
మణిపూర్‌లో కొండ ప్రాంతాలు, లోయ మధ్య సోదరభావం నెలకొనాలి
రాష్ట్రంలో అన్ని జాతులు కలిసికట్టుగా జీవనం సాగించాలి
హింసను విడనాడి అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి
ప్రధానమంత్రి మోదీ పిలుపు రాష్ట్రాన్ని శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా మారుస్తామని ప్రతిజ్ఞ
ఇంఫాల్, చురాచాంద్‌పూర్‌లో బహిరంగ సభలు
ఇంఫాల్/చురాచాంద్‌పూర్: మణిపూర్‌లో జాతుల మధ్య సోదరభావం నెలకొనాలని, అన్ని వర్గాల ప్రజలు శాంతి సామరస్యాలతో కలిసికట్టుగా జీవించాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. రాష్ట్రంలో కొండ ప్రాంతాలు, లోయ మధ్య బలమైన విశ్వాస వారధిని కచ్చితంగా నిర్మించాలని తేల్చిచెప్పారు. మణిపూర్ లోయలో మైతేయీలు, కొండ ప్రాంతాల్లో కుకీలు నివసిస్తుంటారు. రాష్ట్రాన్ని శాంతి, సౌభాగ్యాలకు ప్రతీకగా మారుస్తామని ప్రధాని మోదీ ప్రతిజ్ఞ చేశారు.
హింసను విడనాడి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఆశ, విశ్వాసం అనే నూతన సూర్యోదయం సంభవిస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన శనివారం మణిపూర్‌లో పర్యటించారు. 2023 మే నెలలో కుకీలు, మైతేయీల మధ్య ఘర్షణ మొదలైన తర్వాత రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. మోదీకి ఘన స్వాగతం లభించింది. రాజధాని ఇంఫాల్‌లోని కాంగ్లా పోర్ట్, చురాచాంద్‌పూర్‌లో బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
మణిపూర్ ప్రజలకు తగిలిన గాయాలను నయం చేయడానికి, వారిలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి, బాధితులందరినీ ఆదుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రకటించారు. మణిపూర్ అంటే ఒక రత్నం.. అది భరతమాత కిరీటంలో పొదిగిన రత్నమని అభివరి్ణంచారు. రాష్ట్రంలో హింస ఎక్కడ, ఏ రూపంలో జరిగినా ఖండించాల్సిందేనని చెప్పారు. హింస దురదృష్టకరమని, హింసాకాండకు పాల్పడడం మన పూరీ్వకులకు, భవిష్యత్తు తరాలకు అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. మనమంతా కలిసి మణిపూర్‌ను శాంతి, అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్దామని ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
హింసతో సామాజిక జీవనం బలహీనం
మణిపూర్‌లో శాంతిని బేరసారాలు, బలప్రయోగంతో సాధించలేం. సుహృద్భావ వాతావరణంలో సంప్రదింపులు, ప్రజల ఐక్యతతోనే అది సాధ్యం. మణిపూర్ శక్తివంతమైన, సుందరమైన రాష్ట్రం. కానీ, ఇక్కడి సామాజిక జీవనాన్ని హింసాకాండ బలహీనపర్చింది. శాంతి, సామరస్యంతోనే తూర్పు భారతదేశ కీర్తికిరీటంలో తన స్థానాన్ని మణిపూర్ తిరిగి పొందుతుంది. మణిపూర్‌లోనే మణి ఉంది. ఈశాన్య భారతదేశంలో ఈ మణి గొప్పగా ప్రకాశించబోతోంది.
రాష్ట్రంలో ఘర్షణ వల్ల నష్టపోయిన బాధితుల కోసం రాష్ట్రంలో 7,000 నూతన ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చాం. రూ.3,000 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం. బాధితులకు సాంత్వన కలిగించడమే మా లక్ష్యం. వారి జీవితాల్లో వెలుగులు నిండాలి. కేంద్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మణిపూర్‌లో ప్రగతి వేగం పుంజుకుంది. 2014 కంటే ముందు ఇక్కడ వృద్ధి రేటు ఒక శాతం కంటే తక్కువే. ఇప్పుడు అభివృద్ధిలో ముందంజలో ఉంది. 21వ శతాబ్దం తూర్పు, ఈశాన్య భారతదేశానికే చెందుతుంది. అందుకే మణిపూర్‌కు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.
‘సిందూర్’ విజయంలో మణిపూర్ జవాన్లు
‘‘నేతాజీ సుభాష్ చంద్రబోస్ మణిపూర్‌ను భారతదేశ స్వాతంత్య్రానికి ముఖద్వారంగా అభివర్ణించారు. భారత జాతీయ సైన్యం(ఐఎన్‌ఏ) త్రివర్ణ పతాకాన్ని మొదట ఇక్కడే ఎగురవేసింది. ఈ రాష్ట్రం ఎంతోమంది వీరులను దేశానికి అందించింది. వారి త్యాగాల స్ఫూర్తితోనే మేము అడుగులు ముందుకు వేస్తున్నాం. మహిళా సాధికారత మణిపూర్ సంప్రదాయం. పూర్తిగా మహిళలతోనే నడిచే మార్కెట్ ఇమా కీథెల్ ఉంది. మహిళామణుల గొప్పతనానికి అదొక ఉదాహరణ. ఆర్థిక వ్యవస్థలో తల్లులు, సోదరీమణులు ముందు వరుసలో ఉంటున్నారు. దేశ ప్రగతికి, స్వయం స్వావలంబనకు మహిళల బలమే చోదకశక్తి. ఈ స్ఫూర్తిని అందిస్తున్న రాష్ట్రం మణిపూర్. దేశ రక్షణకు మణిపూర్ సైనికులు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ విజయంలో అత్యంత కీలక పాత్ర పోషించారు’’ అని మోదీ ప్రశంసించారు.
పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
ప్రధాని మోదీ మణిపూర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. రాజధాని ఇంఫాల్‌లో రూ.1,200 కోట్ల విలువైన 17 ప్రాజెక్టులను ప్రారంభించారు. పోలీసు ప్రధాన కార్యాలయం, సివిల్ సెక్రటేరియట్‌కు ప్రారంభోత్సవం చేశారు. అలాగే మహిళా మార్కెట్లను, ఐదు ప్రభుత్వ కాలేజీలను, వంతెనలు, రహదారులను ప్రారంభించారు. చురాచాంద్‌పూర్‌లో రూ.7,300 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శంకస్థాపన చేశారు.
ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు
‘‘అభివృద్ధి జరగాలంటే శాంతియుత పరిస్థితులు నెలకొనడం తప్పనిసరి. గత 11 ఏళ్లలో ఈశాన్యంలో ఎన్నో వివాదాలు, ఘర్షణలను పరిష్కరించాం. ఇక్కడి ప్రజలు శాంతి, అభివృద్ధినే కోరుకుంటున్నారు. మీ కలలు నిజం చేసుకోవాలంటే, మీ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలంటే శాంతి మార్గంలో నడవాలని జాతులకు సంబంధించిన అన్ని గ్రూప్‌లను కోరుతున్నా. మేము మీతోనే ఉన్నాం. మీకు సహకరిస్తాం. కేంద్ర ప్రభుత్వ చొరవతో లోయ, కొండ ప్రాంతాల మధ్య ఇటీవల చర్చలు జరగడం సంతోషంగా ఉంది. మణిపూర్ ప్రజలు ఈరోజు నాపై కురిపించిన ప్రేమాభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని ప్రధాని మోదీ అన్నారు.
నిరాశ్రయులకు మోదీ అభయం
మణిపూర్‌లో రెండు జాతుల మధ్య ఘర్షణల కారణంగా నిరాశ్రయులై, ప్రభుత్వ శిబిరాల్లో తలదాచుకుంటున్న ప్రజలను ప్రధాని మోదీ పరామర్శించారు. ఇంఫాల్‌తోపాటు చురాచాంద్‌పూర్‌లో వారిని కలుసుకున్నారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కలి్పంచారు. నిరాశ్రయులు మోదీకి తమ గోడు వెళ్లబోసుకున్నారు. బోరున విలపించారు. కొందరు కన్నీళ్లు ఆపుకొనేందుకు ప్రయత్నించారు.
హింసాకాండలో కుటుంబ సభ్యులను, ఆప్తులను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయామని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నారులను మోదీ పలుకరించారు. ఆప్యాయంగా మాట్లాడారు. వారు ఆయనకు పుష్పగుచ్ఛం, పెయింటింగ్‌ను అందజేశారు. పక్షి ఈకలతో రూపొందించిన టోపీని ఓ చిన్నారి బహూకరించగా, మోదీ దాన్ని ధరించారు. రాష్ట్రంలో శాంతి, స్థిరత్వం నెలకొంటుందని, మీ జీవితాలు మెరుగుపడతాయని మోదీ చెప్పారు. రాష్ట్రంలో గత రెండేళ్లలో 60,000 మంది నిరాశ్రయులైనట్లు ప్రభుత్వ గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. వీరిలో కుకీలు 40,000 మంది, మైతేయీలు 20,000 మంది ఉన్నారు.
గ్రోత్ ఇంజన్ ‘ఈశాన్యం’
గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల అన్యాయం
మేము వచ్చాక ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం
మిజోరంలో ప్రధాని మోదీ స్పష్టీకరణ
ఐజ్వాల్: ఈశాన్య భారతదేశం గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఎంతగానో నష్టపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో నేడు అదే ఈశాన్య ప్రాంతం భారతదేశ గ్రోత్ ఇంజన్‌గా మారిందని ఉద్ఘాటించారు. ఆయన శనివారం ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో పర్యటించారు. రూ.9,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. రాజధాని ఐజ్వాల్‌లోని లామ్వాల్ గ్రౌండ్‌లో సభలో పాల్గొనాల్సి ఉండగా, భారీ వర్షం కారణంగా అక్కడికి చేరుకోలేకపోయారు. దాంతో ఎయిర్‌పోర్టులోనే అభివృద్ధి ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభించారు. పలు రైళ్లకు పచ్చజెండా ఊపారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. గతంలో కొన్ని పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడ్డాయని విమర్శించారు.
కేవలం ఎక్కువ ఓట్లు, సీట్లు ఉన్న ప్రాంతాలపైనే ఆ పారీ్టల దృష్టి ఉండేదని చెప్పారు. దీనివల్ల మిజోరం సహా ఈశాన్య భారతదేశంలోని రాష్ట్రాలన్నీ నిర్లక్ష్యానికి గురయ్యాయని, అభివృద్ధిలో వెనుకబడిపోయాయని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక ప్రాధాన్యం దక్కిందని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రూ.8,070 కోట్లతో నిర్మించిన బైరాబీ–సైరంగ్ రైల్వేలైన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 51.38 కిలోమీటర్ల ఈ లైన్ మిజోరంను దేశంలో మిగతా ప్రాంతాలతో అనుసంధానిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ఇది చరిత్రాత్మక దినమని పేర్కొన్నారు.