సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి
కెన్–బెత్వా ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవచ్చు
రాష్ట్రాలకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ: అంతర్రాష్ట్ర జల వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పరస్పర సహకారం, సకాలంలో అనుమతులు, సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ ద్వారా జల వివాదాలకు తెరదించాలని చెప్పారు. ఈ విషయంలో కెన్–బెత్వా లింక్ ప్రాజెక్టును ఆదర్శంగా తీసుకోవచ్చని సూచించారు. బుధవారం సాయంత్రం జరిగిన 51వ ‘ప్రగతి’సమావేశానికి ప్రధాని మోదీ నేతృత్వం వహించారు.
తొమ్మిది రాష్ట్రాల్లో రైల్వేలు, విద్యుత్, రహదారుల అనుసంధానానికి సంబంధించిన రూ.30 వేల కోట్ల విలువైన ఏడు మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. ప్రజా ప్రాజెక్టుల అమల్లో జాప్యం వల్ల ఖర్చు పెరగడమే కాకుండా, అవసరమైన సౌకర్యాలను పౌరులు సకాలంలో పొందలేకపోతున్నారని వెల్లడించారు.
బుధవారం జరిగిన ఈ భేటీ గురించి మోదీ గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘ప్రగతి’సమావేశంలో ఓడరేవులు, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0, ఇతర సామాజిక రంగాల పథకాలపై కూడా చర్చించినట్లు తెలిపారు. అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకొనే విషయంలో కెన్–బెత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు ఒక నమూనాగా నిలవాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. దీర్ఘకాలిక నీటి భద్రత కోసం నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవం, సమర్థవంతమైన నీటిపారుదల నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.


