బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన అద్భుతమైన 'ధ్యాన మందిరం', తన మొట్టమొదటి భారీ కార్యక్రమానికి సిద్ధమైంది. మే 13, 2026న గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారి నేతృత్వంలో "ప్రపంచ శాంతి కోసం గురుదేవ్‌తో కలిసి ధ్యానం" అనే అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది.
'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్'లో ప్రతిష్టాత్మక ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన 72 గంటలలోపే, ఆ అద్భుతమైన ధ్యాన క్షేత్రం తన మొదటి కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ధ్యాన కార్యక్రమంలో 182 దేశాల నుండి లక్షలాది మంది ప్రజలు ప్రత్యక్షంగా మరియు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పాల్గొననున్నారు. చరిత్రలోనే ఇది అతిపెద్ద సామూహిక ధ్యాన కార్యక్రమాల్లో ఒకటిగా నిలవనుంది.
ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోదీ ఆధ్యాత్మికత , మానసిక ఆరోగ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధునిక యుగంలో ఒత్తిడి, అనిశ్చితి ఎదుర్కొంటున్న యువతకు ఇలాంటి ఆధ్యాత్మిక కేంద్రాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. "మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువత ద్వారానే అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మించబడుతుంది" అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యేక ధ్యాన కేంద్రాలలో ఒకటైన దీని వెనుక ఉన్న స్ఫూర్తి గురించి మాట్లాడిన మోదీ సంకల్పం స్పష్టంగా ఉన్నప్పుడు, సేవాభావంతో పని చేసినప్పుడు, ప్రతి ప్రయత్నం సరైన ఫలితాన్ని ఇస్తుందంటూ కొనియాడారు."ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ 45 ఏళ్లుగా ఒక మహావృక్షంలా విస్తరించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో జీవితాలను ప్రభావితం చేస్తోందని ప్రశంసించారు.
45 ఏళ్ల వేడుకలు
ఈ గ్లోబల్ మెడిటేషన్ ఈవెంట్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ స్థాపించి 45 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న నెల రోజుల వేడుకల్లో భాగంగా జరుగుతోంది. మే 13న జరిగే 'ది వరల్డ్ మెడిటేట్స్ విత్ గురుదేవ్' కార్యక్రమం, 'ది ఆర్ట్ ఆఫ్ లివింగ్' 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల రోజుల పాటు జరిగే వేడుకలలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ వేడుకలకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంతో మజుందార్; కేంద్ర ఓడరేవులు, నౌకా రవాణా మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, మణిపూర్ ముఖ్యమంత్రి యుమ్నం ఖేమ్‌చంద్ సింగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ఉత్తరాఖండ్ గవర్నర్ నంద్ కిషోర్ యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్,రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, హిరానందాని గ్రూప్ ఛైర్మన్ నిరంజన్ హిరానందానిలాంటి ప్రముఖులు హాజరు కానున్నారు.
ఈ ప్రపంచ స్థాయి ధ్యాన కార్యక్రమం, వివిధ కాల మండలాలు , ఖండాలలో విస్తరించి ఉన్న లక్షలాది మందిని ఒకే క్షణంలో సామూహిక మౌనం మరియు ఆత్మపరిశీలన కోసం ఏకం చేస్తుందని ఆశిస్తున్నారు. "అంతర్గత శాంతి మాత్రమే బాహ్య ప్రపంచంలో శాంతిని తీసుకురాగలదు" అనే సందేశాన్ని గురుదేవ్ గత నాలుగున్నర దశాబ్దాలుగా చాటుతున్నారు.బెంగళూరులోని ఈ ధ్యాన మందిరం ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది, ఇది శాంతికి మరియు మానసిక వికాసానికి కేంద్ర బిందువుగా మారనుంది.


