Narendra Modi: టీకానే ఆయుధం

PM Narendra Modi to address Virtual Vesak Global Celebrations - Sakshi

కరోనాపై పోరులో అదే ముఖ్యం

ఆత్మీయులను కోల్పోయాం

ప్రధాని మోదీ ఆవేదన

న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధాన్ని గెలవడానికి, కోవిడ్‌ 19 నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం టీకా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవితకాలంలో ఒకసారి ఎదురయ్యే అసాధారణ విపత్తు ఇదని, ఈ మహమ్మారితో ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయామని, ఆర్థికంగా కూడా ఇది భారీగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు.

బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుధవారం ‘వేసక్‌ గ్లోబల్‌ సెలబ్రేషన్స్‌’లో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం ఇచ్చారు. అన్ని దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని.. పరిస్థితులు గతంలో వలె ఉండబోవని, భవిష్యత్‌ పరిణామాలను ఇకపై ‘కరోనా పూర్వ – కరోనా అనంతర’ పరిణామాలుగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. కరోనాపై పోరులో ముందంజ వేశామని,  కరోనాను తుదముట్టించే కీలక ఆయుధంగా టీకా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.  

ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు సెల్యూట్‌
ఇతరుల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ యోధులకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. నేపాల్, శ్రీలంక ప్రధానులు, అంతర్జాతీయ బుద్ధిస్ట్‌ కాన్ఫెడరేషన్‌ సెక్రటరీ జనరల్‌ ఈ వర్చువల్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుద్ధుని జీవితం శాంతియుత సహజీవనాన్నే బోధించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు.

వాతావరణ మార్పు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత తరం నిర్లక్ష్యపూరిత జీవనవిధానం భవిష్యత్‌ తరాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రకృతిని గౌరవించాలని బుద్ధుడు బోధించాడని గుర్తు చేశారు. పారిస్‌ ఒప్పంద లక్ష్యాల సాధన దిశగా వెళ్తున్న దేశాల్లో భారత్‌ ఒకటన్నారు. మానవుల వేదనను తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన బుద్ధుని వలె.. కరోనా మహమ్మారితో బాధపడ్తున్నవారికి సాయం అందించేందుకు కొన్ని సంస్థలు, వ్యక్తులు కృషి చేస్తున్నాయని ప్రశంసించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top