రూ.20కే పెట్రోల్‌.. ఇంటికో బైక్.. జీఎస్టీ బ్యాన్.. ఈయన హామీలు చూస్తే మైండ్ బ్లాంకే..

Sarpanch Candidate Offers Going Viral Petrol For Rs20 GST Ban - Sakshi

చండీగఢ్‌: ఎన్నికల్లో గెలిచేందుకు రాజకీయ నాయకులు ఎలాంటి హామీలనైనా ప్రకటించేందుకు వెనుకాడరు. వాటి సాధ్యాసాధ్యాల గురించి పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్లుగా వాగ్దానాలు చేస్తుంటారు. హర్యానా పంచాయతీ ఎన్నికల్లో సిర్‌సాఢ్‌ సర్పంచ్‌ పదవికి పోటీ చేస్తున్న జయకరణ్ లఠ్వాల్‌ కూడా ఇదే కోవకు చెందుతాడు. తనను గెలిపిస్తే ఏం చేస్తాడో చెబుతూ అతను ఏర్పాటు చేసిన బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగవైరల్‌గా మారింది. ఆ హమీలను చూసి కొందరికి మైండ్ బ్లాంక్ అవుతోంది. ప్రధాని, ముఖ్యమంత్రులకు కూడా సాధ్యం కాని ఈ హామీలను చూసి కొందరు నోరెళ్లబెడుతున్నారు. 

తనను సర్పంచ్‌గా గెలిపిస్తే లీటర్ పెట్రోల్ రూ.20కే వచ్చేలా చేస్తానని జయకరణ్ చెబుతున్నాడు. గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక బైక్ ఇస్తాడట. గ్రామస్థులందరికీ జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుందట. మహిళలకు ఉచిత మేకప్ కిట్లు, ప్రతిరోజు మన్ కీ బాత్, ఊర్లో మూడు ఎయిర్‌ పోర్టులు, మందు తాగే వారికి ఒక బాటిల్ మద్యం, గ్రామం నుంచి ఢిల్లీ వరకు మెట్రోలైన్, ఉచిత వైఫై.. అబ్బో ఇలా చాలా హామీలనే ఇస్తున్నాడు.

జయకరణ్ ఇచ్చిన మరో హామీ చూసి కొందరికి గుండె ఆగినంత పని అయింది. తాను సర్పంచ్‌గా గెలిస్తే సిర్‌సాఢ్ గ్రామం నుంచి గోహాన్‌ మండల కేంద్రం వరకు ప్రతి ఐదు నిమిషాలకు ఓ హెలికాప్టర్ ఏర్పాటు చేస్తానని అతను చెప్పాడు. కొందరేమో అది బస్సు అయి ఉంటుందని, పొరపాటున హెలికాప్టర్ అని రాసి ఉంటారని చలోక్తులు విసిరారు. ఇతని హామీల వర్షం చూసి ఐపీఎస్ అధికారి అరుణ్ బోత్రా తనకు వెంటనే ఈ గ్రామానికి షిఫ్ట్ అవ్వాలనిపిస్తోందని నవ్వులు పూయించారు.

చదవండి: పార్టీ చీలొద్దని సొంత కుమారుడినే సస్పెండ్ చేసిన మహానేత ములాయం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top