
కిళ్లీ కాదు.. కలవరం..
పాన్.. పాన్.. పాన్.. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలోని పైలట్ చాలా టెన్షన్‌తో అన్న మాట ఇది..
వెంటనే ముంబై ఎయిర్‌పోర్టులో స్టాండర్డ్ ఎమర్జెన్సీ చర్యలను చేపట్టారు. అంబులెన్స్‌లు, అగ్నిమాపక దళం రన్‌వే వద్దకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 9.53 గంటలకు విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానంలో 191 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 9.27 గంటల సమయంలో విమానం ఇంజన్–1లో సమస్య తలెత్తడంతో దాన్ని గుర్తించిన పైలట్.. ‘పాన్.. పాన్.. పాన్’ అంటూ ఎమర్జెన్సీ కాల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
పాన్ అంటే..?
పాన్.. పాన్.. పాన్ అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రామాణికంగా అనుసరించే రేడియో కాల్. తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో వాడే ఎమర్జెన్సీ కాల్ ఇది. ప్రాణాపాయం లేనప్పటికీ.. ఇది అర్జంట్.. దీనిపై వెంటనే దృష్టి సారించాలి అన్నది ఆ కాల్ అర్థం. విమానంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, ఇంజన్లలో సమస్యలు, తక్కువ ఇంధనం ఉండటం, తీవ్రత తక్కువ ఉండే మెకానికల్ సమస్యలు తలెత్తినప్పుడు దీన్ని వాడతారు. అంటే పూర్తిస్థాయి ఎమర్జెన్సీ కాదు.. ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ స్టాఫ్ ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా ‘పాన్’ కాల్ అలర్ట్ చేస్తుంది. పాన్ అనేది పాన్న్ అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం బ్రేక్‌డౌన్.
మేడే.. మేడే.. మేడే..
మేడే మేడే మేడే అని పైలట్ అన్నాడంటే.. తక్షణ ప్రాణాపాయం.. పూర్తిస్థాయి ఎమర్జెన్సీ అని అర్థం. అత్యవసర సాయం అందాలి. అన్ని రకాల సహాయక సిబ్బంది రంగంలోకి దిగాలి. వెంటనే ల్యాండింగ్ క్లియరెన్స్ ఇవ్వాలి. రన్‌వేపై దీనికి అడ్డు లేకుండా.. మిగిలిన విమానాలను తొలగించాలి. ఇంజన్లు మొత్తంగా ఫెయిల్ అయినప్పుడు, విమానంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు, లో క్యాబిన్ ప్రెషర్(దీని వల్ల లోపల ఆక్సిజన్ తగ్గిపోతుంది), తీవ్రమైన మెకానికల్ సమస్య తలెత్తినప్పుడు దీన్ని వాడతారు. మేడే అన్నది మేడి అనే ఫ్రెంచ్ పదం నుంచి వచ్చింది. దీని అర్థం నాకు సహాయం చేయండి అని.. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మేడే మేడే మేడే అని అంటూ పైలట్ అత్యవసర సాయం కోసం అర్థించిన విషయం తెలిసిందే.
మూడు సార్లు ఎందుకు
విమాన, సముద్రయానాల్లో ఇదో ప్రామాణిక పద్ధతి. స్పష్టంగా వినిపించడం కోసం.. అర్థం చేసుకోవడం కోసం మూడుసార్లు చెబుతారు. అలాగే రెగ్యులర్ సంభాషణకు దీనికి మధ్య తేడాను గుర్తించడానికి.. పరిస్థితిని మామూలుగా తీసుకోకుండా వెంటనే స్పందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల పాన్‌కు బదులు మేడే అని.. మేడేకి బదులు పాన్ అని అపార్థం చేసుకునే ప్రమాదాన్ని కూడా నివారించినట్లు అవుతుంది. – సాక్షి, సెంట్రల్ డెస్క్