
అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి
ఇంఫాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో పర్యటించనున్నారు. 2023లో రెండు జాతుల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత ప్రధాని మణిపూర్‌లో అడుగుపెడుతుండడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. రూ.1,200 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారని, రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పునీత్‌కుమార్ గోయల్ శుక్రవారం తెలిపారు.
చురాచాంద్‌పూర్, ఇంఫాల్‌లో ఘర్షణల్లో నిరాశ్రయులైన ప్రజలతో మోదీ సమావేశమవుతారని వెల్లడించారు. రెండు ర్యాలీల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. మోదీ పర్యటన అనంతరం రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, ప్రగతి వేగవంతం అవుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. మణిపూర్ సమగ్ర, సుస్థిర అభివృద్ధికి ప్రధానమంత్రి కట్టుబడి ఉన్నట్లు ఆయన కార్యాలయం స్పష్టంచేసింది.
మణిపూర్‌లో నరేంద్ర మోదీ రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్‌ను ప్రారంభించబోతున్నారు. అలాగే మణిపూర్ ఇన్ఫోటెక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మణిపూర్ కేవలం సరిహద్దు రాష్ట్రం కాదని.. యాక్ట్ ఈస్ట్ పాలసీకి ఒక మూలస్తంభమని, సౌత్‌ఈస్ట్ ఆసియాకు ముఖద్వారమని పునీత్‌కుమార్ గోయల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకాలని, ఆయన నిర్వహించే సభల్లో పాల్గొనాలని ప్రజలకు పిలుపునిచ్చారు.