సెక్స్‌ వర్కర్లను వేధించొద్దు: సుప్రీం కోర్టు | SC protects sex workers cracks down on trafficking Full Details | Sakshi
Sakshi News home page

సెక్స్‌ వర్కర్లను వేధించొద్దు.. అదేం నేరం కాదు: సుప్రీం కోర్టు

May 29 2026 12:27 PM | Updated on May 29 2026 3:37 PM

SC protects sex workers cracks down on trafficking Full Details

మానవ అక్రమ రవాణా, బలవంతపు వ్యభిచారం కేసుల విషయంలో దేశవ్యాప్తంగా సంచలన ప్రభావం చూపే కీలక మార్గదర్శకాలను సుప్రీం కోర్టు జారీ చేసింది. స్వచ్ఛందంగా సెక్స్‌ వర్క్‌ చేస్తున్న 18 ఏళ్లు నిండిన వారిని నేరస్తుల్లా చూడొద్దని, వారిపై పోలీసులు దాడులు చేయడం.. కేసులు నమోదు చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అదే సమయంలో మహిళలు, మైనర్ల అక్రమ రవాణా మాఫియాపై మాత్రం కఠిన చర్యలు కొనసాగించాలని ఆదేశించింది.

సెక్స్‌ వర్కర్ల హక్కులు, పునరావాసం, పోలీసుల వైఖరి వంటి అంశాలపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు వెలువడ్డాయి. రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు కల్పిస్తోందని, సెక్స్‌ వర్కర్లు కూడా అదే హక్కులకు అర్హులని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 

స్వచ్ఛందంగా లైంగిక వృత్తి చేస్తున్న వయోజన మహిళలు, మైనర్లను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే అక్రమ రవాణా ముఠాలను ఒకేలా చూడకూడదని కోర్టు పేర్కొంది. సెక్స్‌ వర్క్‌ స్వచ్ఛందంగా చేస్తున్నారనే విషయం స్పష్టంగా ఉంటే వారిని వేధించడం, పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లడం, క్రిమినల్‌ కేసులు పెట్టడం సరికాదని తెలిపింది. 

ఇకపై రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్‌ వర్కర్ల ఫొటోలు, వీడియోలు తీసి మీడియాకు ఇవ్వొద్దని కూడా కోర్టు ఆదేశించింది. వారి గుర్తింపును బహిర్గతం చేయడం వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగిస్తుందని పేర్కొంది. మీడియా సంస్థలు కూడా బాధితుల వివరాలు, చిత్రాలు ప్రసారం చేయరాదని సూచించింది. ఈ మార్గదర్శకాలను శుక్రవారం జస్టిస్‌ ఎల్‌ నాగేశ్వరరావు నేతృత్వంలోని బెంచ్‌ ధర్మాసనం చేసింది. 

మరో కీలక ఆదేశంగా.. నివాస ధృవీకరణ పత్రాలు లేకపోయినా సెక్స్‌ వర్కర్లకు వెంటనే ఆధార్‌ కార్డులు జారీ చేయాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. గుర్తింపు పత్రాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం, బ్యాంకింగ్‌, సంక్షేమ పథకాల నుంచి వారు దూరమవుతున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.

అదే సమయంలో మానవ అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులను బలవంతంగా వ్యభిచారంలోకి నెట్టే మాఫియా నెట్‌వర్క్‌లను అణచివేయాలని.. బాధితుల పునరావాసానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం సూచించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement