పంజాబ్‌ టార్గెట్‌.. అతడే ఎందుకు? | Punjab Mission 2027: Why BJP Chose This Leader to Rewrite Political Game | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ టార్గెట్‌.. అతడే ఎందుకు?

May 25 2026 9:18 AM | Updated on May 25 2026 9:41 AM

Punjab Mission 2027: Why BJP Chose This Leader to Rewrite Political Game

పంజాబ్‌లో బీజేపీ కొత్త రాజకీయానికి తెర తీసింది. ఇప్పటివరకు అకాళీదళ్‌కు ‘చిన్నన్న’గా కనిపించిన కమలం పార్టీ.. ఇప్పుడు సొంత బలంతో గెలవాలన్న లక్ష్యంతో భారీ వ్యూహానికి శ్రీకారం చుడుతోంది. వరుస పంజాబ్‌ పర్యటనలు, పంజాబీలో ప్రసంగాలు, కాషాయ తలపాగా, జాట్‌యేతర వర్గాలపై ప్రత్యేక ఫోకస్‌.. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ సమీకరణాలనే మార్చే గేమ్‌ మొదలుపెట్టిందన్న చర్చ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. 

ఈ మొత్తం ఆపరేషన్‌కు పార్టీ ఒక ప్రత్యేక నాయకుడిని రంగంలోకి దింపిందన్న ప్రచారం కూడా నడుస్తోందక్కడ. గత కొన్నినెలలుగా పంజాబ్‌లో ప్రతి వారం రాజకీయ వేడి పెరుగుతోంది. గురుద్వారాల సందర్శనలు, సామాజిక వర్గాల సమావేశాలు, పరిశ్రమల ప్రాంతాల్లో సభలు, పంజాబీలో ప్రసంగాలు.. ఇలా బీజేపీ ఆ ప్రత్యేక నేత ద్వారా విభిన్నమైన వాతావరణం క్రియేట్‌ చేసుకుంఓటంద. ముఖ్యంగా ప్రతి సభలో కాషాయ తలపాగా ధరించి కనిపించడం ద్వారా “ఇతను బయటి వ్యక్తి కాదు.. మనలో ఒక్కడే” అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. 

అసలు హర్యానా సీఎం నాయబ్‌ సింగ్‌ సైనీకి పంజాబ్‌లో ఏం పని?. అక్కడి రాజకీయాల్లో ఆయన్ని ఇంత యాక్టివ్‌గా ఎందుకు దింపారన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దానికి సమాధానం బీజేపీ కొత్త సోషల్‌ ఇంజినీరింగ్‌ వ్యూహంలో కనిపిస్తోంది. 

పంజాబ్‌లో దశాబ్దాలుగా జాట్‌ సిక్కు రాజకీయాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇప్పుడు అదే సమీకరణాన్ని బద్దలు కొట్టాలని కమలం పార్టీ ప్రయత్నిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. జాట్‌యేతర ఓబీసీలు, దళితులు, అగ్రవర్ణ హిందువులను ఒకే రాజకీయ వేదికపైకి తీసుకురావడమే బీజేపీ ప్రధాన లక్ష్యమని భావిస్తున్నారు. ఇక్కడే సైనీ బీజేపీకి సరైన ఎంపికగా మారారు. 

ఆయన సైనీ వర్గానికి చెందిన నేత. పంజాబ్‌లో ఈ వర్గానికి గణనీయమైన ప్రాబల్యం ఉంది. అంతేకాదు.. ఆయన తల్లి నాన్‌-జాట్‌ సిక్కు కావడం, పంజాబీ భాషలో అనర్గళంగా మాట్లాడటం, సిక్కు సంప్రదాయాలకు దగ్గరగా కనిపించడం వంటి అంశాలు బీజేపీ వ్యూహానికి బాగా ఉపయోగపడుతున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం బీజేపీ ప్రధానంగా దోయాబా ప్రాంతంపై దృష్టి పెట్టింది. దళితులు, ఓబీసీలు అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని టార్గెట్‌ చేస్తూ సైనీ వరుస పర్యటనలు చేస్తున్నారు. రైతు ఉద్యమ సమయంలో ఆయన పేరు పెద్దగా వివాదాల్లో రాకపోవడం కూడా బీజేపీకి కలిసొచ్చే అంశంగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు.

మరోవైపు పంజాబ్‌లో అధికారంలో ఉన్న భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని ఆప్‌ ప్రభుత్వాన్ని సైనీ నేరుగా టార్గెట్‌ చేస్తున్నారు. చట్టవ్యవస్థ క్షీణించిందని, డ్రగ్స్‌ మాఫియా పెరిగిపోయిందని, పరిశ్రమలు రాష్ట్రం విడిచి వెళ్తున్నాయని ఆరోపిస్తున్నారు. “హర్యానా తరహా గుడ్‌ గవర్నెన్స్‌ పంజాబ్‌కూ తీసుకొస్తాం” అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు కూడా రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.

ఇదిలా ఉండగా.. అకాళీదళ్‌ బలహీనపడటం, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు పెరగడం కూడా బీజేపీకి అవకాశంగా కనిపిస్తోంది. అందుకే ఈసారి 117 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేయాలని పార్టీ భావిస్తోంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు రాకపోయినా.. దాదాపు 19 శాతం ఓటు షేర్‌ రావడం బీజేపీకి కొత్త ధైర్యాన్ని ఇచ్చిందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

అయితే అసలు ప్రశ్న మాత్రం ఇంకా మిగిలే ఉంది. హర్యానాలో పనిచేసిన ‘నాన్‌-జాట్‌ సోషల్‌ కోలిషన్‌’ ఫార్ములా.. పంజాబ్‌లో కూడా వర్కౌట్‌ అవుతుందా?. జాట్‌ సిక్కు రాజకీయాల కోటలో బీజేపీ నిజంగానే చీలిక తెచ్చగలదా? అనేదానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement