పాకిస్తాన్‌కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్‌ సింగ్‌ | Rajnath Singh says India ready to cooperate to stop terrorism In Pak | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌కు చేతకాకపోతే మేము సిద్ధంగా ఉన్నాం: రాజ్‌నాథ్‌ సింగ్‌

Apr 11 2024 2:29 PM | Updated on Apr 11 2024 2:55 PM

Rajnath Singh says India ready to cooperate to stop terrorism In Pak - Sakshi

ఢిల్లీ: ఉగ్రవాదం విషయంలో పొరుగు దేశం పాకిస్తాన్‌పై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు పాకిస్తాన్‌కు చేతకాకపోతే.. భారత్‌ సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని అన్నారు. అంతేకానీ, ఉగ్రవాదంతో భారత్‌లో అస్థిర పరిచేందుకు ప్రయత్నాలు చేస్తే ఊరుకోబోమని పాక్‌ను హెచ్చరించారు. ఈ మేరకు జరాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘పాకిస్తాన్‌ అసమర్ధంగా ఉందని భావిస్తే.. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో సహకరించడానికి భారత్‌ సిద్ధంగా ఉంది. భారత్‌లోకి ప్రవేశించి సరిహద్దులు దాటి తప్పించుకునే ఉగ్రవాదులను హతమార్చటంలో భారత్‌ వెనకడుగు వేయబోదు. ఉగ్రవాదులు భారత దేశంలోని శాంతికి భంగం కలిగిస్తే.. మేము పాకిస్తాన్‌లోకి ప్రవేశించి మరీ ఉగ్రమూకలను మట్టుపెడతాం. భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో ఏ ఇతర దేశంపై దాడి చేయదు. పొరుగు దేశంలోని భూభాగాన్ని అక్రమించుకోదు. కానీ, ఎవరైనా భారత్‌లోని శాంతికి భంగం కలిగిస్తే.. ఏమాత్రం ఊరుకోం’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు.

ఇక.. ఇటీవల పాక్‌లో చోటుచేసుకుంటున్న ఉగ్రవాదుల మిస్టరీ హత్యల వెనక భారత్‌ హస్తం ఉన్నట్లు యూకేకు చెందిన ‘దీ గార్డియన్‌’ పత్రిక ఓ నివేదికను వెల్లడించిన విషయం తెలిసిందే. 2019 పుల్వామా దాడుల అనంతరం పాక్‌లోని ఉగ్రవాదులపై భారత్‌ దృష్టి పెట్టిందని.. ఈ విషయాన్ని ఇరుదేశాల ఇంటెలిజెన్స్ అధికారుల నుంచి సేకరించిన సమాచారం మేరకే ఈ నివేదిక విడుదల చేసినట్లు​ గార్డియన్‌ పత్రిక వెల్లడించింది. గార్డియన్‌ పత్రిక ఆరోపణలపై భారత్‌ స్పందిస్తూ.. ‘పూర్తిగా తప్పుడు సమాచారమని, భారత వ్యతిరేక ప్రచారమని పేర్కొంది. టార్గెట్‌ హత్యలు చేయటం భారత విధానం కాదు’ అని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌ సింగ్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అయితే రాజ్‌నాథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై పాక్ విదేశాంగ శాఖ స్పందించింది. ‘భారత్‌ వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. పాకిస్తాన్‌ దృఢమైన సంకల్పం, తమను తాము రక్షించుకునే సామర్థాన్ని చరిత్ర ధృవీకరిస్తుంది’ అని ఓ ప్రకటనలో పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement