దేశ ప్రజల్లో పెరుగుతున్న ‘విలాస’ వ్యయాలు
జనాభాలో పెరుగుతున్న ఎగువ మధ్య తరగతి
తలసరి ఆదాయం 2031 నాటికి 5,242 డాలర్లు
ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ నివేదికలో వెల్లడి
వచ్చే పదేళ్లలో మనదేశంలో ప్రతి నలుగురిలో ఒకరు.. తమకు నచ్చిన వాటిని కొనే స్థోమతతో, అత్యధికంగా ఖర్చు చేయగలిగే స్థితిలో ఉంటారు. అంటే ఒకప్పుడు అవసరాల కోసమే ఖర్చు చేసినవారు.. విలాసవంతమైన, లైఫ్‌స్టైల్ వస్తువులు, ఖరీదైన సేవలు, ప్రీమియం బ్రాండ్లు కొనేస్థాయికి ఎదుగుతారు. మొత్తం వ్యయంలో ప్రస్తుతం 36 శాతంగా ఉన్న ఈ ఖర్చు వచ్చే ఐదేళ్లలో 43 శాతానికి పెరుగుతుందట.
2010లో 1,360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం.. 2031 నాటికి దాదాపు నాలుగు రెట్లు పెరిగి 5,242 డాలర్లకు చేరనుంది. బియాండ్ నెసెస్సిటీస్ @ ఇండియాస్ ఎఫ్లుయెంట్ డ్రివెన్ గ్రోత్’ పేరిట ప్రముఖ పెట్టుబడుల నిర్వహణ సంస్థ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.
ప్రీమియం ఉత్పత్తులు, లైఫ్‌స్టైల్ వస్తువుల వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు హోటళ్లలో భోజనాలు, వినోదాలు, విహార యాత్రలు, అవసరం లేకపోయినా ఇంటికి విలాసవంతమైన వస్తువులు.. ఇలాంటి వాటికి అధిక వ్యయం చేస్తున్నారట. భారతదేశ వృద్ధి చిత్రం మారుతోందంటూ ‘బియాండ్ నెసెస్సిటీస్ @ ఇండియాస్ ఎఫ్లుయెంట్ డ్రివెన్ గ్రోత్’ పేరిట ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ సంస్థ విడుదల చేసిన నివేదికలో ఈ ఆసక్తికర అంశాలను తెలిపింది. ఈక్విటీల్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్‌లో వృద్ధి, బంగారం ధర అనూహ్యంగా పెరగడం.. ఇలాంటి అనేక అంశాలు ఇందుకు కారణం కానున్నాయని పేర్కొంది.
ప్రజలు నాణ్యతకు పెద్దపీట వేస్తున్నారు. బ్రాండ్ల వాడకాన్ని ఇష్టపడుతున్నారు. అందుకే, 2023–24లో చవకైన, ఎక్కువగా దొరికే (మాస్ మార్కెట్) వస్తువుల కంటే.. ఖరీదైన, విలాసవంతమైన వస్తువులకు గిరాకీ పెరిగింది. ప్రీమియం డిటర్జెంట్ల అమ్మకాలు 26 శాతం పెరిగితే.. మాస్ మార్కెట్ వస్తువుల అమ్మకాల్లో 7 శాతం వృద్ధి మాత్రమే నమోదైంది.
సాధారణ టీ వినియోగం 10 శాతం పెరిగితే.. గ్రీన్ టీ వాడకం 25 శాతం పెరిగింది. స్పోర్ట్స్ ఫుట్‌వేర్ అమ్మకాలు 13 శాతానికిపైగా పెరిగితే, సాధారణ ఫుట్‌వేర్ అమ్మకాలు 8 శాతమే పెరిగాయి. విలాసాలు, ఖరీదైన వాటి కోసం దేశ ప్రజలు 2000లో చేసింది.. మొత్తం వ్యయంలో 25 శాతానికిపైనే ఉంది. ప్రస్తుతం 36 శాతంగా ఉన్న ఆ ఖర్చు 2030 నాటికి 43 శాతానికి పెరుగుతుందట.
ఫ్యాక్టరీలు కాదు.. ఇళ్లు!
ఎఫ్‌ఎమ్‌సీజీ అమ్మకాల పెరుగుదల రోజువారీ అలవాట్లలో మార్పును సూచిస్తే.. గృహోపకరణాల అమ్మకాలు భారతీయ గృహాలు ఎలా మారాయో చెబుతాయి. 2024లో దేశ గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ విలువ రూ.6.45 లక్షల కోట్లు కాగా.. ఇది 2029 నాటికి రెట్టింపై రూ.12.9 లక్షల కోట్లకు చేరవచ్చని అంచనా.
అలాగే దేశంలోని కుటుంబాల పొదుపు మొత్తం 2023–24లో రూ.54 లక్షల కోట్లు కాగా.. 2030 నాటికి ఇది రూ.82 లక్షల కోట్లకు పెరుగుతుంది. అందుకే, ‘భారతదేశ అభివృద్ధి గాథను.. దేశంలోని ఫ్యాక్టరీలు కాదు, గృహాలు రచిస్తున్నాయి’ అని ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది.
రిస్కులూ ఉన్నాయి
అధికాదాయ, మధ్య తరగతి వర్గాల అధిక వ్యయాలతో నడిచే ఈ ఆర్థిక ప్రగతికి రెండు ప్రధాన అడ్డంకులూ ఉన్నాయని నివేదిక తెలిపింది. అందులో మొదటిది ఉద్యోగ నాణ్యత. అంటే.. స్థిరమైన ఉద్యోగం ఉంటేనే మంచి సంపాదన ఉంటుంది. అప్పుడే ఖర్చులూ ఎక్కువగా చేయగలరు. యంత్రాలూ, ఏఐ వంటి వాటి వల్ల కోల్పోయే ఉద్యోగాల వల్ల ఈ అభివృద్ధికి విఘాతం ఏర్పడవచ్చు. అలాగే ఈక్విటీల్లో తగ్గుదలలు, బంగారం ధర పడిపోవడం వంటివి కూడా ఈ పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు.
ఎగువ మధ్య తరగతి, శ్రీమంతులు!
2010లో 1,360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం 2024 నాటికి రెట్టింపై 2,729 డాలర్లకు చేరిందని అంచనా. ఇది 2031 నాటికి 5,242 డాలర్లకు చేరుతుందట. 2010 నాటికి దేశ జనాభాలో సుమారు 68 శాతంగా ఉన్న పేద, నిరుపేద వర్గాల వారు.. 2015 నాటికి 58 శాతానికి తగ్గిపోయారు. 2035 నాటికి ఇది సుమారు 48 శాతానికి తగ్గిపోతుందని అంచనా. ఎగువ మధ్య తరగతి, శ్రీమంతుల శాతం 2035 నాటికి 24 శాతానికి చేరనుంది.


