న్యూఢిల్లీ: జాతీయ గేయం వందేమాతరంను కించపరిచినా, గేయాన్ని పాడే సమయంలో ఉద్దేశపూర్వకంగా ఆటంకపరిచినా, మరే విధంగా గేయం పవిత్రత, ప్రతిష్టను మంటగలిపేలా దుస్సాహసం చేసినా ఆ చర్యలన్నింటినీ ఇకపై తీవ్రమైన నేరాలుగా పరిగణిస్తూ శిక్షలు విధించేలా జాతీయగేయంపై బిల్లును బుధవారం రాజ్యసభలో ఆమోదించారు. నీట్ పేపర్ లీకేజీ ఉదంతం, ఛలో సంసద్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు కర్కశ వైఖరిలో మోదీ సర్కార్ బాధ్యత వహించాలన్న విపక్షాల డిమాండ్లు, నినాదాలతో రాజ్యసభలో గత వారంరోజులుగా సభాకార్యక్రమాలు ఆగిపోయినప్పటికీ ఎట్టకేలకు ఈ బిల్లుకు బుధవారం మోక్షం లభించింది.
ఈ బిల్లుపై తొలుత రాజ్యసభలో చర్చ మొదలెట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌రాయ్ సమాధానమిచ్చారు. జాతీయ గీతం జనగణమనకు ఉన్న హోదాను జాతీయగేయం వందేమాతరానికి ఇచ్చే ఉద్దేశంతో ఈ ‘జాతీయ గౌరవాల అవమానాల నివారణ (సవరణ)చట్టం, 2026’ను తీసుకొచ్చామని తెలిపారు.
బిల్లుపై చర్చ సందర్భంగా నీట్ ఉదంతం, బిహార్‌లో ఉద్యమకారులపై ఏకే–47తో కాల్పుల ఘటనపై హోం మంత్రి సంజాయిషీ ఇవ్వాలని, ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని విపక్ష సభ్యులు పట్టుబడుతూ నినాదాలుచేశారు. దీంతో నినాదాల నడుమే సభలో మెజారిటీ సభ్యులు మూజువాణి ఓటుతో ‘వందేమాతరం’బిల్లును ఆమోదించారు. బిల్లు ప్రకారం ఇకపై జాతీయగేయాన్ని ఎవరైనా ఆలపిస్తుంటే అడ్డుకుంటే నేరంగా పరిగణించి మూడేళ్ల జైలుశిక్ష విధిస్తారు. జరిమానా సైతం విధిస్తారు. 1971నాటి పాత చట్టానికి సవరణలుచేసి ఈ బిల్లును తెచ్చారు.


