సహకారం, సమన్వయమే మన బలం
సమాచారం పంచుకోవాలి, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలి
ప్రస్తుత సవాల్‌ను కచ్చితంగా అధిగమిస్తాం
ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యం
ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్ భేటీ
న్యూఢిల్లీ: పశ్చిమాసియా పరిణామాలు, ప్రపంచ అనిశ్చిత పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఆర్థిక, వాణిజ్య స్థిరత్వాన్ని కొనసాగించడానికి, ఆహార భద్రతను విఘాతం కలగకుండా చూడడానికి, ప్రజల ప్రయోజనాల పరిరక్షణకు, పరిశ్రమలు, సప్లై చైన్లను బలోపేతం చేయడానికి కేంద్రం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఆయన శుక్రవారం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు. తాజా పరిస్థితిపై విస్తృతంగా చర్చించారు. ఆయా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను సమీక్షించారు.
రాబోయే రోజుల్లో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురైనా సరే ఎదుర్కోవడానికి మనమంతా ‘టీమ్ ఇండియా’ స్ఫూర్తితో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమాసియాలో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ రాష్ట్రాల సీఎంలతో భేటీ కావడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుత సవాల్‌ను మనం కచ్చితంగా అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు. కోవిడ్–19 మహమ్మారి ఉధృతి సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి ఆ సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.
ప్రతికూల పరిణామాలను ఎదుర్కొన్న అనుభవం మనకు ఉందన్నారు. తాజా సంక్షోభం పట్ల మన ప్రతిస్పందన వేగంగా ఉండాలంటే సమాచారం పంచుకోవాలని, ఉమ్మడిగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రాలు సైతం మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని కోరారు. సప్లై చైన్లు సజావుగా పనిచేసేలా చూడాలని, సరుకుల అక్రమ నిల్వలు, రవాణా, అక్రమార్జనపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. ఇంధనం, సరుకుల సరఫరాలో అంతరాయాలను నివారించడానికి పరిపాలనా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. నిత్యావసరాల సరఫరా పట్ల ఆందోళన తలెత్తకుండా ప్రజలకు వాటిని అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ఎరువులపై ముందస్తు ప్రణాళిక అవసరం
పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని, అందుకే నిరంతర పర్యవేక్షణ అవసరమని ప్రధాని మోదీ వెల్లడించారు. కేంద్రం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం ప్రతిరోజూ పరిస్థితులను సమీక్షిస్తోందని పేర్కొన్నారు. రైతాంగానికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్‌కు ముందు ఎరువుల నిల్వ, పంపిణీని పర్యవేక్షించడానికి ముందస్తు ప్రణాళిక అవసరమని స్పష్టంచేశారు. ప్రజల్లో భయాందోళనకు తావులేకుండా వారికి ఎప్పటికప్పుడు సరైన సమాచారాన్ని అందించాలన్నారు.
తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తిని అరికట్టాలన్నారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ ఏజెంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని తేల్చిచెప్పారు. అలాగే నౌక రవాణా, నిత్యావసర వస్తువుల సరఫరా, సముద్ర కార్యకలాపాలకు సంబంధించి తలెత్తే సవాళ్లను పరిష్కరించేందుకు సరిహద్దు, తీరప్రాంత రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని వివరించారు. ప్రజల్లో విశ్వాసం పెంపొందించడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్బోధించారు.
సహకారం, సమన్వయమే మన బలమని ఉద్ఘాటించారు. ఈ వర్చువల్ సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాతోపాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, జమ్మూకశీ్మర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖూ, అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పెమా ఖండూ తదితరులు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల సీఎంలు పాల్గొనలేదు.


