న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలతో నేరుగా మమేకమయ్యే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మక రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ 134వ ఎపిసోడ్ ఈరోజు (ఆదివారం) ప్రసారమైంది. 2014లో ప్రారంభమైన ఈ కార్యక్రమం ద్వారా సామాజిక అంశాలు, దేశ ప్రగతి, పౌరుల స్ఫూర్తిదాయక గాథలను ప్రధాని దేశానికి పరిచయం చేస్తున్నారు. తాజా ఎపిసోడ్లో క్రీడారంగంలో యువత సాధిస్తున్న విజయాలను కొనియాడుతూనే, పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలను అప్రమత్తం చేశారు.
క్రీడా రంగంలో సరికొత్త చరిత్ర
భారతీయ అథ్లెట్ల అద్భుత ప్రదర్శనలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల రాంచీలో జరిగిన నేషనల్ సీనియర్ అథ్లెటిక్స్ ఫెడరేషన్ పోటీల్లో మన క్రీడాకారులు సృష్టించిన రికార్డులను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. గురిందర్‌వీర్ సింగ్, విశాల్ టికె, తేజస్విన్ శంకర్, దేవ్ మీనా, కుల్దీప్ కుమార్ వంటి క్రీడాకారులు సాధించిన మైలురాళ్లు దేశానికి గర్వకారణమని కొనియాడారు. ముఖ్యంగా 100 మీటర్ల స్ప్రింట్‌లో రెండు రోజుల్లోనే మూడుసార్లు జాతీయ రికార్డులు బద్దలవ్వడం, భారతీయ అథ్లెటిక్స్ ఎదుగుదలకు నిదర్శనమని ఆయన ఉద్ఘాటించారు.
Sharing this month's #MannKiBaat. Do tune in! https://t.co/FhoBe0Hp6L
— Narendra Modi (@narendramodi) May 31, 2026
ఎండల తీవ్రత - జాగ్రత్తలే శ్రీరామరక్ష
ప్రస్తుత వేసవి కాలంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల పట్ల ప్రధాని మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశ ప్రజలు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. వడగాల్పుల బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు తాగుతూ, ఎండలో అనవసర ప్రయాణాలను నివారించాలని కోరారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి అవసరమైన భద్రతా చర్యలు పాటించాలని ఆయన కోరారు.
చరిత్ర పుటల నుంచి నూతన ప్రయాణం
మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా గత ఎపిసోడ్ విశేషాలను కూడా ప్రధాని గుర్తుచేశారు. ఏప్రిల్ 27న జరిగిన 133వ ఎపిసోడ్లో నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ముఖ్యంగా, ‘ఆర్కైవ్స్ వాల్ పోర్టల్’ ద్వారా దాదాపు 20 కోట్ల చరిత్రక పత్రాలను డిజిటల్ రూపంలో సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం భారత చరిత్రను భద్రపరచడంలో ఒక గొప్ప అడుగు అని మోదీ అభివర్ణించారు.


