గడ్డపై, అనుభవజ్ఞులైన ఉద్దండులు ఉన్న సభలో, కేవలం 29 ఏళ్ల వయసులోనే మంత్రి పదవిని అలంకరించబోతున్నారు సెల్వి ఎస్. కీర్తన. ఒక సామాన్య నేపథ్యం నుండి వచ్చి, విద్యనే ఆయుధంగా మలచుకుని, నేడు రాష్ట్ర కేబినెట్‌లో అత్యంత పిన్న వయస్కురాలైన మంత్రిగా ఆమె బాధ్యతలు స్వీకరించడం ఒక చారిత్రక ఘట్టంగా నిలవనుంది.
చదువులో మేటి.. లక్ష్యంలో స్పష్టత
సెల్వి ఎస్. కీర్తన విద్యావంతురాలైన యువనేత. ఆమె ఎమ్మెస్సీ పట్టభద్రురాలు. చదువుకునే రోజుల నుంచే ఆమెకు సమాజం పట్ల, రాజకీయాల పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. కేవలం డిగ్రీలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను అర్థం చేసుకోవడానికి ఆమె ప్రయత్నించారు. రాజకీయాలంటే కేవలం అధికారం మాత్రమే కాదు, అదొక బాధ్యత అని నమ్మిన అతి కొద్దిమంది యువతలో ఆమె ఒకరు. "సింగపెణ్" (సింహపుత్రి)
పొలిటికల్ కన్సల్టెంట్‌గా అనుభవం
రాజకీయాల్లోకి రాకముందు కీర్తన పొలిటికల్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. సాధారణంగా తెరవెనుక ఉండి వ్యూహాలు రచించే బాధ్యత నుంచి, నేరుగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజాప్రతినిధిగా మారడం ఆమె జీవితంలో ఒక పెద్ద మలుపు. ఎన్నికల వ్యూహాలు, ప్రజాభిప్రాయ సేకరణ, సామాజిక సమస్యల విశ్లేషణలో ఆమెకు ఉన్న అనుభవం టీవీకే (టీవీకే) పార్టీలో ఆమె ఎదుగుదలకు తోడ్పడింది. ఈ వృత్తిపరమైన నేపథ్యమే ఆమెను ఒక పరిణతి చెందిన నాయకురాలిగా తీర్చిదిద్దింది.
శివకాశి గడ్డపై విజయ కేతనం
టపాసుల తయారీకి, కష్టపడే తత్వానికి మారుపేరైన శివకాశి నియోజకవర్గం నుంచి కీర్తన పోటీ చేశారు. ఆమెను ‘శివకాశి సింగపెణ్’ అని అంటుంటారు. సింగపెణ్ అంట్ సింహపుత్రి అని అర్థం. ఎన్నికల ప్రచారంలో ఆమె చూపిన తెగువ, మాట్లాడే తీరు అక్కడి ఓటర్లను, ముఖ్యంగా మహిళలను మరియు యువతను విశేషంగా ఆకర్షించింది. పార్టీ అధినేత విజయ్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ విజయంతో ఆమె టీవీకే పార్టీలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు.
మహిళా సాధికారతకు నిలువెత్తు రూపం
విజయ్ తన తొలి కేబినెట్‌లోనే ఆమెకు చోటు కల్పించడం వెనుక పెద్ద వ్యూహమే ఉంది. కేవలం మహిళా కోటాలో కాకుండా, ఆమెకున్న మేధస్సు, విద్యార్హత, పనితీరును చూసి ఈ బాధ్యతను అప్పగించారు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి కూడా ఆమే కావడం విశేషం. ‘ఒక విద్యావంతురాలైన యువతి రాజకీయాల్లోకి వస్తే మార్పు ఎలా ఉంటుందో కీర్తన నిరూపిస్తున్నారు’ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
విజయ్ నమ్మకం.. కీర్తన బాధ్యత
ముఖ్యమంత్రి విజయ్ తన కేబినెట్‌లో అనుభవజ్ఞులైన సెంగోట్టయ్యన్, ఆనంద్ వంటి వారితో పాటు కీర్తన వంటి యువ రక్తానికి ప్రాధాన్యత ఇచ్చారు. పాలనలో ఆధునికతను, సాంకేతికతను జోడించడంలో కీర్తన పాత్ర కీలకం కానుంది. ఎటువంటి రాజకీయ వారసత్వం లేకుండా, స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం తమిళనాడులోని కోట్లాది మంది యువతులకు స్ఫూర్తిదాయకం.


