ప్రధానిపై కాంగ్రెస్ నేత రాహుల్ విమర్శలు
తూత్తుకుడి: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించడం వల్లే ఇరాన్ యుద్ధానికి ముందు ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటన చేపట్టారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎప్‌స్టీన్ ఫైళ్లు, అదానీ పుణ్యమా అని ట్రంప్ దూకమంటే దూకేందుకు మోదీ సిద్ధంగా ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ సోమవారం తూత్తుకుడిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. ప్రధాని మోదీ తాను ఫోన్ చేస్తే సర్..అంటూ సంబోధిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా ప్రకటించారని రాహుల్ పేర్కొన్నారు.
ట్రంప్‌ను తాను సర్ అని సంబోధిస్తాను కాబట్టి, తమిళనాడు సీఎం కూడా తనను సర్ అంటూ గౌరవించాలని మోదీ అనుకుంటున్నారని రాహుల్ పేర్కొన్నారు. సీఎం స్టాలిన్ అలా అనకపోవడం మోదీకి నచ్చడం లేదన్నారు. అందుకే, సర్..అంటూ గౌరవించే అన్నాడీఎంకే నేతను తమిళనాడు సీఎంగా కూర్చోబెట్టాలని, రాష్ట్రాన్ని పూర్తిగా చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. అలా తమిళనాడు ప్రజలు ఎన్నటికీ జరగనివ్వరని విశ్వాసం వ్యక్తం చేశారు. బిహార్ మోడల్‌ను తమిళనాడులోనూ అమలు చేయాలని బీజేపీ ప్రయతి్నస్తోందని రాహుల్ ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీలు తమిళ వ్యతిరేక సంస్థలని మండిపడ్డారు.


