ఓపిక నశిస్తే ఒంటరే! 

Premalatha Warning To AIADMK - Sakshi

సాక్షి, చెన్నై: కూటమి ధర్మానికి కట్టుబడి ఓపికగా ఉన్నాం...అదే నశిస్తే...ఒంటరి పోటీకి రెడీ అని అన్నాడీఎంకేకు డీఎండీకే కోశాధికారి ప్రేమలత హెచ్చరికలు చేశారు. అన్నాడీఎంకే కూటమిలో డీఎండీకే ఉందని ఆ పార్టీ పేర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇంతవరకు అన్నాడీఎంకే వర్గాలు డీఎండీకేతో సీట్ల పందేరం విషయంగా స్పష్టత ఇవ్వలేదు. మమా అనిపించే రీతిలో పయనం సాగుతున్నాయేగానీ, పూర్తి స్థాయిలో సీట్ల సర్దుబాటు, కూటమి చర్చ సాగలేదు. పలుమార్లు చర్చలకు డీఎండీకే ఆహా్వనించినా అన్నాడీఎంకే దృష్టి అంతా పీఎంకేపైనే ఉంది. ఈ పరిస్థితుల్లో ఎదురుచూసి తమకు సహనం నశించిందని, ఇక ఒంటరి పోటీకి సిద్ధమయ్యే నిర్ణయం తీసుకోకతప్పదని అన్నాడీఎంకేకు ప్రేమలత విజయకాంత్‌  ఆదివారం హెచ్చరికలు చేయడం గమనార్హం. 

ప్రేమలత హెచ్చరిక.. 
టీనగర్, సైదాపేట, మైలాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో మాంబళంలో ఆదివారం ప్రేమలత భేటీఅయ్యారు. ఆమె అన్నాడీఎంకేకు హెచ్చరికలు చేస్తూ వ్యాఖ్యల తూటాల్ని పేల్చారు. అన్నాడీఎంకే కూటమిలో ఉన్నా కాబట్టే, ఆ కూటమి ధర్మానికి కట్టుబడి చర్చల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. కూటమి ధర్మాన్ని తాము గౌరవిస్తున్నామని, అందుకే ఓపికతో, సహనంతో ఉన్నామని, ఇది నశించిన పక్షంలో ఒంటరి పోటీకి సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పటికే 234 నియోజకవర్గాలకు విజయకాంత్‌ ఇన్‌చార్జ్‌లను నియమించారని, వాళ్లనే తమ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. తాము ఒంటరిగా పోటీ చేసినా పదిహేను శాతం ఓటు బ్యాంక్‌ దక్కించుకోవడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top