ఆ మూడు రాష్ట్రాలకు వెయ్యి కోట్లు

PM Narendra visits Odisha, Bengal, announces Rs 1,000 cr financial aid - Sakshi

తుపాను ప్రభావిత ఒడిశా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లకు సాయం ప్రకటించిన ప్రధాని మోదీ

భువనేశ్వర్‌/కోల్‌కతా: యాస్‌ తుపానుతో తీవ్రంగా ప్రభావితమైన ఒరిస్సా, పశ్చిమబెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి ప్రధాని మోదీ రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారు. ఇందులో, తక్షణ సాయం కింద ఒడిశాకు రూ.500 కోట్లు, బెంగాల్, జార్ఖండ్‌లకు కలిపి రూ.500 కోట్లు సాయంగా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ఓ ప్రకటనలో వెల్లడించింది. దీంతోపాటు, తుపాను వల్ల మరణించినవారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50వేల చొప్పున పరిహారం ఇస్తారని పీఎంవో తెలిపింది. అంతకుముందు, ఒడిశాలో యాస్‌ తుపాను మిగిల్చిన విషాదం, వాటిల్లిన నష్టంపై ప్రధాని మోదీ స్వయంగా సమీక్ష నిర్వహించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో గవర్నర్‌ గణేష్‌ లాల్, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్‌ సారంగి పాల్గొన్నారు. తుపాన్ల సమస్యకు దీర్ఘకాలిక పరిష్కారం చూపాలని ఈ సందర్భంగా ఒడిశా సర్కారు డిమాండ్‌ చేసింది.  సమావేశం అనంతరం ప్రధాని బాలాసోర్, భద్రక్‌ తదితర ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించి బెంగాల్‌కు వెళ్లారు.

రూ.20 వేల కోట్ల ప్యాకేజీ కోరిన మమత
తుపానుతో రాష్ట్రంలో సంభవించిన నష్టం వివరాలను పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ప్రధానికి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల పునర్నిర్మాణానికి రూ.20వేల కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. బెంగాల్‌లో తుపాను పరిస్థితిని సమీక్షించేందుకు మోదీ కోల్‌కతాకు వచ్చారు. దిఘాలో సీఎం మమతా బెనర్జీతో 15 నిమిషాలపాటు భేటీ అయ్యారు.తుపానుతో రూ.20వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు మమత చెప్పారు.
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top