వేద సంస్కృతిని కాపాడడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తోంది
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చొరవ చూపాలి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వినతి
న్యూఢిల్లీ: సామాజిక సంస్కర్త దయానంద సరస్వతి స్థాపించిన ఆర్య సమాజ్ సేవల పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. దేశంలో వేద
సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడడంలో ఆర్య సమాజ్ క్రియాశీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ప్రాచీన గ్రంథాల పఠనంతోపాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చొరవ చూపాలని కోరారు.
దయానంద సరస్వతి 200వ జయంతితోపాటు ఆర్య సమాజ్‌ను స్థాపించి 150 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్య మహాసమ్మేళనంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సైతం హాజరయ్యారు.
భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ఆర్య సమాజ్ చురుకైన పాత్ర పోషించిందని ఈ సందర్భంగా మోదీ గుర్తుచేశారు. అయినప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆర్య సమాజ్‌కు సరైన గుర్తింపు రాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సంస్థకు 150 ఏళ్లు పూర్తి కావడం అనేది వేద సంస్కృతి, భారతీయ గుర్తింపునకు సంబంధించిన విషయమని ఉద్ఘాటించారు.
స్వదేశీ వస్తువులే వాడుకోవాలి
దయానంద సరస్వతి గొప్ప సంస్కర్త అని ప్రధాని మోదీ కొనియాడారు. అభివృద్ధికి అడ్డుగోడగా నిలిచిన అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారని చెప్పారు. నూతన ఆలోచనలతో ముందుకెళ్లాలని బోధించారని తెలిపారు. దేశ నిర్మాణంలో ఆర్య సమాజ్ పాత్ర చిరస్మరణీయమని స్పష్టంచేశారు. స్వదేశీ ఉద్యమాన్ని హోరెత్తించిన ఘనత ఆ సంస్థకే దక్కుతుందన్నారు.
మన దేశంలో తయారైన వస్తువులే కొనుగోలు చేసి వాడుకోవాలని ప్రజలకు మరోసారి పిలుపునిచ్చారు. వోకల్ ఫర్ లోకల్‌కు పెద్దపీట వేయాలన్నారు. తాళపత్ర గ్రంథాలు చదవడం అలవాటు చేసుకోవాలని యువతకు సూచించారు. నేటి అవసరాలకు తగ్గట్టుగా తృణ ధాన్యాల సాగును పెంచుకోవాలని అవసరం ఉందని తెలిపారు. ఈ విషయంలో ఆర్య సమాజ్ సహకారం కోరుతున్నాయని వెల్లడించారు.


