అమ్మో.. ఒకటో తారీఖు! ఇక ‘ధరల తుపాను’ మొదలా? | Petrol Shock: Is India Heading Towards Massive Price Storm Tomorrow | Sakshi
Sakshi News home page

అమ్మో.. ఒకటో తారీఖు! ఇక ‘ధరల తుపాను’ మొదలా?

May 25 2026 7:31 AM | Updated on May 25 2026 8:30 AM

Petrol Shock: Is India Heading Towards Massive Price Storm Tomorrow

దాదాపు నాలుగేళ్ల తర్వాత దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఒక్కసారిగా పెరగడం కేవలం వాహనదారులకు షాక్‌ మాత్రమే కాదు.. రాబోయే భారీ ఆర్థిక తుపానుకు సంకేతమా? అనే చర్చ మొదలైంది. అమెరికా–ఇరాన్‌ యుద్ధం, హర్ముజ్‌ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలు దెబ్బతినడంతో.. భారతదేశంలో ఇంధన ధరలు వరుసగా పెరుగుతున్నాయి. కానీ ఈ పెంపు ప్రభావం కేవలం పెట్రోల్‌ బంకుల వరకే పరిమితం కాదని.. త్వరలోనే ప్రతి ఇంటి బడ్జెట్‌ను కుదిపేసే పరిస్థితి రావొచ్చని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు.

తాజాగా సోమవారం పెట్రోల్‌పై లీటర్‌కు రూ.2.61, డీజిల్‌పై రూ.2.71 చొప్పున పెంచాయి ఆయిల్‌ కంపెనీలు. ఇప్పటికే మే 15, 19, 23 తేదీల్లో కూడా వరుస పెంపులు చోటుచేసుకోవడంతో.. పదిరోజుల వ్యవధిలోనే పెట్రోల్‌పై మొత్తం రూ.7.34, డీజిల్‌పై రూ.7.45 వరకు భారమైంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.117 దాటగా.. హైదరాబాద్‌, విశాఖ, తిరుపతి వంటి నగరాల్లోనూ ఇంధన ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 

ఇప్పుడు సామాన్యుల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఒక్కటే.. “అమ్మో.. ఒకటో తారీఖు!”. ఎందుకంటే జీతాలు ఖాతాల్లో పడే సమయానికే గ్యాస్‌ సిలిండర్‌ ధరలపై మరో పెంపు ప్రకటన వచ్చే అవకాశముందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు పెరగడంతో.. గృహ వినియోగ LPG సిలిండర్‌ రేట్లు కూడా త్వరలో పెరగొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే.. మిగతా నిత్యావసరాల ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆందోళనలకు అసలు కారణం మాత్రం ఇంధర ధరల పెంపే. 

భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా కీలక పాత్ర పోషిస్తుంది. కూరగాయల నుంచి పాలు వరకు.. ఆన్‌లైన్‌ డెలివరీ నుంచి విమాన టికెట్ల వరకు.. అన్నీ డీజిల్‌, పెట్రోల్‌పైనే ఆధారపడి ఉంటాయి. దీంతో ఇంధన ధరలు పెరిగిన ప్రతిసారి ఆ ప్రభావం నేరుగా సామాన్యుడి జేబుపైనే పడుతుంది. ముందుగా ప్రజా రవాణా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు, ట్యాక్సీల ఛార్జీలు పెరగొచ్చని సంకేతాలు వస్తున్నాయి. 

సరుకు రవాణా ఖర్చులు పెరిగితే మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పాలు, నిత్యావసర వస్తువుల ధరలు మరింత ఎగసిపడే అవకాశం ఉంది. ఇప్పటికే కమర్షియల్‌ గ్యాస్‌ ధరలు పెరిగాయి. త్వరలోనే గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్‌ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఫుడ్‌ డెలివరీ యాప్‌లు, ఈ-కామర్స్‌ కంపెనీలు కూడా డెలివరీ ఛార్జీలను పెంచే దిశగా అడుగులు వేయొచ్చని అంచనా. ప్రస్తుతం భారీ డిస్కౌంట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న కంపెనీలు.. పెరిగిన లాజిస్టిక్స్‌ ఖర్చుల కారణంగా ఆ ఆఫర్లను తగ్గించే అవకాశం ఉంది. కనీస ఆర్డర్‌ విలువ పెరగడం, డెలివరీ ఫీజులు అధికమవడం వంటి మార్పులు కనిపించొచ్చు.

గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. రైతులు ట్రాక్టర్లు, మోటార్లు, నీటి పంపులు వంటి వ్యవసాయ పరికరాల కోసం డీజిల్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. డీజిల్‌ ధరలు పెరిగితే సాగు ఖర్చులు పెరిగి.. చివరకు ఆ భారం కూడా ఆహార ధరల రూపంలో ప్రజలపైనే పడుతుంది.

ఇప్పటివరకు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్‌ సుంకాలను తగ్గిస్తూ వచ్చింది. కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు మరింత పెరుగుతుండటంతో ఇప్పుడు కేంద్రానికీ పరిమితులే కనిపిస్తున్నాయి. అమెరికా–ఇరాన్‌ ఉద్రిక్తతలు త్వరలో చల్లారే సూచనలు లేకపోవడం, హర్ముజ్‌ మార్గంలో అనిశ్చితి కొనసాగుతుండటంతో రాబోయే రోజుల్లో మరిన్ని ధరల పెంపులు తప్పవన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఇంధన ధరల పెంపు అంటే కేవలం బైక్‌కు పెట్రోల్‌ కొట్టించుకునే ఖర్చు పెరగడం మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం మళ్లీ ఉద్ధృతం కావడానికి అది ఆరంభ సంకేతమని పలువురు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ‘సర్దుకుపోదాం’ అనుకున్న సామాన్యుడు.. ఇక ముందు ‘ఎంత తగ్గించుకుని బతకాలి?’ అనే పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చనే ఆందోళన పెరుగుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement