
త్రివేణి పడవలో బయల్దేరిన త్రివిధదళాలకు చెందిన 10 మంది మహిళాధికారుల బృందం
ముంబై గేట్‌వే ఆఫ్‌ఇండియా వద్ద జెండా ఊపి ప్రారంభించిన రాజ్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: భారత త్రివిధ దళాల చరిత్రలో నారీశక్తి మరో సువర్ణాధ్యాయానికి శ్రీకారం చుట్టింది. త్రివిధ దళాలకు చెందిన పది మంది మహిళా అధికారుల బృందం తొలిసారిగా సముద్రమార్గంలో భూమిని చుట్టేసేందుకు సాహస యాత్రకు బయల్దేరింది. ఈ యాత్రకు ‘సముద్ర ప్రదక్షిణ’ అని నామకరణం చేశారు. ఈ చరిత్రాత్మక పడవ యాత్రను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీ నుంచి వర్చువల్‌గా జెండా ఊపి ప్రారంభించారు.
సాగరంలో సాహస యాత్ర
ఈ యాత్రలో భాగంగా బృందం సముద్రంలో ఏకధాటిగా 26,000 నాటికల్ మైళ్లు పయనించనుంది. రెండుసార్లు భూమధ్యరేఖను దాట డంతో పాటు, అత్యంత ప్రమాదకరమైనవిగా పేరొందిన మూడు గ్రేట్ కేప్‌లైన కేప్ లీవిన్, కేప్ హార్న్, కేప్ ఆఫ్ గుడ్ హోప్‌లను ఈ బృందం చుట్టి రానుంది. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన దక్షిణ మహాసముద్రం, డ్రేక్ పాసేజ్ జలాల్లో వీరి ప్రయాణం సాగుతుంది. ఈ బృందం 2026 మే నెలలో తిరిగి ముంబై తీరానికి చేరుకుంటుందని అంచనా.
మూడేళ్ల కఠోర శిక్షణ
లెఫ్టినెంట్ కల్నల్ అనూజ వరూద్కర్ నేతృత్వంలోని ఈ బృందంలో స్క్వాడ్రన్ లీడర్ శ్రద్ధా పి. రాజు, మేజర్ కరమ్‌జీత్ కౌర్, మేజర్ ఓమితా దాల్వి, కెప్టెన్ ప్రజక్తా పి నికమ్, కెప్టెన్ దౌలీ బుటోలా, లెఫ్టినెంట్ కమాండర్ ప్రియాంక గుసాయిన్, వింగ్ కమాండర్ విభా సింగ్, స్క్వాడ్రన్ లీడర్ అరువి జయదేవ్, స్క్వాడ్రన్ లీడర్ వైశాలి భండారీ ఉన్నారు. గత మూడేళ్లుగా ఈ బృందం కఠోర శిక్షణ పొందింది. శిక్షణ, సన్నాహక చర్యల్లో భాగంగా ఈ ఏడాది ముంబై నుంచి సుదూర సీషెల్స్ వరకు సముద్రయాత్రను విజయవంతంగా పూర్తిచేసి తమ సన్నద్ధతను ఈ బృందం ఇప్పటికే చాటింది.
ఆత్మనిర్భర్ భారత్‌కు ప్రతీక: రక్షణ మంత్రి
ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పుదుచ్చేరిలో దేశీయంగా నిర్మించిన 50 అడుగుల ఐఏఎస్‌వీ త్రివేణి నౌక ‘ఆత్మనిర్భర్ భారత్’ సంకల్పానికి ప్రతీక అని కొనియాడారు. ఈ నౌక ప్రయాణించే ప్రతీ నాటికల్ మైలు.. దేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి, స్వావలంబన దిశగా వేసే అడుగు అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ఐఎన్‌ఎస్ తారిణి నౌకపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన లెఫ్టినెంట్ కమాండర్లు దిల్నా, రూపాలను ఆయన అభినందించారు.
ఇప్పుడు ‘త్రివేణి’ బృందం కూడా నౌకాయానంలో మరో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ పాల్గొన్నారు.