న్యూఢిల్లీ: భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 ఏళ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకున్నారు. ఆయన సరిగ్గా 12 సంవత్సరాల క్రితం.. 2014 మే 26వ తేదీన తొలిసారిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మంగళవారంతో 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మోదీకి బీజేపీ నేతలు అభినందనలు తెలియజేశారు. మోదీ పదవీకాలాన్ని భారతదేశం తిరిగి ఆత్మవిశ్వాసం వైపు పయనించడంగా, సాంస్కృతిక పునరుజ్జీవనంగా అభివర్ణించారు.
మోదీ వరుసగా మూడుసార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2014, 2019, 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. గత 12 ఏళ్లుగా ప్రధాని మోదీ 140 కోట్ల మంది తోటి పౌరులకు సేవ చేయడానికే ప్రతి క్షణాన్ని అంకితం చేశారని, ఈ సంకల్పాన్నే జీవితానికి మార్గదర్శక సూత్రంగా చేసుకున్నారని బీజేపీ పేర్కొంది. మోదీకి అభినందనలు తెలియజేస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, కిరణ్ రిజిజు తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.


