సామ్యవాద, లౌకిక పదాలను సమీక్షించాలి | RSS Leader Calls For Debate On Words Socialist, Secular In Preamble | Sakshi
Sakshi News home page

సామ్యవాద, లౌకిక పదాలను సమీక్షించాలి

Jun 28 2025 4:51 AM | Updated on Jun 28 2025 4:51 AM

RSS Leader Calls For Debate On Words Socialist, Secular In Preamble

రాజ్యాంగం వాస్తవ స్ఫూర్తిని పునరుద్ధరించాలి 

ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి హొసబళె వ్యాఖ్య 

తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, వామపక్షాలు

న్యూఢిల్లీ: దేశ రాజ్యాంగం వాస్తవ స్ఫూర్తిని పునరుద్ధరించేందుకు పీఠికలో సవరణ ద్వారా చేర్చిన ’సోషలిస్ట్‌’, ’లౌకిక’ పదాలపై సమీక్ష చేపట్టాలని రాష్రీ్టయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబళె పిలుపునిచ్చారు. ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్‌ తీసుకువచ్చిన పలు వక్రీకరణ విధానాల నుంచి రాజ్యాంగానికి విముక్తి కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన రాసిన వ్యాసం శుక్రవారం ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ పత్రిక ఆర్గనైజర్‌లో ప్రచురితమైంది. 

1948లో దేశాన్ని సెక్యులర్, ఫెడరల్, సోషలిస్ట్‌ యూనియన్‌ ఆఫ్‌ స్టేట్స్‌’గా భారత్‌ను పేర్కొనాలన్న ప్రతిపాదనను డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సారథ్యంలో రాజ్యాంగ సభలో జరిగిన చర్చ సందర్భంగా తిరస్కరించారని హొసబళె తన వ్యాసంలో గుర్తు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన 42వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సభ చర్చా ప్రక్రియకు ప్రతిబింబం కాదన్నారు. 

భవిష్యత్‌ తరాలకు అధికారం ఇచ్చే ప్రజాస్వామ్య చట్రం అనే అంబేద్కర్‌ దార్శనికతకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేసేందుకు హోసబళె బహిరంగ చర్చను కోరుకున్నారని ఆర్గనైజర్‌ వారపత్రిక వివరించింది. అంతేతప్ప, రాజ్యాంగాన్ని రద్దు చేయడం ఆయన ఉద్దేశం కానేకాదని స్పష్టత నిచ్చింది. కాంగ్రెస్‌ వంచనను బయటపెట్టి, రాజ్యాంగం నిజ స్ఫూర్తికి గౌరవం కల్పించేందుకు చర్చ జరగాల్సిన అవసరముందని పేర్కొంది. హొసబళె వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ స్పందించింది. 

మన రాజ్యాంగాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌ ఎన్నడూ ఆమోదించలేదని, రాజ్యాంగాన్ని రద్దు చేయడమనే దీర్ఘకాలం కుట్రలో తాజా వ్యాఖ్యలు ఒక భాగమని ఆరోపించింది. రాజ్యాంగం ఆత్మపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఉద్దేశ పూర్వకంగా దాడి చేస్తోందిన మండిపడింది. సోషలిస్ట్, సెక్యులర్‌ విధానాల కోసమే స్వాతంత్య్ర పోరాట యోధులు తమ జీవితాలను త్యాగం చేశారని సీపీఎం పేర్కొంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి హొసబళె వ్యాఖ్యలను ఆ పార్టీ తీవ్రంగా ఖండించింది. దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’గా మార్చాలన్న ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలో ఇదో భాగమని పేర్కొంది.

ఆర్‌ఎస్‌ఎస్‌ ముసుగు తొలగింది: రాహుల్‌ 
ఆర్‌ఎస్‌ఎస్‌ నేత హొసబళె వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు కావాల్సింది మనుస్మృతే తప్ప రాజ్యాంగం కాదన్న విషయం మరోసారి రూఢీ అయ్యిందని విమర్శించారు. రాజ్యాంగం వంటి శక్తివంతమైన ఆయుధాన్ని, హక్కులను లాగేసుకుని, సామాన్యులను బానిసలుగా మార్చడమే ఆర్‌ఎస్‌ఎస్‌ వాస్తవ అజెండా అని ఆయన శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. ఈ అజెండా ఎన్నటికీ నిజం కాబోదు, ఇలాంటి కలలను కనడం ఆర్‌ఎస్‌ఎస్‌ మానుకోవాలని హితవు పలికారు. దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడూ రాజ్యాంగాన్ని ఆఖరి శ్వాస వరకు కాపాడుకుంటారని రాహుల్‌ స్పష్టం చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement