సాక్షి, చెన్నై : సమాజానికి రక్షణగా ఉండాల్సిన పోలీస్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి అర్ధరాత్రి వేళ దారుణానికి ఒడిగట్టాడు. సెలవుల కోసం బంధువుల ఇంటికి వచ్చిన ఒక మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, నోటిలో బలవంతంగా మద్యం పోసి చిత్రహింసలు పెట్టిన ఘటన చెన్నై నగరంలో కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి నిందితుడైన పోలీస్‌పై అశోక్ నగర్ పోలీసులు శరవేగంగా స్పందించి పోక్సో చట్టంలో కేసు నమోదు చేసిన అరెస్ట్ చేశారు. వివరాలు..
కన్యాకుమారి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు ప్లస్–1 చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో రెండు రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలిసి చెన్నై కోడంబాక్కం ప్రాంతంలోని తన మామ ఇంటికి వచ్చాడు. కుటుంబంతో కలిసి పెరియపాలయం, సిరువాపురి ఆలయాలను సందర్శించిన అనంతరం తల్లిదండ్రులు స్వగ్రామానికి తిరిగి వెళ్లగా, ఆ బాలుడు మాత్రం మామ ఇంట్లోనే ఉండిపోయాడు. ఈనేపథ్యంలో వడపళని పోలీస్ స్టేషన్ రైటర్ పనిచేస్తున్న వేలప్పన్ తన మామకు స్నేహితుడు కావడంతో బుధవారం రాత్రి వారి ఇంటికి ఆ బాలుడు వెళ్లాడు. అక్కడ ఆ రైటర్, బాలుడి మామ కలిసి మద్యం సేవించారు. కొంత సమయం తర్వాత బాలుడి మామ మద్యం మత్తులో నిద్రపోయాడు.
బెడ్ రూమ్‌లోకి చొరబడి దారుణం
అర్ధరాత్రి సమయంలో నిందితుడు వేలప్పన్, బాలుడు టీవీ చూస్తూ పడుకున్న పడకగదిలోకి అకస్మాత్తుగా చొరబడ్డాడు. బాలుడిపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, గట్టిగా అరవకుండా ఉండేందుకు నోట్లో మద్యం పోసి క్రూరంగా ప్రవర్తించాడు. నిందితుడి క్రూరత్వం నుండి ఎలాగైనా బయటపడాలని భావించిన ఆ బాలుడు ధైర్యం చేసి, పక్కనే ఉన్న టీవీ రిమోట్‌తో వేలప్పన్‌ను బలంగా కొట్టి కిందకు తోసేశాడు. అనంతరం గదిలోంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చేశాడు. మత్తులో కామాంధుడిగా మారిన ఆ నిందితుడు లోపల ఉంచి ఇంటికి తాళం వేశాడు.
అర్ధరాత్రి వేళ భయంతో కేకలు వేస్తూ కాలినడకన సమీపంలోని అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఆశ్రయం పొందాడు. పోలీస్ స్టేషన్‌లో బాలుడు ఏడుస్తూ తనకు జరిగిన అన్యాయాన్ని వివరించడంతో అధికారులు తక్షణమే స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఇంట్లోనే బందీగా ఉన్న వేలప్పన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. ప్రాథమిక విచారణలో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిరా>్ధరణ కావడంతో, నిందితుడు వేలప్పన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.


