కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అతి పెద్ద జిల్లా దక్షిణ 24 పరగణాలకు చెందిన పలు బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. కమలం గుర్తు కనిపించకుండా ఈవీఎంలకు ట్యాప్ అతికించారంటూ బీజేపీ ఫిర్యాదు చేసింది.
దీంతో పాటు అవకతవకలపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సౌత్ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్, మగ్రాహట్ పశ్చిమ్ నియోజకవర్గాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో శనివారం (మే 2, 2026) తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మగ్రాహట్ పశ్చిమ్‌లోని 11 పోలింగ్ కేంద్రాలు, డైమండ్ హార్బర్‌లోని 4 పోలింగ్ కేంద్రాల్లో తిరిగి పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ఉత్తర్వులో పేర్కొంది.
142 మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, 143 డైమండ్ హార్బర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 29 ఏప్రిల్ 2026న జరిగిన పోలింగ్‌కు సంబంధించి రిటర్నింగ్ అధికారులు,పరిశీలకుల నివేదికల ఆధారంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 58(2) ప్రకారం ఆ రోజు జరిగిన పోలింగ్ చెల్లదని కమిషన్ ప్రకటించింది.
అందుకు అనుగుణంగా మే 2, 2026న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరిగి పోలింగ్ నిర్వహించనున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారి ఉత్తర్వులో తెలిపారు. పోలింగ్ ప్రాంతంలో డప్పులు కొట్టి విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే పోటీ అభ్యర్థులకు లిఖితపూర్వకంగా సమాచారం అందించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.


