‘‘తల్లులు నగలు అమ్ముకున్నారు.. తండ్రులు అప్పులు..’’ | Rahul Gandhi Slams Centre Over NEET UG 2026 Cancellation, Calls It Crime Against Students Future, More Details Inside | Sakshi
Sakshi News home page

‘‘తల్లులు నగలు అమ్ముకున్నారు.. తండ్రులు అప్పులు..’’

May 12 2026 3:31 PM | Updated on May 12 2026 5:32 PM

 Rahul Gandhi slams NEET paper leak

ఢిల్లీ: నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయల్సి రావడం పట్ల లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నీట్ 2026 పరీక్షను రద్దు చేసి, 22 లక్షలకు పైగా విద్యార్థుల కష్టాన్ని వృథా చేశారంటూ ఎక్స్‌లో ఆయన ఓ పోస్ట్‌ చేశారు.

‘‘వారి కలలను బీజేపీ ప్రభుత్వం అణచివేసింది. కొందరు తండ్రులు అప్పులు తీసుకున్నారు, కొందరు తల్లులు తమ నగలు అమ్ముకున్నారు, లక్షలాది మంది పిల్లలు రాత్రంతా మేల్కొని చదువుకున్నారు. దానికి ప్రతిఫలంగా, వారికి పేపర్ లీకులతో షాక్‌ ఇచ్చారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యారంగంలో వ్యవస్థీకృత అవినీతి నెలకొంది. 

ఇది కేవలం వైఫల్యం మాత్రమే కాదు.. ఇది యువత భవిష్యత్తుకు వ్యతిరేకంగా జరిగిన నేరం. ప్రతిసారి పేపర్‌ మాఫియా నిర్దాక్షిణ్యంగా తప్పించుకుంటోంది. నిజాయితీగల విద్యార్థులు శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పుడు, లక్షలాది మంది విద్యార్థులు మరోసారి అదే మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, అనిశ్చితిని భరించాలి. ఒకరి తల రాతను వారి కష్టంతో కాకుండా డబ్బు, పలుకుబడితో నిర్ణయిస్తే ఇక చదువుకు అర్థం ఏముంటుంది? ప్రధానమంత్రి అమృత్ కాలం దేశానికి విష కాలంగా మారింది’’ అని విమర్శించారు.

కాగా, మే 3న నిర్వహించిన నీట్-యూజీ 2026 పరీక్షను కేంద్రం రద్దు చేసింది. ప్రశ్నపత్రం లీక్, పరీక్షలో అక్రమాల ఆరోపణల మధ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వైద్య ప్రవేశ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని ప్రకటించింది. ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు సీబీఐకు ఈ కేసును అప్పగించింది.

ఓ ప్రకటనలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. కేంద్ర సంస్థల నుంచి సమాచారాన్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యవస్థలో పారదర్శకతను కొనసాగించేందుకు భారత ప్రభుత్వం ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ (యూజీ) 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. సీబీఐకి పూర్తి సహకారం అందిస్తామని ఎన్‌టీఏ చెప్పింది. విచారణకు అవసరమైన పత్రాలు, రికార్డులు అందజేస్తుందని తెలిపింది.

దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర అండర్‌గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏకైక ప్రవేశ పరీక్ష నీట్-యూజీ. దీన్ని మే 3న పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించారు. భారత్‌లోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో 5,400కు పైగా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. సుమారు 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు.

Advertisement
 
Advertisement
Advertisement