
జోథ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్‌ఎస్ ఎస్), అనుబంధంగా ఉన్న 32 విభాగాల అగ్ర నేతల భేటీ శుక్రవారం రాజస్తాన్‌లోని జోథ్‌పూర్‌లో మొదలైంది. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హొసబలెల సారథ్యంలో సంఘటన్ మంత్ర పారాయణంతో ఈ కార్యక్రమం మొదలైంది. జాతీయ సమైక్య త, జాతీయ భద్రత, విద్య, సమాజానికి సంబంధించిన అంశాలపై జరిగే చర్చల్లో ఆయా విభాగాల అధిపతులు ప్రతినిధులు సహా 320 మంది పాలుపంచుకోనున్నారు.
జాతీయ విద్యా విధానం–2020కి సంబంధించి వివిధ విభాగాలు చేపట్టిన చర్యలపై సమీ క్ష జరపనున్నారు. మూడు రోజులు కొనసాగే ఈ భేటీలో గిరిజనులను సాధారణ జన జీవన స్రవంతిలోకి తీసుకురావడంపైనా చర్చించనున్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల ఉత్సవ కార్యక్రమాలను నిర్ణయించనున్నారు. నాగ్‌పూర్‌లో అక్టోబర్ 2న జరిగే వందో అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి కోవింద్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా లక్ష హిందూ సమ్మే ళనాలు, వేల సంఖ్యలో చర్చాగోష్ఠులను నిర్వ హించేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది.