
ఆంధ్రప్రదేశ్‌లో దొరికే అరుదైన చంద్రశిల బౌల్స్ అందజేత
న్యూఢిల్లీ: జపాన్‌లో పర్యటించిన భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం జపాన్ ప్రధానమంత్రి షిగేరు ఇషిబాకు గౌరవప్రదంగా కొన్ని విలువైన కానుకలు బహూకరించారు. షిగేరు సతీమణికి సైతం మోదీ కానుక అందజేశారు. కశ్మీర్‌లో లభించే చేతితో అల్లిన అత్యంత నాణ్యమైన పశ్మీనా ఉన్ని శాలువను షిగేరు సతీమణి యోషికోకు బహూకరించారు. లద్దాఖ్‌లోని ఛాంగ్‌థంగీ జాతి మేక ఉన్నితో ఈ పశ్మీనా శాలువను తయారుచేశారు.
ఈ శాలువ అత్యంత తేలికగా, మృదువుగా, వెచ్చగా ఉంటుంది. గతంలో కశ్మీరీ రాజుల కాలంలో ఈ పశ్మీనా ఉన్ని దుస్తులను ఎంతగానో ఇష్టపడేవారు. అదే సంస్కృతిని కశ్మీరీలు పరంపరగా కొనసాగిస్తూ హస్తకళను జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. శ్వేతవర్ణ అంచుతో, ఎరుపు, గులాబి రంగుల మేళవింపుతో అందంగా ఈ శాలువాను తయారుచేశారు. కాగితపు గుజ్జు, జగురు ఇతర సామగ్రితో అందంగా రూపొందించిన చిన్న పెట్టెలో పెట్టి ఈ శాలువాను ఆమెకు అందజేశారు.
ఈ చిన్న పెట్టె మీద సైతం పుష్పాలు, పక్షుల చిత్రాలను అందంగా పెయింటింగ్ వేశారు. జపాన్ ఆహార అలవాట్లకు అనువుగా.. ఆంధ్రప్రదేశ్‌లో దొరికే అరుదైన గోధుమరంగు మూన్‌స్టోన్ రాయితో చేసిన రామెన్ గిన్నెను జపాన్ ప్రధానికి మోదీ బహూకరించారు. ఈ రామెన్ బౌల్‌ను పెట్టేందుకు రాజస్తానీ పార్చిన్‌కారి శైలిలో శ్వేతవర్ణ మక్రానా పాలరాయితో ఒక బేస్‌ను తయారుచేశారు. ఈ బేస్‌పై అరుదైన చిన్న రాళ్లను పొదిగారు.
ఈ బౌల్‌లో ఆహారాన్ని జపాన్ శైలిలో తినేందుకు రెండు చాప్‌స్టిక్‌లను తయారుచేశారు. వాటి కొనలను వెండితో రూపొందించారు. పెద్ద బౌల్‌కు తోడుగా నాలుగు చిన్న బౌల్‌లను అందజేశారు. జపాన్‌లోని డోంబురీ, సోబా సంప్రదాయాల్లో ఇలా ఒక పెద్ద గిన్నె, నాలుగు చిన్న గిన్నెలను వాడతారు. మూన్‌స్టోన్ రాయి ప్రేమ, సమతుల్యత, రక్షణలను సూచిస్తుంది.