ఈవీకి పొల్యుష‌న్ స‌ర్టిఫికెట్ లేద‌ని ఫైన్‌ | Rajasthan cop fines EV owner for missing PUC certificate | Sakshi
Sakshi News home page

ఈవీకి పొల్యుష‌న్ స‌ర్టిఫికెట్ లేద‌ని జ‌రిమానా

Apr 14 2026 5:49 PM | Updated on Apr 14 2026 6:01 PM

Rajasthan cop fines EV owner for missing PUC certificate

మ‌న‌దేశంలో ఇటీవ‌ల కాలంలో విద్యుత్తు వాహనాల వినియోగం బాగా పెరిగింది. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించ‌వ‌నే ఉద్దేశంతో వినియోగ‌దారులు ఎల‌క్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే రాజ‌స్థాన్‌లోని ఓ పోలీసు అధికారి ఈవీకి పొల్యుష‌న్ స‌ర్టిఫికెట్ లేద‌ని జ‌రిమానా విధించిన వింత ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. నాగౌర్ నగరంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

టాటా టియాగో ఎల‌క్ట్రిక్ కారు నడుపుతున్న వ్య‌క్తిని ఓ పోలీసు ఆపారు. కారుకు ఎడంపైపున ఉన్న ముందు సీటు విండోకు సన్‌షేడ్ అమ‌ర్చినందుకు వాహనాన్ని మొదట ఆపారు. దీనికి 200 రూపాయ‌ల జ‌రినామా విధించారు. అక్క‌డితో ఆగ‌కుండా పొల్యుష‌న్ అండ‌ర్ కంట్రోల్ (పీయూసీ) స‌ర్టిఫికెట్ చూపించాల‌ని వాహ‌న‌దారుడిని పోలీసు అధికారి అడిగారు. అత‌డు చూపించ‌క‌పోవ‌డంతో మ‌రో రూ.1500 ఫైన్ వేశారు. విద్యుత్ వాహ‌నానికి పీయూసీ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేద‌ని ఎంత చెప్పినా స‌దరు పోలీసు ప‌ట్టించుకోలేదు. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌డం తాను చూశానని, అందుకే కారు ఆపానని మాట మార్చాడు. తాను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయ‌లేద‌ని, సాక్ష్యం చూపించాల‌ని కోరినా ప‌ట్టించుకోలేదు. త‌నకు అకార‌ణంగా జ‌రిమానా  వేసినందుకు కోర్టులో వేస్తాన‌ని చెప్పినా ఆ పోలీసు అధికారి లెక్క‌చేయ‌లేదు. 

ఈ తంతంగం మొత్తాన్ని వీడియో తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెటిజ‌నులు స్పందిస్తున్నారు. పోలీసు అధికారు తీరును త‌ప్పుబ‌డుతూ కామెంట్లు పెడుతున్నారు. ఈవీకి పీయూసీ స‌ర్టిఫికెట్ అడ‌గడం హాస్యాస్ప‌దంగా ఉంద‌ని.. ఇది కాలిక్యులేటర్‌ను వాతావ‌రణం గురించి అడిగిన‌ట్టుగా ఉంద‌ని సెటైర్ వేశారు. తెలియ‌ని విష‌యాన్ని ఒప్పుకోకుండా పోలీసు అధికారి మొండిగా వాదించ‌డాన్ని అజ్ఞానంతో కూడిన అహంకారంగా నెటిజ‌నులు పేర్కొన్నారు. ఈవీకి పీయూసీ స‌ర్టిఫికెట్ అవ‌స‌రం లేద‌ని చాలా మంది పోలీసుల‌కు తెలియ‌ద‌ని, ఇలాంటి విష‌యాల‌పై వారికి శిక్షణ తప్పనిసరి అని వ్యాఖ్యానించారు.

"ఇలాంటి పోలీసు అధికారుల‌ వీడియోలు వైరల్ కావడం మరింత ముఖ్యం. ఎందుకంటే వారికి తెలియ‌ని విషయాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌ర''ని ఓ నెటిజ‌న్ పేర్కొన్నారు. పోలీసు వ్య‌వ‌స్థ‌లోని తెలివితక్కువ వారి వ‌ల్లే దేశం నాశ‌నం అవుతుంద‌ని.. ఇలాంటి వారు లంచాల కోసం ఎంత‌కైనా దిగ‌జార‌తార‌ని మ‌రో నెటిజ‌న్ మండిప‌డ్డారు. ఈవీకి క‌చ్చితంగా పీయూసీ వ‌ర్తించ‌ద‌ని, ఒక‌వేళ డ్రైవింగ్ స‌మ‌యంలో కారు కిటికీల‌కు క‌ర్టెన్లు వేసివుంటే చ‌లానా విధించే అవ‌కాశం ఉంద‌ని మ‌రో నెటిజ‌న్ అన్నారు. 

చ‌ద‌వండి: వాళ్ల త‌ల‌ల్ని 'త‌లారీ'కి అప్ప‌జెప్ప‌వ‌ద్దు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement