
ప్రజలు కలిసి ఉండడానికి ఏకరూపకత అవసరం లేదు
భిన్నమైన భావజాలం, సిద్ధాంతం కలిగి ఉండడం నేరం కాదు
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: భారతదేశ ఐక్యతకు దాని వైవిధ్యమే మూలమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అధినేత మోహన్ భగవత్ చెప్పారు. భిన్నమైన భావజాలం, సిద్ధాంతం కలిగి ఉండడం నేరమేమీ కాదని అన్నారు. దేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉండడానికి వారి మధ్య ఏకరూపత ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. సామరస్యపూర్వకంగా, కలిసిమెలసి జీవితం మన సంస్కృతిలో ఒక భాగమని గుర్తుచేశారు. వైవిధ్యం వల్ల ఐక్యత దెబ్బతినదని పేర్కొన్నారు. వైవిధ్యంలోనే ఐక్యత ఉంటుందన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ త్వరలో శతాబ్ది ఉత్సవాలు నిర్వహించుకోనుంది. ఇందులో భాగంగా వివిధ రంగాల ప్రముఖులు, అమెరికా, చైనా, డెన్మార్క్, రష్యా, ఇజ్రాయెల్ తదితర దేశాల దౌత్యవేత్తలు, ప్రతినిధులతో మోహన్ భగవత్ మంగళవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో సమావేశమయ్యారు. హిందూ దేశ భావనపై తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఇది అధికారానికి, బలానికి సంబంధించిన విషయం కాదన్నారు. దేశంలో ఉన్న ప్రజలందరికీ న్యాయం ఒక్కటేనని, హిందూ దేశం అంటే దీనినుంచి ఏ ఒక్క వర్గాన్ని మినహాయించడం కాదని స్పష్టంచేశారు. హిందూ దేశ భావన ఎవరికీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు.
సంఘ్–బీజేపీ మధ్య విభేదాల్లేవు
ఆర్‌ఎస్‌ఎస్‌కు, స్వయం సేవకులకు(వాలంటీర్లు) మధ్య బలమైన బంధం ఉందని మోహన్ భగవత్ తెలిపారు. వారు స్వతంత్రంగా పని చేస్తున్నారని, వారికి ఆ స్వేచ్ఛ ఉందని తేల్చిచెప్పారు. బీజేపీపై సంఘ్ పెత్తనం చేస్తోందంటూ వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పారు. సంఘ్ అనుబంధ విభాగాలు, సంఘాలను ప్రత్యక్షంగా లేదా రిమోట్‌తో నియంత్రించడం లేదన్నారు. సంఘ్–బీజేపీ మధ్య ఎలాంటి విభేదాలు లేవని పరోక్షంగా స్పష్టంచేశారు. మొత్తం సమాజాన్ని ఏకం చేయాలన్నదే సంఘ్ ఆశయమని చెప్పారు. గత 75 ఏళ్లలో మన దేశం చేరాల్సిన స్థాయికి చేరలేదని అభిప్రాయపడ్డారు.