అధికారమే తప్ప పిల్లల భవిష్యత్తు పట్టదు | PM Narendra Modi only cares about survival of his govt, not kids future | Sakshi
Sakshi News home page

అధికారమే తప్ప పిల్లల భవిష్యత్తు పట్టదు

May 30 2026 4:53 AM | Updated on May 30 2026 4:53 AM

PM Narendra Modi only cares about survival of his govt, not kids future

ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ధ్వజం 

సీబీఎస్‌ఈ అవకతవకలపై జ్యుడీషియల్‌ విచారణకు డిమాండ్‌ 

న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈలో అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం దాల్చడం, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌పై చర్యలు తీసుకోకపోవడంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. మోదీ శ్రద్ధంతా తన పదవిని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడంపైనే తప్ప, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏమాత్రం పట్టింపులేదని ధ్వజమెత్తారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పలు వ్యాఖ్యలు చేశారు. 

సీబీఎస్‌ఈ ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌(ఓఎస్‌ఎం), సీవోఈఎంపీటీకి ఈ కాంట్రాక్టును అప్పగించడంపై జ్యుడీషియల్‌ దర్యాప్తు చేపట్టాలంటూ ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన రోజు నుంచే తాను డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ వ్యవహారం వెనుక వాస్తవాలు దేశ యువతకు తెలియడం అవసరమన్నారు. ‘ఓఎస్‌ఎం కోసం సీబీఎస్‌ఈ మూడుసార్లు టెండర్లు పిలిచింది. మొదటిసారి ఒక్కరూ రాలేదు. రెండోసారి వచ్చిన బిడ్డర్లలో అర్హులు లేరు.

 చివరగా, ఎంతో కీలమైన సాంకేతిక అర్హతలను కుదించిన తర్వాత సీవోటీఎంపీటీ రంగంలోకి వచ్చింది. ఆ కంపెనీకే టెండర్‌ కట్టబెట్టారు. ఆన్సర్‌ షీట్లలో దొర్లే పొరపాట్లకు జరిమానాలను తొలగించారు. రోబోటిక్‌ స్కానర్‌ అవసరం లేదన్నారు. స్కానింగ్‌ రిజొల్యూషన్‌ను తగ్గించారు’అని రాహుల్‌ తెలిపారు. ‘మంచి పేరున్న దేశంలోనే  అతిపెద్ద ఐటీ సేవల కంపెనీ టీసీఎస్‌ టెండర్‌ వేసినా కాంట్రాక్టు ఇవ్వలేదు.

 ఘనమైన ఫెయిల్యూర్‌ రికార్డు కలిగిన సీవోటీఎంపీటీకి కాంట్రాక్టు కట్టబెట్టారు. ఈ కంపెనీ ఎవాల్యుయేషన్‌ తీరు ఎలా ఉందో బాధిత విద్యార్థులే చెబుతున్నారు’అంటూ రాహుల్‌ ఆరోపించారు. ఓఎస్‌ఎం విధానాన్ని తీసుకు వచ్చేముందు కనీసం ఒకటీ రెండు సంవత్సరాలు సన్నద్ధతా చర్యలను చేపట్టాలని ముందు నుంచే నిపుణులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని రాహుల్‌ విమర్శించారు.

 ఇలాంటి తప్పిదాలన్నిటికీ ప్రభుత్వానిదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలను సైతం పక్కనబెట్టేసి 18.5 లక్షల విద్యార్థుల భవిష్యత్తును ఓ విఫల సంస్థకు ధారాదత్తం చేసిందంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఈ మొత్తం వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించాలన్నదే తన ఏకైక డిమాండ్‌ అని రాహుల్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement