సాక్షి, ఢిల్లీ: తెలంగాణ ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. అదే సమయంలో ప్రధాని సహాయ నిధి నుంచి పరిహారం ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి(PMNRF) నుంచి మరణించిన ప్రతి వ్యక్తి కుటుంబానికి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సహాయం) అందించబడుతుంది. గాయపడిన వారికి రూ. 50,000 చెల్లించబడుతుంది అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారాయన.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో జరిగిన దుర్ఘటనలో సంభవించిన ప్రాణనష్టం నన్ను చాలా బాధించింది. ఈ క్లిష్ట సమయంలో బాధితులు, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మరణించిన వారి కుటుంబానికి పీఎంఎన్ ఆర్ ఎఫ్ నుండి రూ.2…— PMO India (@PMOIndia) November 3, 2025
తాండూరు డిపో నుంచి ప్రయాణికులతో బయల్దేరిన బస్సు.. మీర్జాగూడ క్రాస్ వద్ద ఘోర ప్రమాదానికి గురైంది. కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీ అదుపు తప్పి బస్సును ఢీ కొట్టింది. ఆపై కంకర లోడు మొత్తం బస్సులోకి పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్పాట్‌లోనే కన్నుమూశారు.

తెలంగాణ ప్రభుత్వం మీర్జాగూడ బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.


